నాగిరెడ్డిపేట, డిసెంబర్ 23: కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో కొన్నిరోజులుగా బోధన తరగతులు కొనసాగడంలేదు. తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లాలోని కాంట్రాక్ట్ రెసిడెన్సియల్ ఉపాధ్యాయులు సమ్మెబాట పట్టడంతో.. కస్తూర్బా పాఠశాలల్లోని విద్యార్థులు చదువు చెప్పేవారు లేక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో మొత్తం 95 కస్తూర్బా గాంధీ పాఠశాలలు ఉండగా.. ఇందులో 5,576 మంది విద్యార్థినులు చదువుతున్నారు. జిల్లాలో సీఆర్టీలు 195 మంది ఉండగా.. ఇందులో 121 మంది ఈ నెల 10 నుంచి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ నిరవధిక సమ్మెలో ఉన్నారు. దీంతో పాఠశాలల్లో సబ్జెక్ట్‌ల వారీగా పాఠ్యాంశాలు బోధించేవారు లేక తరగతులు కొనసాగడంలేదు.
ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు అన్ని సబ్జెక్టులు పూర్తి చేసి ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. కానీ కస్తూర్బా పాఠశాలలోని విద్యార్థినులకు అసలు సబ్జెక్టుల వారీగా పాఠ్యాంశాలు పూర్తి కాలేదు. ప్రత్యేక తరగతులు కూడా ముందుకుసాగడంలేదు. దీంతో పదో తరగతి విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు. కలెక్టర్ స్పందించి ఉపాధ్యాయులను వెంటనే నియమించాలని లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి విద్యార్థులకు బోధన జరిగేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థినుల తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు.
కాంట్రాక్ట్ టీచర్లు సమ్మెలో ఉండడంతో..చదువు ముందుకు సాగడం లేదు. పాఠాలు చెప్పేవారు లేక ఖాళీగా కూర్చొంటున్నాం. పదో తరగతి పరీక్షలు దగ్గర పడుతున్నాయి. పాఠాలు మొత్తం పూర్తి కాలేదు. పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో పాఠాలు పూర్తి చేసి ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులు వెంటనే పాఠాలు బోధించి, మాకు నష్టం జరగకుండా చూడాలి.
-తలారి మేఘన( పదో తరగతి) కస్తూర్బా పాఠశాల
ఉపాధ్యాయులు సమ్మెలో ఉండడంతో పాఠాలు బోధించేవారు లేరు. పరీక్షలు సమీపిస్తుండడంతో భయంగా ఉంది. 13 రోజులుగా పాఠాలు జరగడం లేదు. ఇలా ఐతే మేము ఎలా పాస్ అవుతామో అర్థం కావడం లేదు. అధికారులు స్పందించి పాఠ్యాంశాలు చెప్పేలా చర్యలు తీసుకోవాలి. లేదంటే ఇక్కడ ఉండి చదువుకోవడం చాలా కష్టంగా ఉంది.
-సూరెపల్లి అర్చన (పదో తరగతి) కస్తూరా విద్యాలయం
కస్తూర్బా పాఠశాలల్లో విధులు నిర్వర్తించే సీఆర్టీలు ఈనెల 10 నుంచి సమ్మెలో ఉన్నారు. దీంతో నలుగురు తాత్కాలిక ఉపాధ్యాయులతో బోధన కొనసాగుతున్నది. పాఠ్యాంశాలు ముందుకు సాగక విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్, డీఈవో దృష్టికి తీసుకువెళ్లాం. మండలంలోని సబ్జెక్టుల వారీగా టీచర్లను డిప్యుటేషన్‌పై కస్తూర్బా పాఠశాలలకు పం పించి సబ్జెక్టులు పూర్తి చేయాలని ఎంఈవోలకు సూచించాం. కానీ ఇప్పటి వరకు ఎవరూ స్పందించడం లేదు.
– సుకన్య, జీసీడీవో, కామారెడ్డి