బాన్సువాడ రూరల్, మే 5: ఉపాధి హామీ కూలీలకు కొత్త చిక్కు వచ్చి పడింది. పని ప్రదేశంలో హాజరు విధానం తలనొప్పి తెచ్చి పెట్టింది. వీబీ – జీ రామ్ జీ (గ్రామీణ ఉపాధి హామీ పథకం)లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పు సరికొత్త సమస్యలకు కారణమవుతున్నది. పథకం అమలులో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త విధానం అమలులోకి తీసుకొచ్చినప్పటికీ, ఆచరణలో ఉత్పన్నమయే లోపాలను ఎప్పటికప్పుడు సరి చేసకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది. కానీ ఉపాధి హామీ పథకంలో అలా కన్పించడం లేదు. కేంద్రం తీసుకొచ్చిన ఎన్ఆర్ఈజీఎస్ మొబైల్ యాప్ కూలీలకు కష్టాలు తెచ్చిపెడుతున్నది. ఫొటో క్యాప్చరింగ్ అటెండెన్స్ విధానంలో ఉన్న లోపాలతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కేంద్రం తీసుకొచ్చిన మార్పులు.. పథకం ఉద్దేశాన్ని నిరుగార్చే విధంగా కనిపిస్తున్నాయి.
యాప్‌తో కూలీల అవస్థలు..
ఈజీఎస్ పనుల్లో నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ (ఎన్ఎంఎంఎస్)యాప్ ద్వారా కూలీల హాజరు నమోదు ప్రక్రియను అమలు చేస్తున్నారు. అయితే ఈ విధానం కూలీలకు తలనొప్పిగా మారింది. సాంకేతిక సమస్యలతో కొత్త ఇబ్బందులు తెచ్చి పెడుతున్నది. పని ప్రదేశంలో ఇంటర్నెట్, సర్వర్ సమస్యలతో ఫొన్లో ఫొటోలు స్కాన్ కావడం లేదు. ఫొటో క్యాప్చరింగ్ అటెండెన్స్ విధానంతో కొన్ని సందర్భాల్లో కూలీల హాజరు నమోదు కాక వారు వేతనాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది.
మొబైల్లో ఫొటో దిగేందుకు గంటల తరబడి ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. కొందరి కూలీల ఫొటోలు స్కాన్ కాకపోవడంతో క్షేత్ర సహాయకులు కూలీలను కింద పడుకోబెట్టి తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు, పని ప్రదేశాల వద్ద కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో కూలీలు ఎండవేడిని తాళలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ నుంచి ఉపశమనానికి నీడ వసతి, తాగునీరు, ప్రథమ చికిత్స కిట్లు పని ప్రదేశంలో కల్పించాల్సి ఉంది. కానీ ఇవేమీ కనిపించడం లేదు.

అటెండెన్స్ రెండు సార్లు..
పని లేని నిరుపేదలకు ఏడాదిలో కనీసం వంద రోజుల పాటు పని కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం.. 2006లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్ఆర్ ఈజీఎస్) చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే, తాజాగా ఈ పథకం పేరును వికసిత్ భారత్-గ్రామీణ రోజ్‌గార్ అజీవిక మిషన్ (వీబీ – జీ రామ్ జీ)గా మార్చిన కేంద్రం.. చట్టంలో సరికొత్త మార్పులు చేపట్టింది.
పని ప్రారంభంలో, ముగింపు సమయంలో పని ప్రదేశంలోనే కూలీలకు రెండు సార్లు ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా వారి ఫొటోలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సమస్యల కారణంగా ఫొటోలు అప్లోడ్ కాకపోవడంతో కూలీలు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కొత్త యాప్ కారణంగా క్షేత్ర సహాయకులు నిర్దేశించిన మేరకు పనులు చేయించలేక, కూలీల ఫొటోలు తీసి ఆప్‌లోడ్ చేయడానికే పరిమితం అవుతున్నారు. దీంతో ఆసలు ఈ పథకం ఉద్దేశం పూర్తిగా నీరుగారుతున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

కూలీల పొట్ట కొట్టేందుకే ఈ యాప్
ఉపాధి హామీలో కొత్తగా తీసుకొచ్చిన ఫొటో అటెండెన్స్‌తో చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే కుట్ర జరగుతున్నది. కొత్త కొత్త నిబంధనలు తీసుకురావడంతో ఇప్పటికే పనులకు వస్తున్న కూలీల సంఖ్య భారీగా తగ్గింది. ఇక సిగ్నల్ రాక, సర్వర్ డౌన్ కారణంగా హాజరు పడుతున్నదో, లేదో తెలుస్తలేదు.
– షేక్ హజీ, కోనాపూర్
సర్కారు పనిని బంద్ చేసే కుట్ర..
చాలా రోజుల ఉపాధి పనులకు వస్తున్న. కొత్తగా వచ్చిన ఫొటో యాప్ వల్ల మస్తు ఇబ్బందులు అయితున్నయ్. పనులు చేసుడు ఒక వంతైతే, ఫొటో దిగుడు మరో వంతైతున్నది. మోదీ ప్రభుత్వం సర్కారు పనిని బందు చేసేందుకు కుట్ర పన్నుతున్నది. పనికి వచ్చే వారందరూ ఫొటోలు దిగాలంటే గంటలు పడుతున్నది. అప్పుడప్పుడు ఫోనులో ఫొటోలు అస్తలేవు. పాత పద్ధతిలోనే తీసుకోవాలి.
– మూడ సత్యవ్వ, హన్మాజీపేట్
కనీస సౌకార్యలు కల్పించాలి
ఉపాధి హామీ పనులు కల్పిస్తున్నప్పటికీ పని ప్రదేశంలో కనీస సౌకార్యలు సరిగా ఉంటలేవు. ఎండలు ఎక్కువగా ఉన్నాయి. నీడ సౌకర్యం లేకపోవడంతో చెట్ల కింద సేద తీరుతున్నాము. పని ప్రదేశంలో కూలీలకు నీడ, తాగునీటి సౌకర్యంతో పాటు ప్రథమ చికిత్స కిట్లను ఉంచాలి. నీడ వసతి కల్పించకుంటే వడదెబ్బ తగులుతుంది. అధికారులు చొరవ తీసుకొని కనీస సౌకర్యాలు కల్పించాలి.
– భూమాగౌడ్, హన్మాజీపేట్
సర్వర్ డౌన్‌తో సమస్యలు..
ఫొటో క్యాప్చర్ ద్వారా కూలీల అటెండెన్స్ తీసుకుంటున్నాము. కొంత మంది కూలీల ఫొటోలు తీసిన తర్వాత సర్వర్ డౌన్ అవుతుండడంతో ఫొటో క్యాప్చర్‌కు ఇబ్బందులు వస్తున్నాయి. అటవీ ప్రాంతాల్లో పనులు జరుగుతుండడంతో అప్పుడప్పుడు సిగ్నల్ సమస్య తలెత్తుతున్నది. ఆలస్యమైనా కూలీలందరి అటెండెన్స్ ఎన్ఎంఎంఎస్ విధానంలోనే తీసుకుంటున్నాం.
– హనీఫ్, ఫీల్డ్ అసిస్టింట్, కోనాపూర్