రామారెడ్డి జూలై 4: రామారెడ్డి మండలం కన్నాపూర్ తండాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అడ్డంకులు తొలగాయి. 2005 నుంచి నివాసం ఉంటున్న కుటుంబాలకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చి, ఇందిరమ్మ ఇండ్లను పునర్నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. కన్నాపూర్ తండాను ఇందిరమ్మ ఇండ్ల పథకానికి పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఇక్కడ నివాసముంటున్న 86 పేద కుటుంబాలను గుర్తించి ఇండ్లు మంజూరు చేశారు.
19 మంది ఇండ్ల నిర్మాణానికి ముందుకురాగా.. కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఇండ్ల నిర్మాణాలకు ప్రారంభోత్సవం చేశారు. ప్రస్తుతం 10 ఇండ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉండగా, ఆరింటిని అసలు ప్రారంభించనే లేదు. అయితే, మరో మూడు ఇండ్లకు అధికారులు కొర్రీలు పెట్టి ఆపేశారు. ఇక, పనులు కొనసాగిస్తున్న ఇండ్లకు అసలు బిల్లులే చెల్లించలేదు. దీనిపై నమస్తే తెలంగాణ దినపత్రికలో ‘గుడిసె పోయే.. గూడూ పోయే’ శీర్షికన ఈ నెల 26న కథనం ప్రచురితమైంది. దీనికి అధికారులు స్పందించారు.
శుక్రవారం గ్రామంలో వివిధ శాఖల అధికారులతో సభ ఏర్పాటుచేశారు. అర్ధాంతరంగా నిలిచిపోయిన ఇండ్ల నిర్మాణం పూర్తిచేయాలని నిర్ణయించారు. 2005 నుంచి ఇక్కడ నివసిస్తున్న కుటుంబాలకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చి, ఇందిరమ్మ ఇండ్లను పునర్నిర్మించుకునేలా తీర్మానం చేశారు. తీర్మాన కాపీలను డివిజన్, జిల్లాట్రైబల్ వెల్ఫేర్ అధికారులకు అందజేస్తామని స్థానిక ఎంపీడీవో తిరుపతిరెడ్డి తెలిపారు. సమావేశంలో ఎఫ్ఆర్సీ కమిటీతోపాటు అటవీ, రెవెన్యూ, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.