e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home నిజామాబాద్ మానవా.. మారవా?

మానవా.. మారవా?

మానవా.. మారవా?
  • లాక్‌డౌన్‌ సమయంలో గాలి తిరుగుళ్లు
  • పోకిరీలతో పోలీసులకు తలనొప్పిగా మారిన వ్యవహారం
  • అత్యవసరం కోసం వచ్చే వారికి ఎదురవుతున్న ఇబ్బందులు
  • చీటికి మాటికి బయటికి వస్తే జరిమానా విధిస్తున్న పోలీసులు

ఇదీ.. కొంత మంది ప్రబుద్ధుల పని. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో లాక్‌డౌన్‌ రోజుల్లో ఇలాంటి వాళ్లు అనేక మంది చీటికి మాటికి రోడ్డెక్కుతున్నారు. కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌లో షికారు చేసేందుకు కుంటి సాకులతో వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. కొంతమంది పోకిరీ ముఠాలు పనిగట్టుకొని తిరుగుతుండడంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. అకారణంగా రోడ్లపైకి వస్తే జరిమానాలు, కేసులు విధిస్తూ దారిలోకి తెస్తున్నారు. పాత మెడికల్‌ ప్రిస్క్రిప్షన్‌తో అనేక మంది పోలీసులను బురిడీ కొట్టిస్తూ రోడ్లపైకి వస్తున్నారు. సమీపంలోనే మెడికల్‌ షాపులున్నప్పటికీ సుదూర ప్రాంతానికి వచ్చి మెడికల్‌ ఎమర్జెన్సీ పేరు చెప్పి తప్పించుకుంటున్నారు. ఈ సమయంలో అత్యవసరం పేరుతో రోడ్డుపైకి వచ్చే వారికి కొంతమంది ప్రబుద్ధుల చర్యలతో ఇబ్బందులు కలుగుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉదయం 10గంటల తర్వాత కారణం లేకుండా రహదారులపైకి వచ్చిన వారిపై పోలీసులు లాఠీ ఝుళిపించేందుకు సిద్ధం అవుతున్నారు. కేసులు, జరిమానాలతోపాటుగా కౌన్సెలింగ్‌ ఇచ్చి ఇండ్లకు పంపుతున్నారు.

పూలాంగ్‌ చౌరస్తా.. ఉదయం 11గంటలు..
రయ్‌మంటూ పల్సర్‌ బైక్‌ వేసుకొని 30 ఏండ్ల వ్యక్తి నిర్మానుష్యంగా ఉన్న రహదారిపై రాక. బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసుల అడ్డగింత. అనుమతి లేకుండా ఎక్కడికి వెళ్తున్నావంటూ నిలదీత. తన ఏడాది బాబుకు డ్రైపాడ్స్‌ కోసం వచ్చానంటూ సమాధానం. కంగుతిన్న పోలీసులు. ఉదయం 10గంటల వరకు ఏం చేశావని అడిగితే సమాధానం కరువు. ఇంత సీరియస్‌ సమయంలో సిల్లీ కారణంతో బయటికి ఎందుకు వచ్చావంటే నోరు మెదపలేదు. రూ.వేయి జరిమానా విధించి ఆ వ్యక్తిని అక్కడి నుంచి పంపించి వేశారు.

ఖాళీ రోడ్లపై స్కిట్లు..
ఓ ఇద్దరు స్నేహితులు బైక్‌పై వేగంగా స్కిట్లు వేస్తూ పారాహుషార్‌ అన్నట్లుగా సాగిపోతున్నారు. పోలీసులు వాహనాన్ని ఆపడంతో కుర్రాళ్లిద్దరూ కంగుతిన్నారు. ఎటు పోతున్నారంటే మెడికల్‌ షాపునకు అని సమాధానం. డాక్టర్‌ రాసిన ప్రిస్క్రిప్షన్‌ చూపించమని అడిగితే ఏడాది క్రితం నాటి కాగితాన్ని చూపెట్టారు. తేదీ చూసి ఇదేంటని అడిగితే మందులు తేవడానికి వెళ్తున్నామంటూ బుకాయింపు. ఆ ఇద్దరు యువకుల ఫోన్‌ నుంచి తల్లిదండ్రులకు ఫోన్లు చేయగా అసలు ముచ్చట తేటతెల్లమైంది. ఆగం తిరుగుళ్లకు అలవాటుపడిన ఆ యువకులు చేసేది లేక పాత మెడికల్‌ ప్రిస్క్రిప్షన్‌ పట్టుకొని చక్కర్లు కొడుతూ పోలీసులకు చిక్కారు. జరిమానాతోపాటుగా ఖాకీల కోపానికి గురయ్యారు.

