e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, August 1, 2021
Home కామారెడ్డి వల్లభాపూర్‌ ప్రగతిలో భేష్‌

వల్లభాపూర్‌ ప్రగతిలో భేష్‌

వల్లభాపూర్‌ ప్రగతిలో భేష్‌
  • నాడు అనుబంధ గ్రామంలో అసౌకర్యాలు
  • నేడు అన్ని వసతులతో ఆదర్శంగా..
  • పుట్టిన ఊరికి దాతల సహకారం

మాక్లూర్‌, జూలై 11: మాక్లూర్‌ మండలంలోని వల్లభాపూర్‌ గ్రామంలో సుమారు 900 మంది జనాభా. గ్రామం ఏర్పాటు నుంచి ఎన్నో ఏండ్లు చిక్లీ గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేది. ఉమ్మడి రాష్ట్ర పాలకుల హయాంలో వచ్చే అరకొర నిధులు ఒకే గ్రామానికి సరిపోయేవి. దీంతో వల్లభాపూర్‌ అభివృద్ధికి దూరమైంది. తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్‌ పరిపాలనా సంస్కరణల్లో భాగంగా తండాలు, శివారు పల్లెలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. అందులో భాగంగా మూడేండ్ల క్రితం వల్లభాపూర్‌ గ్రామ పంచాయతీగా ఏర్పడింది. కొత్త పాలకవర్గం, అధికారులు వచ్చారు. అదే సమయంలో సీఎం కేసీఆర్‌ ప్రారంభించిన పల్లె ప్రగతి కార్యక్రమం వల్లభాపూర్‌ను అభివృద్ధి దిశగా నడిపించింది. ఊరి బాగు కోసం ప్రజలంతా ఐక్యతతో ముందుకు రావడంతో మండలంలోనే ఆదర్శ గ్రామంగా నిలిచింది.

మా ఊరి మహరాజుల సహకారం..
గ్రామానికి చెందిన చాలా మంది దాతలు గత సంవత్సరం సుమారు రూ.5లక్షల వరకు విరాళాలు అందజేశారు. ఇంగ్లిష్‌ మీడియం పాఠశాల కోసం గ్రామానికి చెందిన, కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న రూ.70వేలు ఇచ్చారు. పక్క గ్రామం జన్నేపల్లికి చెందిన మైనంపల్లి హన్మంత్‌రావు విద్యుత్‌ స్తంభాల ఏర్పాటు, సీసీ కెమెరాల కోసం రూ.2లక్షలు విరాళంగా అందజేశారు. పీఆర్టీయూ రాష్ట్ర నాయకుడు కమలాకర్‌రావు, అమృత్‌రావు, ప్రవీణ్‌, గైని గంగాధర్‌, దయాకర్‌రావు రూ.10వేల చొప్పున అందజేయగా, చాలా మంది దాతలు సిమెంటు బెంచీలు, పాఠశాలకు విరాళాలు అందజేసి మా ఊరు మహరాజులుగా నిలిచారు.

- Advertisement -

పల్లె ప్రగతి పనులు పూర్తి
పల్లె ప్రగతిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దుకున్నారు. ప్రతి వీధిలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించారు. పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసుకొని అందులో ఆకర్షణీయమైన పూల మొక్కలను నాటారు. మధ్యలో వాకింగ్‌ ట్రాక్‌ను నిర్మించారు. దాతల సహకారంతో ప్రకృతి వనంలో సిమెంట్‌ బెంచీలను ఏర్పాటు చేసుకున్నారు.

అభివృద్ధి వెలుగులు

గ్రామంలో కిలోమీటర్‌ మేర విద్యుత్‌ స్తంభాలను ఏర్పాటు చేసుకొని ఎల్‌ఈడీ లైట్లను అమర్చారు. దీంతో రాత్రయిందంటే వీధులన్నీ జిగేల్‌మంటూ మెరుస్తున్నాయి. సీనియర్‌ సిటిజన్ల సహకారంతో ప్రభుత్వ పాఠశాలను ఆంగ్ల మాధ్యమానికి మార్చుకున్నారు. గతంలో తాగునీటి కోసం ట్యాంకుల వద్ద ఘర్షణ వాతావరణం నెలకొనేది. కానీ ప్రస్తుతం ఇంటింటికీ మిషన్‌ భగీరథ నల్లాను బిగించి నీటిని సరఫరా చేస్తుండడంతో తాగునీటి ఇబ్బందులు తీరాయి. కొత్తగా ఏర్పడిన జీపీ అయినప్పటికీ మండలంలో వైకుంఠధామాన్ని పూర్తి చేసిన మొదటి గ్రామంగా నిలిచింది. రూ.12లక్షలతో నిర్మించిన వైకుంఠధామం.. అందమైన పూలమొక్కలు, సిమెంటు బెంచీల ఏర్పాటుతో పార్కును తలపిస్తున్నది. అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతుండడంతో జీపీ పాలకవర్గ సభ్యులు కలెక్టర్‌ నారాయణ రెడ్డి ప్రశంసలు సైతం అందుకున్నారు. నాడు ఎన్నో అవస్థలు పడ్డ వల్లభాపూర్‌ గ్రామం నేడు గ్రామస్తుల సహకారంతో ప్రగతిలో పరుగులు పెడుతున్నది.

అభివృద్ధి సాధ్యమైంది..
గతంలో వల్లభాపూర్‌, చిక్లీ పంచాయతీలో విలీన గ్రామంగా ఉండేది. దీంతో ఎప్పుడో ఒకసారి అభివృద్ధి జరిగేది. సీఎం కేసీఆర్‌ సార్‌ ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేయడంతో మా గ్రామంలో అభివృద్ధి మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాలతో మా ఊరు మొత్తం మారిపోయింది. గ్రామస్తులు, దాతల సహకారంతో సౌకర్యాలు మెరుగుపరుచుకుంటున్నాం.
-సిలారి మంజులాసుధాకర్‌, సర్పంచ్‌

బాధలు తీరినయ్‌..
నేను సిన్నగున్నసంది సూస్తున్న మా ఊర్లె అన్ని బాధలె. రోడ్లు సక్కగ ఉండకపోతుండె. నీళ్లు రాకపోతుండె. గిప్పుడే సూస్తున్న మస్తుగ పనులు జేస్తున్నరు. అందరిండ్లల్ల నల్ల వెట్టిండ్రు. దినాం నీళ్లు పారుతున్నయ్‌. కొత్త పంచాతి అయినసంది చెత్త తీసేస్తుండ్రు, ఊరంతా మొక్కలు వెడుతుండ్రు. ఊరి కోసం చానా మంది పైసల్‌ కూడా ఇచ్చిండ్రు. కొత్తగా రోడ్లు ఏపిస్తుండ్రు. బాధలన్నీ తీరినయ్‌.
-బోయినపల్లి రామన్న, గ్రామస్తుడు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వల్లభాపూర్‌ ప్రగతిలో భేష్‌
వల్లభాపూర్‌ ప్రగతిలో భేష్‌
వల్లభాపూర్‌ ప్రగతిలో భేష్‌

ట్రెండింగ్‌

Advertisement