సమైక్య రాష్ట్రంలో ప్రయాణం ఓ ప్రహసనం. ఎక్కడికైనా వెళ్లాలంటే గంటల కొద్దీ సమయం వృథా కావడంతో పాటు గతుకుల రోడ్లపై ప్రయాణం నరకప్రాయంగా ఉండేది. కానీ రాష్ట్రం సిద్ధించిన తర్వాత రాష్ట్ర రాజధానితో పాటు జిల్లా కేంద్రాలకు వెళ్లే రహదారులను ఫోర్‌లేన్, డబుల్ రోడ్లుగా మార్చడంతో ప్రయాణ సమయం తగ్గింది. వాహనాల వేగం పెరిగింది. గతంలో నిజామాబాద్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లాలంటే కనీసం 5 నుంచి 6 గంటల సమయం పట్టేది. ఇప్పుడా సమయం 3 గంటలకే తగ్గింది. గ్రామం నుంచి మండల కేంద్రానికి, మండలం నుంచి జిల్లా కేంద్రానికి, జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధానికి ఇలా లింకు రోడ్ల అనుసంధానం జరిగింది. ప్రతి పల్లెకూ రోడ్ల కనెక్టివిటీ పెరగడంతో సుఖవంతమైన ప్రయాణంతో పాటు సమయం ఆదా అవుతున్నది. గతంలో వాహనాల వేగం గంటకు 60 కిలోమీటర్లకు మించక పోయేది. ప్రస్తుతం 80 నుంచి 100 కిలోమీటర్ల వేగానికి చేరింది.
నిజామాబాద్, మే 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నిజామాబాద్ జిల్లాలో ఎటుచూసినా రహదారుల విస్తరణ తళుక్కుమంటోంది. తళతళా మెరిసేలా తారు రోడ్డు ఎటువెళ్లినా సులువైన ప్రయాణానికి దారి చూపుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండేది. గతుకులు పడిన రోడ్లను కనీసం బాగు చేసేది కాదు. ఏండ్లుగా పరిస్థితి అలాగే ఉండేది తప్ప బాగుపడిన దాఖలాలు చాలా తక్కువ. కొత్త రోడ్డు పడాలంటే అదో ప్రహసనం. అంతలోపే అమాయక ప్రజలెందరో ప్రాణాలు పోగొట్టుకునేది. కానిప్పుడు సీఎం కేసీఆర్ సారథ్యం, తెలంగాణ ప్రభుత్వ హయాంలో రోడ్లకు మహర్దశ పట్టుకున్నది. జిల్లాలో ఎటు చూసినా తారు రోడ్లు పడ్డాయి. అన్ని నియోజకవర్గాల్లోనూ కొంగొత్తగా ముస్తాబైన రోడ్ల సౌకర్యంతో ప్రజలకు ఇబ్బందులు తొలిగాయి. గతంలో ఏదైనా గమ్యస్థానానికి చేరుకోవాలంటే గంటలకొద్దీ సమయం వెచ్చించాల్సి వచ్చేది. ఇప్పుడది గణనీయంగా తగ్గింది. గుంతల రోడ్లు మాయంకావడం, తారు రోడ్డు సౌకర్యమే అంతటా ఉండడంతో సుఖవంతమైన ప్రయాణం చేరువైంది. గ్రామం నుంచి మండల కేంద్రానికి, మండలం నుంచి జిల్లా కేంద్రానికి, జిల్లా నుంచి రాష్ట్ర రాజధానికి ఇలా లింకు రోడ్లతో ఎటు వెళ్ల్లాలన్నా సానుకూల వాతావరణం ఏర్పడడంతో ప్రజలకు భారీ ఉపశమనం దక్కుతున్నది.
