ఖలీల్‌వాడి, డిసెంబర్ 19: దివ్యాంగులు అధైర్యపడొద్దని నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవానికి హాజరై మాట్లాడారు. దివ్యాంగులపై చిన్నచూపు వద్దన్నారు. ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ వారు ప్రతిభ చూపుతున్నారని గుర్తుచేశారు.
దివ్యాంగులకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు అండగా ఉంటారన్నారు. స్నేహ సొసైటీలో ఉన్న దివ్యాంగులు చదువుతోపాటు క్రీడలు, వివిధ కళల్లో ఆరితేరడం అభినందనీయమని అన్నారు. కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, నగర మేయర్ దండు నీతూకిరణ్, మహిళా శిశు సంక్షేమశాఖ అధికారిణి రసూల్‌బీ, స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్ధయ్య, రాజేశ్వరీదేవి పాల్గొన్నారు.