Heart Deseases | నిజామాబాద్, డిసెంబర్ 2 : చలికాలంలో చిన్న, పెద్దా అని తేడా లేకుండా గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారని మెడికవర్ హాస్పిటల్స్ నిజామాబాద్ కార్డియాలజిస్ట్ డాక్టర్ జగదీష్ చంద్రబోస్ పేర్కొన్నారు. వాతావరణంలో చలి తీవ్రతలో మార్పులు వచ్చినప్పుడు రక్తనాళాలు కుంచించుకుపోవడం వల్ల రక్తపోటు పెరగడం, హృదయంపై ఒత్తిడి పెరగడం వంటి సమస్యలు ప్రధాన కారణాలని తెలిపారు. ముఖ్యంగా తెల్లవారుజామున చలి తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో గుండె పోటు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుందని చెప్పారు.
తక్కువ ఉష్ణోగ్రతల సమయంలో శరీరం వేడి నిలుపుకోవడానికి గుండె ఎక్కువగా పనిచేయాల్సి వస్తుందని, ఒత్తిడి, వయసు పైబడినవారికి, ముందే గుండె వ్యాధులు ఉన్నవారికి, షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ ఉన్నవారు ఎక్కువగా గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే ఆస్కారం ఉంటుందని తెలిపారు.
బయటకు వెళ్లడం తగ్గించాలి..
చాలా మంది ఈ లక్షణాలను సాధారణ చలి అలసటగా భావించి నిర్లక్ష్యం చేస్తారని, ఇది తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుందని హెచ్చరించారు. చలికాలంలో ప్రతీ ఒక్కరూ పాటించాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. తెల్లవారుజామున రాత్రి వేళల్లో తీవ్రమైన చలిలో బయటకు వెళ్లడం తగ్గించాలి. శరీరాన్ని వేడిగా ఉంచేందుకు తగిన తగు దుస్తులు ధరించాలి. అలాగే
షుగర్, బీపీ, కొలెస్ట్రాల్‌ను క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలి. ఛాతి బరువుగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆకస్మిక చెమటలు, చేతికి/మోచేతికి నొప్పి వంటి లక్షణాలు కనబడితే వెంటనే వైద్యులను సంప్రదించి తగు చికిత్స తీసుకోవాలని చెప్పారు.
ధూమపానం, మద్యపానం పూర్తిగా మానేయాలని సూచించారు. గోరు వెచ్చని నీరు, పోషకాహారం, తేలిక పాటి వ్యాయామం చలికాలంలో గుండెకు రక్షణగా ఉంటాయన్నారు. చలికాలంలో గుండె వ్యాధుల లక్షణాలు చాలా వేగంగా ముదిరే అవకాశాలు ఉన్నందున, ఏ చిన్న మార్పునైనా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తక్షణ వైద్య సేవలు అందించే ఆస్పత్రులను, వైద్యులను సంప్రదించాలని డాక్టర్ జగదీష్ చంద్రబోస్ సూచించారు.
Sanchar Sathi App: సంచార్ సాథీ యాప్‌ను డిలీట్ చేసుకోవచ్చు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి సింథియా