వేగం పెరిగింది…
గతుకుల రోడ్లపై వాహనాలను నడపాలంటే కత్తిమీది సాములాంటిదే. అలాంటి దుస్థితిలో టూ వీలర్, ఫోర్ వీలర్లను తీయాలంటే కూడా జనాలు జంకే పరిస్థితి. అడ్డదిడ్డమైన రోడ్లపై వాహనాలను నడపడంతో రిపేర్లు పేరిట రూ.వేలల్లో ఖర్చు చేసిన అనుభవాలు జనాలకు ఎదురైనవే. వందలాది కిలోమీటర్ల కొద్దీ పరుచుకున్న కొత్త రోడ్లపై ఇప్పటి ప్రయాణం ఇబ్బందుల్లేకుండా మారింది. సాఫీగా సాగే ప్రయాణంతోపాటుగా వాహనాల వేగం పుంజుకోవడానికి సైతం రోడ్ల విస్తరణ దోహదం చేసింది. ఇందుకు నిజామాబాద్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే మార్గాన్ని ఉదాహరించుకోవచ్చు. పదేండ్ల క్రితం ప్రైవేటు వాహనాల్లో రాష్ట్ర రాజధానికి చేరాలంటే దాదాపుగా నాలుగున్నర గంటల సమయం పట్టేది. ఎక్కడా ఆగకుండా వెళ్తేనే ఈ సమయం పట్టేది. స్వరాష్ట్రంలో రోడ్లను బాగు చేయడంతో పరిస్థితి పూర్తిగా మారింది. నిజామాబాద్ నుంచి హైదరాబాద్‌కు ఇప్పుడు ప్రయాణ సమయం కేవలం 3 నుంచి 3.30గంటల మధ్యకే చేరింది. దాదాపుగా గంటన్నర సమయం మిగులుతున్నది. ఇలా ఒక్క హైదరాబాద్ మార్గమే కాదు. ఎటువైపు వెళ్లినా వాహన వేగంలో పెరుగుదల కనిపిస్తున్నది. కారులో హైదరాబాద్ వెళ్లే వేగం గంటకు 80 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల వరకు ఉంటున్నది. గతంలో ఈ వేగం 80 కిలోమీటర్లలోపే ఉండేదంటే అతిశయోక్తి కాదు.
పెరిగిన వాహనాల సంఖ్య..
సీఎం కేసీఆర్ తీసుకుంటున్న విప్లవాత్మకమైన చర్యలతో రాష్ట్ర సంపద గణనీయంగా పెరుగుతున్నది. దీంతోపాటు జనాల తలసరి ఆదాయమూ వృద్ధి చెందుతుంది. ఒకప్పటితో పోలిస్తే ప్రజల కొనుగోలు శక్తిలో గణనీయమైన మార్పు వచ్చింది. నిజామాబాద్ వంటి వ్యవసాయక జిల్లాలోనూ రైతుల ఆదాయం వృద్ధి సాధించి కొనుగోలు శక్తి పెరగడంతో వాహనాల సంఖ్య సైతం రెట్టింపునకు చేరింది. వ్యవసాయ రంగాన్ని సీఎం కేసీఆర్ పరుగులు పెట్టించడంతో రైతులకు లాభదాయకమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. తద్వారా నష్టాలు తగ్గి లాభాలు పెరగడంతో వారంతా ఇతరత్రా సదుపాయాలపైన ఖర్చు పెడుతున్నారు. ఇలా వాహనాలను సైతం కొనుగోలు చేయడం ద్వారా వాటి సంఖ్యలో పెరుగుదల కనిపిస్తున్నది. వ్యవసాయ, వ్యవసాయేతర, వాణిజ్య వాహనాల సంఖ్య లక్షల్లో చేరింది. నిజామాబాద్ జిల్లాలో అన్ని రకాల వాహనాలు దాదాపుగా 5,08,918 రిజిస్ట్రేషన్ అవ్వగా ఇందులో ప్రస్తుతం 4లక్షల 76వేల 415 వాహనాలు రోడ్లపై చక్కర్లు కొడుతున్నట్లుగా రవాణా శాఖ గణాంకాలు చెబుతున్నాయి. మోటర్ సైకిళ్లు 3లక్షల 96వేలు ఉన్నాయి. కార్లు 39వేలు, ట్రాక్టర్లు, ఇతరత్రా వ్యవసాయ వాహనాలు 20వేలు, వ్యవసాయేతర వాహనాలు 4వేలు ఉండగా సరకు రవాణా వంటి భారీ వాహనాలు 17వేలల్లో రిజిస్ట్రేషన్ జరిగాయి. క్యాబ్‌లు 3వేలకుపైగా రిజిస్ట్రేషన్లు నమోదు కాగా 1628 నడుస్తున్నాయి. ఆటోరిక్షాలు 23వేల రిజిస్ట్రేషన్లు జరుగగా 8వేల ఆటోలు నడుస్తున్నాయి.
