కామారెడ్డి/బిచ్కుంద, మార్చి 26: జుక్కల్ మండల కేంద్రంలోని టెన్త్ ఎగ్జామ్ సెంటర్ ఆవరణలో తెల్ల కాగితంపై రాసి ఉన్న ప్రశ్నలు కనిపించిన ఉదంతం బుధవారం జిల్లాలో కలకలం రేపింది. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. బుధవారం గణిత పరీక్ష నిర్వహించగా, విద్యార్థులకు ఇచ్చిన పేపర్లోని నాలుగు ప్రశ్నలు రాసి ఉన్న కాగితం కేంద్రం బయట కనిపించినట్లు ప్రచారం జరిగింది. ఈ వ్యవహారంపై కొంత మంది ఫిర్యాదు చేయడంతో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, డీఈవో రాజు పరీక్షా కేంద్రానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రస్తుతానికి చీఫ్ సూపరింటెండెంట్ సునీల్, డిపార్ట్మెంట్ ఆఫీసర్ భీమ్, ఇన్విజిలేటర్ దీపికను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు డీఈవో తెలిపారు.
విభిన్న కోణాల్లో విచారణ..
ప్రశ్నలు ఎప్పుడు బయటికి వచ్చాయి? పరీక్ష జరుగుతున్న సమయంలోనే బయటకు వచ్చాయా? లేక అయిపోయిన తర్వాతనా అన్న దానిపై అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. ఎగ్జామ్ సెంటర్లో పని చేసే వారే ప్రశ్నలను బయటకు పంపించారా? ఇందులో ఎవరెవరి ప్రమేయముంది? తదితర అంశాలపై విచారిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు, ఈ ఉదంతంపై డీఈవో రాజు జుక్కల్ పోలీసుస్టేషన్లో ఫి ర్యాదు చేసినట్లు సమాచారం. మ రోవైపు, పేపర్ లీకేజ్ కాలేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ప్రశ్నలు బయటికి ఎలా వచ్చాయన్న దానిపై ఎవరూ నోరు మెదపడం లేదు.
ఈ అంశాన్ని పోలీసులే తేలుస్తారని చెబుతున్నారు. ఎక్కడా సమస్యలు లేకుండా పరీక్షలు జరుగుతున్నాయని, ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్షలు యథావిధిగా జరుగుతాయని, విద్యార్థులెవరూ భయపడకుండా పరీక్షలు రాయాలని అధికారులు సూచించారు.
విచారణ తర్వాతే..
జుక్కల్ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఘటన తమ దృష్టికి వచ్చిందని, ఏం జరిగిందనేది విచారణ తర్వాతే వెల్లడిస్తామని డీఈవో రాజు చెప్పారు. జుక్కల్ ఉదంతంపై ఆయనను ‘నమస్తే తెలంగాణ’ ఫోన్లో సంప్రదించగా పై విధంగా తెలిపారు. ప్రశ్నల గురించి సోషల్ మీడియాలో పోస్టులు రావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పరీక్షా కేంద్రానికి వెళ్లి విచారణ చేపట్టామన్నారు. ప్రశ్నాపత్రంలోని కొన్ని ప్రశ్నలు ఒక పేపర్ మీద రాసినట్లు గుర్తించామని చెప్పారు. అయితే, ఇది పరీక్షకు ముందు జరిగిందా.. లేక పరీక్ష అయిపోయిన తర్వాత జరిగిందా? అన్న కోణంలో విచారిస్తున్నామని తెలిపారు. విచారణ పూర్తయ్యాకే అన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు. ప్రస్తుతానికి ముగ్గురిని విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు.