శక్కర్‌నగర్, జూలై 19: ఎన్ఎస్ఎఫ్ కార్మికులను ఆదుకోవాలని కోరుతూ ఫ్యాక్టరీ మెయిన్ గేట్ వద్ద కార్మిక, రైతు సంఘాల నాయకులు శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఫ్యాక్టరీకి అక్రమ లేఆఫ్ ప్రకటించి కార్మికుల కుటుంబాలను రోడ్డున పారవేశారని ఆవేదన వ్యక్తంచేశారు. సుమారు పదేండ్లుగా కార్మికులకు ఎలాం టి వేతనాలు రాక, తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారని పేర్కొన్నారు.
ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీ పునరుద్ధరణ కమిటీ కాలయాపన కమిటీగా మారిందని విమ ర్శించారు. ఫ్యాక్టరీ ప్రారంభంపై ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ కార్మికులు, రైతులను మభ్యపెడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికులను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ బోధన్ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్, కార్మిక సంఘాల నాయకులు ఉపేందర్, రవిశంకర్ గౌడ్, సత్యనారాయణ, రైతు సంఘాల నాయకులు కేపీ శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, భిక్షపతి, ఫయాజ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.