విక్స్‌ యాక్షన్‌-500 కోసం..
నిజామాబాద్‌ గాంధీ చౌక్‌ వద్ద నిశ్శబ్ద వాతావరణం. ఇంతలో ఓ వ్యక్తి బైక్‌పై వేగంగా దూసుకొస్తున్నాడు. నోటికి సరిగ్గా మాస్క్‌ కూడా లేదు. అక్కడే పికెట్‌ నిర్వహిస్తున్న పోలీసులు ఠక్కున ఆపారు. ఈ సమయంలో ఎక్కడికి పోతున్నావని ప్రశ్నించారు. విక్స్‌ యాక్షన్‌ 500 టాబ్లెట్‌కోసమని జవాబు. ఎక్కడి నుంచి వస్తున్నావని ఆరా తీయగా మాలపల్లి నుంచి వస్తున్నట్లుగా గుర్తింపు. మధ్యలో మెడికల్‌ షాపులు లేవా? అని ప్రశ్నించగా… ఇక్కడ తక్కువ ధరకు దొరుకుతాయని తలతిక్క సమాధానం. పది టాబ్లెట్లు గల విక్స్‌ యాక్షన్‌ 500 అక్షరాల 20 రూపాయలు. కాకపోతే ఆ ప్రబుద్ధుడు రోడ్డు మీద చక్కర్లు కొట్టాలనే దురాలోచనతో వచ్చి పోలీసులకు చిక్కాడు. రూ.వేయి జరిమానా విధించి సదరు వ్యక్తి తిక్కను పోలీసులు వంచారు.

ఒక్కరు చేసే పొరపాటుతో..
ఆరోగ్యం మన బాధ్యత అని గుర్తించాలి. ఒక్కరు చేసే పొరపాటు వారితోపాటు వారి కుటుంబాన్ని, చుట్టుపక్కల వారిని ప్రమాదకరమైన పరిస్థితికి నెట్టేస్తుంది. కరోనా క్లిష్ట సమయంలో అవసరముంటేనే బయటికి రావాలి. కచ్చితంగా భౌతికదూరం పాటించాలి. మాస్కు వాడాలి. పిల్లలను ఆడుకోవడానికి బయటికి పంపొద్దు. ఇంట్లోనే ఆడుకునేలా చూడాలి. మార్కెట్‌కు, దుకాణాలకు వెళ్లినప్పుడు భౌతికదూరంతోపాటుగా ఇంటికి వచ్చిన తర్వాత చేతులు శానిటైజ్‌ చేసుకోవాలి. ఇప్పటికీ జనం దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు మోచేయి అడ్డుపెట్టుకోవడం లేదు. కచ్చితంగా ఈ నిబంధన పాటించాలి. ఇంట్లో వృద్ధులుంటే మరింత జాగ్రత్తలు పాటించాలి. వారితో మాట్లాడేటప్పుడు, సేవలు చేసేటప్పుడు మాస్కులు ధరించడం అవసరం. కరోనా వ్యాప్తి కాసింత తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్నప్పటికీ రోజురోజుకూ వెలుగు చూస్తున్న కేసులు మాత్రం ఇంకా వందల్లోనే ఉంటున్నాయి. లాక్‌డౌన్‌తో జనం బయట తిరగడం తక్కువగా ఉండడం, నిబంధనల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుండడంతో వ్యాప్తి తక్కువగా ఉంది. కానీ కరోనా కేసుల పెరుగుదలకు ప్రధానంగా కొందరు నిబంధనలు పట్టించుకోకపోవడమే. ఆ కొందరి కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు.

