తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఎనిమిది విడుతల్లో మొక్కలు నాటి వాటి సంరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో సత్ఫలితాలు వచ్చాయి. ఇదే ఉత్సాహంతో తొమ్మిదో విడుతకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాకు భారీ లక్ష్యాన్ని కేటాయించారు. వచ్చే జూలైలో మొత్తం 47 లక్షల మొక్కలను నాటనున్నారు. ముఖ్యంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు 28 లక్షలు, మిగిలిన అన్ని శాఖలు 19 లక్షల మొక్కలను నాటాలని నిర్ణయించారు. బృహత్ ప్రణాళిక పేరుతో వంద శాతం లక్ష్యాన్ని చేరుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశాలు సైతం జారీ అయ్యాయి. ఇందుకోసం అధికార యంత్రాంగం కార్యాచరణ రూపొందించింది. జిల్లాలోని మొత్తం 530 పంచాయతీల పరిధిలో 30.14 లక్షల మొక్కలను నాటేందుకు ప్రణాళిక రూపొందించారు. ప్రధానంగా ఒక్కో ఇంటి ఆవరణలో ఆరు మొక్కల చొప్పున నాటించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి పంచాయతీ పరిధిలో నిర్వహిస్తున్న నర్సరీల్లో 12వేల చొప్పున మొక్కలను పెంచి నాటాలని లక్ష్యాన్ని నిర్దేశించారు.
డిచ్పల్లి, ఏప్రిల్ 23 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో తొమ్మిదో విడుతకు సిద్ధమైంది. 2022-2023 సంవత్సరానికి గాను నిజామాబాద్ జిల్లాకు భారీ లక్ష్యాన్ని నిర్ణయించింది. 47లక్షల మొక్కలను నాటేందుకు లక్ష్యంగా నిర్ణయించగా పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్కు 28లక్షలు టార్గెట్ కాగా, మిగిలిన అన్ని శాఖల ద్వారా 19 లక్షల మొక్కలను నాటాలని నిర్ణయించారు. ఈ మేరకు అన్ని శాఖలకు డీఆర్డీఏ ద్వారా జీవోలు సైతం జారీ చేశారు. ఇందుకోసం బృహత్ ప్రణాళికను సైతం రూపొందించింది. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో పెద్ద సంఖ్యలో అన్ని శాఖల ఆధ్వర్యంలో మొక్కలను నాటేందుకు ఇప్పటికే మార్గదర్శకాలను విడుదల చేసింది. బృహత్ ప్రణాళిక పేరుతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని ఇప్పటికే అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలోని రూరల్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్ శాఖల ద్వారా మొత్తం 530 గ్రామ పంచాయతీలకు లక్ష్యాన్ని నిర్దేశించి దాని ప్రకారం ముందుకు సాగాలని ప్రభుత్వం సూచించింది. వచ్చే జూలైలో నిర్వహించే తొమ్మిదో విడుత తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి సర్వం సిద్ధం చేసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులకు ఉత్తర్వులు అందాయి. అందుకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం ఇప్పటికే ప్రణాళిక అమలు కోసం కసరత్తు మొదలుపెట్టింది.
మండలానికి ఒకటి చొప్పున ప్రకృతి వనాలు..
ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల ప్రకారం బృహత్ ప్రకృతి వనాల పేరుతో జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లోనూ ఒకటి చొప్పున ఏర్పాటు చేయనున్నారు. వీటిని పది ఎకరాల స్థలంలో ఏర్పాటు చేస్తారు. మొత్తం 27 మండలాలకు బృహత్ ప్రకృతి వనాలను కేటాయించారు. వీటిలో ఇప్పటికే జిల్లాలో 26 బృహత్ పల్లె ప్రకృతి వనాలకు స్థలాల ఎంపికను పూర్తి చేశారు. వీటిలో 5.23లక్షల మొక్కలను నాటారు. అందుకు రూ.16.70 కోట్లను ఖర్చు చేశారు. అంతేకాకుండా జిల్లాలోని అన్ని మండలాల్లో మండలానికి నాలుగు చొప్పున మినీ బృహత్ ప్రకృతి వనాల పేరుతో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. జిల్లాలో మొత్తం 135 మినీ బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. అయితే వీటిలో ఇప్పటికే 116 మినీ బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు కూడా పూర్తయ్యింది. మిగిలిన వాటి ఏర్పాటు విషయంలో పనులు పురోగతిలో ఉన్నాయి.
ప్రతి జీపీకి టార్గెట్..
తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రస్తుత సంవత్సరానికి గాను నిర్ణయించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఇప్పటికే గ్రామ పంచాయతీలకు ఉత్తర్వులు అందాయి. ప్రతి జీపీ పరిధిలో నిర్వహిస్తున్న నర్సరీల్లో 12వేల మొక్కలు పెంచిన వాటిని నాటాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. వీటిలో ప్రధానంగా మునగ మొక్కలను పెంచాలని, వాటినే నాటాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రతి జీపీలో 12వేల మొక్కలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం 47 లక్షల మొక్కలను నాటాలని సూచించింది. ఈసారి నిర్వహించే తొమ్మిదో విడుత హరితహారం కార్యక్రమాన్ని వందశాతం విజయవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఈ సారి ఇండ్లకు పంపిణీ..
తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా కొత్తగా రూపొందించిన బృహత్ పల్లె ప్రకృతి వనాల నిర్వహణలో భాగంగా పెంచిన మొక్కలను ఇంటి ఆవరణలో నాటేందుకు ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. వారికి అవసరమైన మొక్కలను పంపిణీ చేయనున్నారు. నిజామాబాద్ జిల్లాలోని మొత్తం 530 గ్రామ పంచాయతీలకు గాను 30.14లక్షల మొక్కలను నాటేందుకు ప్రణాళికను రూపొందించింది. ప్రధానంగా ప్రజల ఇంటి ఆవరణలో మొక్కలు నాటించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు 12.14లక్షల మొక్కలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. మిగిలిన 18లక్షల మొక్కలను ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఉండే వివిధ ఖాళీ స్థలాలు, అవసరమైన చోట్లలో నాటేందుకు సిద్ధం చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. మొత్తంగా వందశాతం ప్లాంటేషన్ పూర్తి చేయాలని నిర్దేశించారు.
శాఖల వారీగా లక్ష్యం ఇలా..
రూరల్ డెవలప్మెంట్, పంచాయతీ రాజ్ : 28లక్షలు
మున్సిపల్ కార్పొరేషన్ నిజామాబాద్: 12లక్షలు
బోధన్ మున్సిపాలిటీ : 1,97,523
ఆర్మూర్ మున్సిపాలిటీ : 1,56,514
భీమ్‌గల్ మున్సిపాలిటీ : 42వేలు
ఫారెస్ట్ డిపార్ట్మెంట్ : 1,10,000
ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ : 65వేలు
హార్టికల్చర్ అండ్ సెరికల్చర్ డిపార్ట్మెంట్ : 45వేలు
పోలీస్ డిపార్ట్మెంట్ : 20వేలు
ఇరిగేషన్ డిపార్ట్మెంట్ : 10,100
వ్యవసాయ శాఖ : 8వేలు
డిస్ట్రిక్ వెల్ఫేర్ ఆఫీస్ : 7,375
మైన్స్, జియోలాజీ డిపార్ట్మెంట్: 3వేలు
డీఎస్వో : 3వేలు
పౌరసరఫరా శాఖ : 3వేలు
మత్స్యశాఖ : 2,600
హౌసింగ్, డబుల్ బెడ్రూం ఇండ్లకు : 2280
విద్యాశాఖ : 2వేలు
డీటీసీ ట్రాన్స్‌కో డిపార్ట్మెంట్: 2వేలు
జైళ్ల శాఖ : 2వేలు
ఇండస్ట్రీయల్ డిపార్ట్మెంట్ : 2వేలు
మెడికల్ హెల్త్‌కు : 1,990
మార్కెటింగ్ డిపార్ట్మెంట్కు : 1,920
విద్యుత్ శాఖ 1,617
కార్పొరేషన్ డిపార్ట్మెంట్ : 1,600
డిచ్పల్లి ఏడవ బెటాలియన్ : 1,500
టూరిజం డిపార్ట్మెంట్ : 1,200
ఎండోమెంట్ డిపార్ట్మెంట్ : 1,100
రైల్వేశాఖ : 1,000
డెయిరీ : 1,000
ఇంటర్మీడియట్ డిపార్ట్మెంట్: 710
ఆర్టీసీ : 700
జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ : 500
వెటర్నరీ అండ్ యానిమల్ హజ్బెండరీ : 400
ఎస్సీ వెల్ఫేర్ : 394
మిషన్ భగీరథ : 250
డిస్ట్రిక్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్: 225
బీసీ వెల్ఫేర్ : 100
డీఎంసీఎస్ డిపార్ట్మెంట్: 100
ఆర్డబ్ల్యూఎస్ : 100
ఆర్అండ్బీ డిపార్ట్మెంట్ : 100
మైనార్టీ వెల్ఫేర్: 50
ఫైర్ డిపార్ట్మెంట్: 25
మొత్తం : 46,99,973