కామారెడ్డి, మే 12 : పాలిటెక్నిక్ (డిప్లొమా) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పాలిసెట్ ఉమ్మడి జిల్లాలో మంగళవారం జరగనున్నది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. కామారెడ్డి జిల్లాలో ఆరు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కో-ఆర్డినేటర్ విజయ్‌కుమార్ తెలిపారు. మొత్తం 2900 మంది పరీక్షకు హాజరుకానున్నారని పేర్కొన్నారు.
పరీక్ష ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహిస్తారని తెలిపారు. అభ్యర్థులను ఉదయం 10 గంటల నుంచే పరీక్షాకేంద్రంలోకి అనుమతిస్తారని పేర్కొన్నారు. నిమిషం నిబంధన అమలుచేస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు తమ వెంట ఒక హెచ్‌బీ పెన్సిల్, బ్లాక్ ఆర్ బ్లూ పాయింట్ పెన్, హాల్‌టికెట్ తీసుకొని రావాలని సూచించారు.
పరీక్షా కేంద్రంలోకి వాచ్‌లు, మొబైల్ ఫోన్లు, పర్సులు, షూ, ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోరని స్పష్టం చేశారు. హాల్‌టికెట్ పై ఫొటో స్పష్టంగా లేని అభ్యర్థులు గెజిటెడ్ ఆఫీసర్ ద్వారా ధ్రువీకరణ చేయించుకోవాలని సూచించారు. పా లిసెట్ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని సాందీపని డిగ్రీ కళాశాలలో ఇన్విజిలేటర్లకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో చీఫ్ సూపరింటెండెంట్ సాయిబాబు, మనోజ్‌కుమార్,ఆబ్జర్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
నిజామాబాద్‌లో 16 పరీక్షా కేంద్రాలు
ఖలీల్‌వాడి, మే12: నిజామాబాద్ జిల్లాలో పాలిసెట్ కోసం మొత్తం 16 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా పరీక్షకు 6,542 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. పాలిసెట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు.