బీబీపేట్, ఫిబ్రవరి 4: ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు బ్యాంకర్ల తీరుతో రైతు లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రుణమాఫీ చేయక రేవంత్ సర్కారు మోసగిస్తే, లోన్లు రెన్యూవల్ చేసుకోవాలని బ్యాంకర్లు వేధిస్తున్నారు. ఈ మేరకు బ్యాంకులు నోటీసులు పంపుతుండడంతో కర్షకులు ఆందోళన చెందుతున్నారు. రైతులందరికీ రూ.2 లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రె స్ పార్టీ ఎన్నికల ముందర ఊదరగొట్టింది. తీరా అధికారంలోకి వచ్చాక కొం త మందికే మాఫీ చేసి, మిగతా వారికి మొండిచేయి చూపింది. ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందన్న నమ్మకంతో రైతులు లోన్లు రెన్యూవల్ చేసుకోలేదు. దీన్ని ఆసరాగా తీసుకుని బ్యాంకర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. తరచూ నోటీసులు పంపుతున్నారని బీబీపేటతో పాటు చుట్టుపక్కల గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మోసగించిన కాంగ్రెస్..
ఓట్ల కోసం రైతులపై వరాలు కురిపించిన కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కాక మోసం చేసింది. రైతులందరికీ రూ.2 లక్షల లోపు రుణమాఫీ, ఎకరాకు రూ.15 వేల చొప్పున రైతుభరోసా, కౌలు రైతులకు రూ.12 వేల ఆర్థిక సాయం, అన్ని పంటలకు రూ.500 బోనస్ వర్తింపు వంటి హామీలెన్నో ఇచ్చింది. తీరా అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కటి సంపూర్ణంగా అమలు చేయలేక చేతులెత్తేసింది. ఉమ్మడి జిల్లాలో కొంత మందికే మాఫీ చేసిన రేవంత్ సర్కారు.. సగానికంటే ఎక్కువ మంది రైతులకు రిక్త‘హస్తం’ చూపింది. అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్.. సన్నవడ్లకు మా త్రమే అంటూ రైతాంగాన్ని నిలువునా ముంచింది. మరోవైపు, రైతుభరోసా కింద ఎకరాకు రూ.15 వేలు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం మొదటికే మోసం చేసింది. కనీసం కేసీఆర్ ఇచ్చినట్లు రూ.10 వేలు అయినా ఇవ్వకుండా రెండు సీజన్లలో పెట్టుబడి సాయం ఎగ్గొట్టింది. బీఆర్ఎస్ పోరాటాలతో దిగివచ్చిన ప్రభుత్వం జనవరి 26 నుంచి రైతుభరోసా ఇస్తామని ప్రకటించింది. కానీ మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి, ఆ గ్రామ రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం ఇచ్చి మిగతా వారిని విస్మరించింది.
బ్యాంకర్ల ఒత్తిడి..
పంట రుణాలు తిరిగి చెల్లించవద్దని, కాంగ్రెస్ ప్ర భుత్వం రాగానే మాఫీ చేస్తుందని రేవంత్‌రెడ్డి సహా ఆ పార్టీ నేతల ప్రకటనలను రైతులు నమ్మి మోసపోయారు. కాంగ్రెస్ నాయకుల మాటలతో చాలా మంది రైతులు లోన్లు రెన్యూవల్ చేసుకోలేదు. అయితే, రేవంత్ సర్కారు కొందరికే మాఫీ చేసి, మిగతా వారిని వదిలేసిం ది. ప్రభుత్వం మాఫీ చేయకపోదా? అన్న నమ్మకంతో ఇప్పటికీ చాలా మంది అన్నదాతలు లోన్లు రెన్యూవల్ చేసుకోవడం లేదు. మరోవైపు, బ్యాంకర్లు మాత్రం కచ్చితంగా రెన్యూవల్ చేసుకోవాల్సిందేనని రైతులను వేధిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి మరీ నోటీసులు ఇస్తూ ఒత్తిడి తెస్తున్నారు.
కమీషన్ల పర్వం
బ్యాంకు నోటీసులు అందుకున్న రైతులు ఆందోళన చెందుతున్నా రు. లోన్ రెన్యూవల్ చేసుకోకుంటే లోన్ రికవరీ కింద ఎక్కడ తమ భూములు వేలం వేస్తారోనని భయపడుతున్నారు. మరోవైపు, వడ్డీ చెల్లించి రెన్యూవల్ చేసుకునేందుకు సిద్ధపడుతున్నప్పటికీ, అసలుతో పాటు మిత్తీ చెల్లిస్తేనే రెన్యూవల్ చేస్తామని బ్యాంకర్లు చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ క్రమంలో పరువు పో కూడదన్న భావనతో డబ్బుల కోసం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కర్షకుల అవసరాలను ఆసరాగా చేసుకుని కొందరు వ్యక్తులు కమీషన్ దందాకు తెర లేపారు. లోన్ రెన్యూవల్‌కు కావాల్సిన మొత్తాన్ని సమకూర్చుతూ, అందు కు గాను కొంత మొత్తాన్ని కమీషన్ రూపంలో వసూలు చేస్తున్నారు. ఈ మే రకు బీబీపేట్ యూనియన్ బ్యాంక్ వద్ద కొందరు కాచుకుని కూ ర్చుంటున్నా రు. లోన్ రెన్యూవల్ కోసం రైతుకు రూ.లక్ష అవసరమైతే అక్కడే సమకూర్చుతున్నారు. తిరిగి రుణం మంజూరు కాగానే తమ డబ్బులతోపాటు రూ.2 వేల వరకు కమీషన్ రూపంలో వసూలు చేస్తున్నారు. గంటల్లో జరిగే ఈ తతంగంతో కొందరు భారీగా లబ్ధి పొందుతుండగా, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.