కమ్మర్పల్లి/మెండోరా, జూన్ 23 : ఎగువన చినుకు పడితే దిగువన ఆనందం. వానకాలం ప్రారంభం కాగానే నాలుగు వానలు పడితే రైతు పులకరింతే వేరు. ప్రాజెక్టుల ఎగువన వానకాలం ప్రారంభంలోనే నాలుగు గట్టి వానలు పడ్డా ఆ ఆనందం ప్రాజెక్టు ఆయకట్టు రైతుల్లో ఇలానే ఉంటుంది. ఎస్సారెస్పీ ఎగువన మహారాష్ట్రలో బాబ్లీ, విష్ణుపురి ప్రాజెక్టుల పరీవాహక ప్రాంతంలో ఈ వానకాలం తొలకరి సమయంలోనే వరద దిగువకు వచ్చేలా వానలు పడడంతో ఎస్సారెస్పీ రైతుల్లో ఆశలు రేకెత్తాయి. మరోవారం రోజుల్లో బాబ్లీ గేట్లను పూర్తిగా ఎత్తనున్నారు. బాబ్లీ ప్రాజెక్టు గేట్ల ఎత్తివేతకు ముందే వానలతో ఎస్సారెస్పీ ఎగువన ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. బాబ్లీగేట్ల ఎత్తివేత సమయానికి బాబ్లీలో నీరు లేకపోయినా పునర్జీవ పథకంతో వరద కాలువ ద్వారా జిల్లాకు కాళేశ్వరం నీళ్లు మూడేండ్లుగా అందుతున్నాయి. ఇలా వరద కాలువ ద్వారా కాళేశ్వరం నీళ్లు వస్తుండడంతో యాసంగిలో ఎస్సారెస్పీపై భారం తగ్గి కాకతీయ కాలువకు ఆరంభంలోనే వీలైనంత నీటిని ఇచ్చుకోగలిగే పరిస్థితి ఏర్పడింది. దీంతో జిల్లా రైతుల్లో బాబ్లీ చింత లేదు. కానీ ఎగువన జలకళ మాత్రం రైతుల్లో సంతోషాన్నే కలిగిస్తున్నది.
మహారాష్ట్రలో వర్షాలు
ఈ వానకాలం ప్రారంభంలోనే ఎస్సారెస్పీ ఎగువన మహారాష్ట్రలో గోదావరి వెంట శంకర్రావోజి చవాన్ విష్ణుపురి ప్రాజెక్టు, బాబ్లీ ప్రాజెక్టు పరీవాహక ప్రాంతాల్లో ఆశాజనకంగా వానలు కురిశాయి. దీంతో విష్ణుపురి, బాబ్లీ ప్రాజెక్టులు వానకాలం ఆదిలోనే జలకళను సంతరించుకున్నాయి. దీంతో గడిచిన పక్షం రోజులుగా ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేస్తుండడంతో ఎస్సారెస్పీకి ఇన్ఫ్లోలు నమోదయ్యాయి. దీంతో ఈ నెల ఒకటవ తేదీ నుంచి 22వ తేదీ వరకు నాలుగు అడుగుల నీటి మట్టం పెరిగింది.
ఇన్ఫ్లోలు ఇలా..
ఈ వానకాలం సీజన్లో జూన్ ఒకటిన ఎస్సారెస్పీలో 1063.80 అడుగుల నీటిమట్టం (18.437 టీఎంసీల) ఉంది. జూన్ 3న 300, 6న 350, 7న 350, 8న 350, 11న 300, 12న 200 క్యూసెక్కుల స్వల్ప ఇన్ఫ్లో వచ్చింది.14వ తేదీన బాబ్లీ ఎగువన, దాని పరీవాహక ప్రాంతంలో వరుసగా కురిసిన వానలతో బాబ్లీలోకి వరద వచ్చింది. ఈ ప్రాజెక్టు 63శాతం నిండింది. దీంతో బాబ్లీ నుంచి 14న ఒక గేటు ఎత్తి 13,993 క్యూసెక్కుల నీటిని దిగువన గోదావరిలోకి వదిలారు. ఈ వరదలతో జూన్ 15న 3893 క్యూసెక్కులు, 16న 16886, 17న 15360 క్యూసెక్కుల వరద ఎస్సారెస్పీలోకి వచ్చి చేరింది. 18 నాటికి శంకర్రావోజి చవాన్ విష్ణుపురి ప్రాజెక్టు నాందెడ్ ప్రాంతంలో కురిసిన వానలతో వంద శాతం నిండింది. దీంతో విష్ణుపురి ఒక గేటును ఎత్తివేసి 16,635 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఈ వరదతో ఎస్సారెస్పీలోకి జూన్18న 17615 క్యూసెక్కులు, 19న 18,564, 20న 9,259, 22న 1,747 క్యూసెక్కుల ఇన్ఫ్లోలు నమోదయ్యాయి.
ఎస్సారెస్పీ నీటిమట్టం
ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (90 టీఎంసీలు) కాగా బుధవారం ఉదయం ప్రాజెక్టులో 1067.80అడుగులు (24.954 టీఎంసీలు) నీటి నిల్వ ఉంది. ప్రస్తుతం 858 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతున్నది. గత సంవత్సరం ఇదే రోజున ప్రాజెక్టు నీటిమట్టం 1070.40 అడుగులు (29.722 టీఎంసీలు)గా ఉంది.