వినాయక్ నగర్, ఫిబ్రవరి 25 : కాంగ్రెస్ హయాంలో ఉపాధ్యాయులకు, నిరుద్యోగులకు భరోసా లేదని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ ధ్వజమెత్తారు. మంగళవారం నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్లోని మార్కండేయ పద్మశాలి సంఘం భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్కు అధికారం కట్టబెడితే వారి పాలనలో తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా నిరుద్యోగులకు, ఉపాధ్యాయులకు వారి సమస్యలకు భరోసా లేకుండా పోయిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్న నిరుద్యోగులకు ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి 4వేలు, విద్య భరోసా గ్యారంటీ, ఆడబిడ్డలకు ఉచిత ఎలక్ట్రికల్ స్కూటీలు, విద్యార్థులకు ఫీరియంబర్స్మెంట్ 6 వేల కోట్ల పైగా ఉన్న బకాయిలు విడుదల చేసేవరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ విడిచిపెట్టాదని హెచ్చరించారు.
నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, మేధావులు అలోచించి ఓటు వేయాలని, కాంగ్రెస్ను నమ్మి మోసపోయి గోస పడొద్దని విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగులకు, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం మెడలు వంచి అమలు చేయించాలంటే తమ పార్టీ చేస్తుందని ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, మండల అధ్యక్షులు ఆనంద్ రావు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.