Nizamabad | వినాయక నగర్, నవంబర్ 17 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏడో తరగతి విద్యార్థిని కిడ్నాప్ కు యత్నించాలని ఘటనపై పోలీసు బృందాలు దర్యాప్తు చేపట్టాయి. నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి పర్యవేక్షణలో నగర సీఐ శ్రీనివాసరాజ్ ఆధ్వర్యంలో రెండో టౌన్ ఎస్సై సయ్యద్ ముజాహిద్ సిబ్బందితో కలిసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. హైమది బజార్ ప్రాంతానికి చెందిన ఏడో తరగతి చదివే విద్యార్థిని తాను ఉదయం పాఠశాలకు వెళుతుండగా కారులో వచ్చిన వ్యక్తులు తనను కిడ్నాప్ చేసి తీసుకు వెళ్తుండగా కొద్ది దూరం వెళ్లాక కారులో చిద్దుకి పారిపోయి వచ్చినట్లు తన కుటుంబ సభ్యులకు తెలిపింది.
ఈ ఘటన తీవ్రస్థాయిలో కలకలం సృష్టించడంతో పోలీస్ బృందాలు సదరు బాలిక ఇంటి వద్ద నుండి పాఠశాలకు వెళ్లే మార్గంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ లను పరిశీలించారు. అయితే అందులో ఎక్కడ కూడా కారులో వచ్చి బాలికను కిడ్నాప్ చేసుకొని తీసుకు వెళుతున్న దృశ్యాలు ఆగిపించకపోవడంతో బాలికతో పాటు ఆమె తల్లిని కుటుంబ సభ్యులతో నగర సీఐ శ్రీనివాస్ రాజ్ మాట్లాడారు.
దీంతో బాలిక పొంతనలేని మాటలు చెప్పడంతో అసలు కిడ్నాప్‌కు యత్నం ఘటన జరగలేదని నిరుధారణకు వచ్చినట్లు సీఐ తెలిపారు. అయితే సదరు బాలిక పాఠశాలకు వెళ్లడం ఇష్టం లేక తన కుటుంబ సభ్యులను తప్పుదోవ పట్టించేందుకు తను కిడ్నాప్ చేసినట్లుగా అబద్ధం చెప్పినట్లు పోలీసుల విచారణలో తేలిందని తెలిపారు. అసలు కిడ్నాప్ ఘటన జరగలేదని, అలాంటిది ఏమైనా ఉంటే ఇంకా లోతుగా దర్యాప్తు నిర్వహిస్తున్నామని నగర సీఐ శ్రీనివాస్ రాజ్ స్పష్టం చేశారు.