డ్రైవింగ్ సౌకర్యంగా మారింది..
శక్కర్‌నగర్, మే 17: గతంతో పోలిస్తే డ్రైవింగ్ సౌకర్యంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వ హయాం లో రహదార్ల విస్తరణతోపాటు నూతన బస్సులు అందించడంతో లాంగ్ సర్వీసెస్‌లో గమ్యం చేరేందుకు సమయం ఆదా అవుతున్నది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణీకులకు గమ్యం చేర్చేందుకు గతంలో కొంత ఇబ్బంది పడాల్సివచ్చేది. ఇప్పడు మెరుగైన సేవలు అందించగలుగుతున్నాం.
– ఎండీ హుస్సేన్, ఆర్టీసీ డ్రైవర్, బోధన్
సమయం ఆదా అవుతోంది..
శక్కర్‌నగర్, మే 17: బీడీ కంపెనీ వాహనం ద్వారా ఎడపల్లి నుంచి బోధన్, నిజామాబాద్‌కు నిత్యం వెళ్తాం. గతంలో రోడ్డు, వంతెనలు ఇరుకుగా ఉండడంతో చాలా సమయం పట్టేది. ఇప్పుడు తక్కువ సమయంలో నిజామాబాద్, బోధన్‌కు వెళ్లివస్తున్నాం. రోడ్డు విస్తరణ పనులు పూర్తి కావడం చాలా సంతోషంగా ఉంది. వాహనం నడిపే సమయంలో రోడ్డు ఇరుకుగా ఉండడంతో ఇబ్బందులు పడేవాన్ని. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది.
– సయ్యద్ తజుమ్మల్, బీడీ కంపెనీ వాహన డ్రైవర్, ఎడపల్లి.
గమ్యం చేరడం సులువైంది
కమ్మర్పల్లి, మే 17:జిల్లా సరిహద్దు గ్రామమైన మా కోనాపూర్ మీదుగా నిజామాబాద్ జిల్లాలోని భీమ్‌గల్ మండలం, కమ్మర్పల్లి మండలంలోని పలు గ్రామాల వారు దశాబ్దాలుగా జగిత్యాల, రాజన్న సిరిసిల్లా జిల్లాలోని ప్రాంతాలకు ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు.గతంలో కోనాపూర్ గ్రామం గుండా వెళ్లే రోడ్డు రాజన్న సిరిసిల్ల జిల్లా సరిహద్దు రోడ్లు అధ్వానంగా ఉండేవి. గుంతలు, గతుకుల రోడ్ల ప్రయాణంతో ప్రయాణ కాలం బాగా పట్టేది. 2014 తర్వాత రోడ్లన్నీ బాగు పడ్డాయి. ఇప్పుడు మా సరిహద్దు రోడ్ల మీదుగా జగిత్యాల, కరీంనగర్, వేములవాడ దాకా వెళ్తున్నారు. ప్రయాణించే సమయం చాలా తగ్గింది. దీంతో రెండు జిల్లాల మధ్య ప్రయాణాలు పెరిగాయి. -దయా దేవయ్య, సర్పంచ్, కోనాపూర్, కమ్మర్పల్లి మండలం
నాడు నాలుగ్గంటలు..ఇప్పుడు రెండు గంటలే
కమ్మర్పల్లి, మే 17: మా మానాల నుంచి కరీంనగర్ వెళ్లాలంటే గతంలో నాలుగ్గంటలు వట్టేది. కార్ల వోదమంటే రోడ్లన్నీ బొందలు ఉండి కష్టమయ్యేది. ఇప్పుడు నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం నుంచి, కమ్మర్పల్లి మండలం కోనాసముందర్ కెళ్లి మొదలువెడ్తె మానాల మీదుగా రుద్రంగి దాకా ఎప్పటికప్పుడు రోడ్లు మంచిగ జేసుకుంట అచ్చిన్రు. గిప్పుడైతే రుద్రంగి దాకా డబుల్ రోడవుతున్నది. ఇంకేమున్నది గిప్పుడు రెండు గంటల్లోపే కరీంనగర్ దాక గానీ, జగిత్యాల దాకా గానీ వోతున్నమ్. అటు వేములవాడ, సిరిసిల్ల దాక కూడా ఆర్మూర్, వేల్పూర్, మోర్తాడ్, కమ్మర్పల్లి, భీమ్‌గల్ మండలాల వాళ్లు ఇప్పుడు మానాల మీదికెల్లి జెల్దిన వోతున్నరు.
