నిజాంసాగర్/నాగిరెడ్డిపేట, సెప్టెంబర్ 26: మంజీర, గోదావరి నదులు మళ్లీ ఉప్పొంగాయి. మహారాష్ట్ర, కర్ణాటకలో రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులకు వరద పోటెత్తడంతో మిగులు జలాలను దిగువకు వదులుతున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టుకు 16 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో రావడంతో మూడు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు.
దీంతో బోధన్ మండలం సాలూర వద్ద పాత వంతెనను ఆనుకుని మంజీరా నది ప్రవహిస్తున్నది. కందకుర్తి త్రివేణి సంగమ క్షేత్రం వద్ద హరిద్రా, మంజీరా నుంచి వస్తున్న వరదతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. నదిలోని పురాతన శివాలయం పూర్తిగా నీట మునిగింది. ఈ వరద శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు చేరుతుండడంతో నీటిని దిగువకు వదులుతున్నారు.
గురువారం 1.09 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో రావడంతో 22 గేట్లను ఎత్తి మిగులు జలాలను దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ఎస్సారెస్పీ పూర్తి స్థాయి నీటిమట్టం (1091 అడుగులు/80.5 టీఎంసీలు)తో తొణికిసలాడుతున్నది. మరోవైపు, పోచారం ప్రాజెక్టు నుంచి వరదనీరు పొంగిపొర్లుతున్నది. ఎగువ ప్రాంతాల నుంచి 500క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నదని ప్రాజెక్టు డీఈఈ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రధాన కాలువ ద్వారా నీటి విడుదల నిలిపివేశామన్నారు.