రేయింబవళ్లు శ్రమిస్తున్న పోలీసులు..
లాక్‌డౌన్‌లో పోలీసులు రేయింబవళ్లు కష్టపడుతున్నారు. ఉదయం 6 నుంచి 10గంటల వరకు సడలింపుల్లో ప్రజలు జాగ్రత్తలు పాటించేలా చూడడంతోపాటుగా పొద్దంతా లాక్‌డౌన్‌ అమలులో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లోని ప్రధాన కూడళ్లలో పోలీసులు పికెటింగ్‌ నిర్వహిస్తున్నారు. ప్రతి చౌరస్తా వద్ద బందోబస్తు నిర్వహిస్తూ రోడ్డెక్కిన వారిని ప్రశ్నిస్తున్నారు. అత్యవసర సేవలకు ఆటంకం కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఉదయం 10గంటల తర్వాత రోడ్లపై మనుషులెవ్వరూ ఉండకుండా చూస్తున్నారు. ప్రజల ఆరోగ్యం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి ఇటు ఎండ, అటు కరోనా వైరస్‌తో కుస్తీ పడుతూ ప్రజాసేవలో తరిస్తున్నారు. కరోనా వైరస్‌ ఉమ్మడి జిల్లాలో పోలీస్‌ సిబ్బందినీ వదలడం లేదు. కరోనా కట్టడి కోసం నిత్యం ప్రజలతో మమేకమవుతూ… ప్రజల రక్షణకు కరోనాతో పోరాడుతున్న పోలీస్‌ సిబ్బంది చివరికి వైరస్‌ బారి నుంచి తప్పించుకోలేకోతున్నారు. నిందితుడు… బాధితుడు… ఇద్దరితోనూ దగ్గరగా ఉండే పోలీసులకు కొవిడ్‌ టీకాల పంపిణీ సత్ఫలితాలు అందించింది. కొంత కాలంగా పోలీసుల్లో పాజిటివ్‌ కేసులు అంతగా వెలుగు చూడడం లేదు. వచ్చినా త్వరగా కోలుకుని క్షేమంగా బయటపడుతున్నారు.

స్వీయ రక్షణే మేలు..
సరిగ్గా ఏడాది కాలంలో రాష్ట్రంలో రెండోసారి లాక్‌డౌన్‌ అమలవుతోంది. మొదటివేవ్‌ను లాక్‌డౌన్‌తో అరికట్టగా అదే స్ఫూర్తితో తెలంగాణ సర్కారు సెకండ్‌వేవ్‌కు ముకుతాడు వేసేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. ఇందుకోసం లాక్‌డౌన్‌ విధించి కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నది. ప్రజలు ఉదయం 6 నుంచి 10గంటల వరకే నిత్యావసర వస్తువులు, కూరగాయలు, కిరాణ సామగ్రి, పాలు, పండ్లు తెచ్చుకోవడానికి బయటికి రావాలి. ఇంట్లో నుంచి బయటికి వెళ్లే సమయంలో తప్పనిసరిగా మాస్కు ధరించాలి. జేబులో శానిటైజర్‌ ఉంచుకోవాలి. కరోనా సోకిన వారు హోం ఐసొలేషన్‌లో ఉంటూ ఇతరులకు వ్యాధి వ్యాప్తి చెందకుండా స్వీయ రక్షణ చర్యలు పాటించాలి. కొవిడ్‌-19పై ప్రజలు ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకోవడం లేదు. కొంత మందిలో నిర్లక్ష్యం, చాలా మందిలో అవగాహన కొరవడడంతో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఒక్కసారి వస్తే మళ్లీ కరోనా రాదని, వ్యాక్సిన్‌ తీసుకుంటే పాజిటివ్‌ బారిన పడబోమని, ఎక్కువగా 50ఏండ్లు పైబడిన వారికే కొవిడ్‌ వస్తుందనే అపోహలు ఇంకా చాలా మందిలో ఉన్నాయి. అందుకే మా స్కు వాడకంలో అశ్రద్ధ, భౌతికదూరంలో నిర్లక్ష్యం వంటివి చాలా మేరకు చేటు చేస్తోంది. చిన్న తప్పు కుటుంబాలను, ఇతరులను ప్రమాదంలో నెట్టేస్తుందన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మానవా.. మారవా?

ట్రెండింగ్‌

Advertisement