నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్ర సమీపంలో రూరల్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అధ్యక్షతన గురువారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమయ్యింది. సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ సభకు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన వేలాది జనం దండులా తరలివచ్చారు. నలుదిక్కుల నుంచి వచ్చిన జనంతో సభా ప్రాంగణం నిండిపోయింది.
మధ్యాహ్నం 2గంటల వరకు నిజామాబాద్, డిచ్పల్లి రహదారులన్నీ జనసందోహమయ్యాయి. సభా ప్రాంగణానికి సీఎం కేసీఆర్ రెండు గంటలు ఆలస్యంగా వచ్చినా.. వేలాది సంఖ్యలో వచ్చిన జనాలు ఓపికతో వేచి ఉన్నారు. సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్న ప్రజలు.. వివిధ పథకాలను వివరిస్తూ, మళ్లీ అధికారంలోకి వస్తే మరింత అభివృద్ధి చేస్తామని ప్రకటించగానే చప్పట్లు, కేరింతలతో సభా ప్రాంగణం మార్మోగింది.