నిజామాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/వినాయక్‌నగర్: 24 ఏండ్లకే నేర ప్రవృత్తిని ఎంచుకుని హత్యలు, దోపిడీ లు, దొంగతనాలకు తెగబడుతోన్న సైకో క్రిమినల్ రియాజ్ ఎట్టకేలకు నిజామాబాద్ పోలీసులకు దొరికాడు. 40 గంటల పాటు తీవ్రంగా శ్రమించిన పోలీసులకు సారంగపూర్ సమీపంలో ఓ పాత లారీ క్యాబిన్లో దాక్కోగా చిక్కాడు. ఈ సమయంలోనే ఆసిఫ్ అనే వ్యక్తిని చంపబోగా ఇరువురి మధ్య పెనుగులాట జరిగింది. కత్తితో దాడికి తెగబడిన సమయంలో ఇరువురికి గాయాలయ్యాయి. ఆసీఫ్ రెండు చేతులకు నరాలు తెగి రక్తస్రావం జరిగింది.
రియాజ్‌ను పోలీసులు బంధించి బేడీలు వేశారు. అందుబాటులో ఉన్న బట్టలు, తాళ్లతో చేతులను బంధించారు. బ్లూ కలర్ టీ-షర్ట్‌తో కనిపిస్తున్న నేరగాడు రియాజ్‌లో ఇసుమంతైన బాధ కనిపించక పోగా పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది. అదుపులోకి తీసుకుంటున్న సమయంలోనూ తీవ్రంగా ప్రతిఘటించగా పోలీసు బృందాలు అదిమి పట్టుకుని బంధించాయి. స్వల్ప గాయాలతో కనిపిస్తోన్న రియాజ్‌ను నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నాలుగో అంతస్థులోని 404 గదికి తరలించి వైద్యం అందిస్తున్నారు. రియాజ్‌ను పోలీసులు పట్టుకుంటోన్న సమయంలో స్థానికులు తీసిన ఓ వీడియో వైరల్ అయ్యింది. అందులో మార్‌దో…(చంపేయండి…) అంటూ స్థానిక మహిళలు కేకలు వేయడం స్పష్టంగా రికాైర్డెంది.
రియాజ్ ప్రాణాలతోనే ఉన్నాడు..
– సాయి చైతన్య, నిజామాబాద్ పోలీస్ కమిషనర్
కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య చేసిన హంతకుడు రియాజ్ ప్రాణాలతోనే ఉన్నాడని సీపీ సాయి చైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్కౌంటర్ లాంటిది ఏదీ చోటు చేసుకోలేదని స్పష్టం చేశారు. కాల్పులు జరిగాయంటూ వార్తలు రావడంతో సీపీ వివరణ ఇచ్చారు.
రియాజ్‌కు సహకరించింది ఎవరు?
నేరస్థుడు రియాజ్‌ను అదుపులోకి తీసుకుని వెళ్తుండగా కానిస్టేబుల్ ప్రమోద్, ఎస్సై విఠల్ వాహనాలను పలువురు వెంబడించినట్లు తెలుస్తోంది. రియాజ్‌కు సహకరించేందుకు మరికొంత మంది వ్యక్తులు ప్రయత్నాలు చేసినట్లు పోలీసులు సైతం గుర్తించినట్లు సమాచారం. తన వెంట సహాయంగా ఇతరులు వస్తుండడాన్ని గమనించిన తర్వాతే హత్య చేసేందుకు రియాజ్ నిర్ణయించుకున్నట్లుగా నిర్ధారణ అవుతోంది. ప్రమోద్ను కత్తితో గుండెల్లో పొడిచిన తర్వాత పారిపోయేందుకు వెనువెంటనే ఓ బైక్ వచ్చినట్లు పలువురు భావిస్తున్నారు. ఆ బైక్ ఎవరిది? సహకరించిన వారెవరు? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
రియాజ్ ప్రస్తుతం నివాసం ఉంటున్న ప్రాంతంలో ఇతన్ని ఫాలో అవుతున్న వారు కూడా ఇదే తరహా ఘర్షణలకు పాల్పడుతూ పలువురిని భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. రియాజ్ పాత నేరస్థుడైనప్పటికీ అతడిని అదుపులోకి తీసుకునే సమయంలో సీసీఎస్ పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎస్సై విఠల్, కానిస్టేబుల్ ప్రమోద్ ఇరువురు వాహనాలపైనే నేరస్థుడి ఇంటికి వెళ్లారు. బైక్‌పై కూర్చోపెట్టుకునే ముందు రియాజ్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేయకపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది.
40 గంటలు శ్రమించిన పోలీసులు..
పాత నేరస్థు డు, నరహంతకుడిగా ముద్రపడిన రియాజ్‌ను పట్టుకునేందుకు పోలీసులు 10 బృం దా లు ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రి 9గంటల ప్రాంతంలో హత్య చేసి పరారైన నిందితుడు శనివారం అర్ధరాత్రి పోలీసులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడు. చోరీ చేసిన బైక్‌ను వినియోగించి పారిపోతుండగా పోలీసులు వెంటాడగా సారంగపూర్ నిజాంసాగర్ కెనాల్ వద్ద బైక్‌ను వదిలి పారిపోయాడు. శివారు ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని క్షుణ్ణంగా జల్లెడ పట్టడంతో పాడుబడ్డ లారీలో నక్కిన రియాజ్‌ను ఆదివారం ఉద యం పోలీసులు గుర్తించారు.
ఖాకీలను చూసి పారిపోతున్న సమయంలోనే ఆసిఫ్ అనే యువకుడు అడ్డు తగలడంతో అతనిపై విచక్షణరహితంగా కత్తి పోట్లు పొడవడంతో రెండు చేతులకు నరాలు తెగి తీవ్ర గాయాలయ్యాయి. లారీ దిగి పరుగులు తీసిన రియాజ్‌ను వెంబడించి పట్టుకుని పోలీసులు తమదైన శైలిలో బంధించారు. నరహంతకుడు రియాజ్ వయస్సు 24ఏండ్లు అయినా ఇప్పటి వరకు యాభైకి పైగా కేసులున్నాయి. హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లు, బెదిరింపు కేసులు ఆయా టౌన్లలో నమోదయ్యాయి.