ధర్పల్లి, జూన్ 29: సహజ సంపదను కొందరు కొల్లగొడుతున్నారు. ఇసుక, మొరం అక్రమ తవ్వకాలతో దోచుకుంటున్నారు. ధర్పల్లి మండలంలో ఈ దందా జోరుగా సాగుతున్నది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇసుకాసురులకు అడ్డే లేకుండా పోతున్నది. ఇటీవల మైలారంలో చీతాఫోర్స్ దాడి చేసి అక్రమంగా మొరం తరలిస్తున్న ట్రిప్పర్లను పట్టుకోవడమే అందుకు నిదర్శనం. మరోవైపు, ఇసుక కూడా ఇష్టమొచ్చినట్లు తరలించుకుపోతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇండ్లు నిర్మించుకునే వారు మొరం, ఇసుక కోసం అనుమతులు అడిగితే నిబంధనల పేరిట తిప్పుతున్నారని, అదే అక్రమార్కులకు మాత్రం ఏ నిబంధనలు వర్తించవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అనుమతుల పేరిట కొందరు అక్రమ దందా చేస్తున్నారని, ఒక్క డీడీతో రోజంతా మొరం, ఇసుక తరలిస్తున్నారని చెబుతున్నారు. ఒక్క ట్రిప్పుకు అనుమతి తీసుకుని, పదుల సంఖ్యలో ట్రిప్పులు కొడుతున్నారని పేర్కొంటున్నారు. ఇటీవల మైలారం గ్రామంలో 9 ట్రాక్టర్లు అనుమతితో మొరం తరలిస్తుండగా, మూడు ట్రాక్లర్లు అనుమతి లేకుండా మొరం తరలిస్తున్నట్లు గుర్తించి చీతా ఫోర్స్ అధికారులు పట్టుకుని కేసులు నమోదు చేశారు.
అయితే, మండలంలో ఇసుక, మొరం అక్రమ దందా సాగుతున్నా సంబంధిత అధికారులు సరైన పర్యవేక్షణ పెట్టక పోవడం, పట్టించుకోక పోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులతో కుమ్మక్కైన అక్రమార్కులు యథేచ్ఛగా సహజ సంపదను దోచుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. మండలంలో సాగుతున్న అక్రమ దందాపై తహసీల్లార్ శాంతను వివరణ కోరగా, డీడీల ప్రకారమే వే బిల్లులు జారీ చేస్తున్నామని చెప్పారు. మైలారంలో మొరం తరలింపుపై చీతాఫోర్స్ దాడి చేసిన ఘటనలో ఆర్ఐకి, సంబంధిత జీపీవోకు నోటీసులు ఇచ్చామన్నారు. గతంలో రేకులపల్లిలో ఒక నాయకుడు మొరం తరలిస్తున్న విషయం తెలిసి, అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు. అనుమతులు లేకుండా ఎవరూ కూడా మొరం తవ్వకాలు చేపట్టవద్దని సూచించారు.