-రాజారెడ్డి, రైతు, మానాల, బాల్కొండ నియోజక వర్గం
అద్దంలా మెరుస్తున్నాయి
ఖలీల్‌వాడి, మే 17: నిజామాబాద్ రోడ్లు అద్దంలా మెరుస్తున్నాయి. బైపాస్ రోడ్ చాలా బాగున్నది. హైదరాబాద్‌కి వెళ్లాలంటే త్వరగా వెళ్తు న్నాం. మూడు గంటల్లో హైదరాబాద్‌కి చేరుకుంటున్నాం.
– రవి, నిజామాబాద్
ప్రయాణాలు తేలికయ్యాయి
కమ్మర్పల్లి, మే 17:రోడ్ల అభివృద్ధి జరుగడంతో ఏ పని పడ్డా చిటికెలో వెళ్లగలిగే పరిస్థితి ఏర్పడింది. రోడ్లు మాత్రమే కాకుండా భారీ కాలువల మీదుగా కూడా కొత్త వంతెనలు నిర్మించి రోడ్లు వేయడం, పాత వంతెనలు విస్తరించి రోడ్లు వేయడం వంటి అభివృద్ధితో అతి తక్కువ సమయంలో వెళ్లి రాగలుగుతున్నాము. గతంలో అయితే పక్క గ్రామానికి వెళ్లాలన్నా కిలోమీటర్లు తిరిగి వెళ్లి రావాల్సి వచ్చేది.
-చిన్న రాజారెడ్డి, తడ్పాకల్, ఏర్గట్ల మండలం
సులభంగా మారింది..
శక్కర్‌నగర్, మే 17: రోడ్ల విస్తరణతో బోధన్ నుంచి హైదరాబాద్ వయా మెదక్ మీదుగా వెళ్లే సమయంలో ఎక్కువ మంది ప్రయాణీకులకు సేవలు అందించగలుగుతున్నాం. వాహనాల డీజిల్ కంజెప్షన్ కూడా పెరిగింది. తాము అందించే సేవలకు ఆర్టీసీ యాజమాన్యం ద్వారా గుర్తింపు లభిస్తున్నది.
– పోతారెడ్డి, ఆర్టీసీ డ్రైవర్, బోధన్ డిపో
కరీంనగర్, వరంగల్ దాకా రైట్.. రైటే
కమ్మర్పల్లి, మే 17: నిజామాబాద్ జిల్లా నుంచి కరీంనగర్, వరంగల్‌కు వెళ్లాలంటే గతంలో అబ్బో అనిపించేది. కరీంనగర్‌కు కనీసం నాలు గు గంటలు, వరంగల్‌కు ఆరు గంటలు పట్టేది. జిల్లా సరిహద్దు మండలమైన మా ఏర్గట్ల నుంచి కూడా మెట్పల్లి, కోరుట్లకు వెళ్లాలన్నా బాగా సమయం పట్టేది.రోడ్లు బాగుపడడంతో ఇప్పుడు వరంగల్, కరీంనగర్ దాకా వెళ్లే ప్రయాణంలో కనీసం గంట సమయం ఆదా అవుతుంది.
-బద్దం శ్రీనివాస్ రెడ్డి, ఏర్గట్ల