మోర్తాడ్, జూలై 25: మోదీ ప్రభుత్వం ఇండ్లల్లో చిచ్చుపెడుతున్నదని, 60 ఏండ్ల పాలనలో తెలంగాణలో ఎట్ల ఉన్నం…ఎనిమిదేండ్ల టీఆర్ఎస్ పాలనలో ఎట్ల ఉన్నామో రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని గృహనిర్మాణ, రోడ్లు భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నా రు. మోర్తాడ్ పద్మశాలి కల్యాణ మండపంలో మాజీ సర్పంచ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అజీజ్, మండల మాజీ ఉపాధ్యక్షుడు నందగౌడ్తో పాటు మరో 500మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో సోమవారం టీఆర్ఎస్లో చేరారు. మంత్రి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం వచ్చాక రూ.410 ఉన్న సిలిండర్ ధర రూ.11 వందలు దాటిందన్నారు.
పెట్రోల్, డీజీల్ ధరలు డబుల్ అయ్యాయని, దీని కారణంగా ఇంట్లో నిత్యావసరాల ధరలు నింగినంటాయని ఇది పేద ప్రజలకు ఎంతటి ఇబ్బంది కలిగించే పరిస్థితులో ఆలోచించాలని అన్నారు. 60 ఏండ్ల పాలనలో కాంగ్రెస్, బీజేపీ ఏమీ చేశాయని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో పదింతలు పెరిగిన పింఛన్లు, పనిలేక ఇబ్బందులు పడుతున్న బీడీ కార్మికులకు పింఛన్లు, ఇంటింటికీ భగీరథ నీళ్లు, ఆగిపోని కరెంటు ఇవి మనం సాధించుకున్నవని వివరించారు. అభివృద్ధి పనులు, సంక్షేమపథకాలు చూసి కాంగ్రెస్, బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి వస్తున్నారన్నారు. టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన వారందరికీ కష్టాల్లో అండగా ఉంటానన్నారు.
దేశంలో అభివృద్ధి చెందిన పది గ్రామాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయని లెక్కతీయగా పదింటికి పది తెలంగాణలోనే ఉన్న గ్రామాలు ఎంపికైనట్లు తెలిపారు.ఇది చూసి ఓర్వలేక కేంద్రప్రభుత్వం తెలంగాణ పై కక్షగట్టిందని ఆరోపించారు. ఇందులో భాగంగానే ఉపాధి హామీ పథకానికి కొర్రీలు పెడుతున్నదని అన్నారు. తెలంగాణ ప్రజలపై కేంద్రం వివక్ష కాదా ఇది అని మంత్రి ప్రశ్నించారు.
కార్పొరేట్లకు దోచిపెడుతూ… పేదల ఉసురుపోసుకుంటుంది కేంద్ర ప్రభుత్వమని మండిపడ్డారు. ప్రతిపేదవాడు ప్రస్తుతం పెరిగిన ధరలతో ఇబ్బందులు పడకతప్పడం లేదని, ప్రస్తుత సంపాదన సరిపోని పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికీ సంక్షేమపథకాలను అందిస్తుంటే కేంద్రప్రభుత్వం ఇండ్లలో ధరల చిచ్చు పెడుతున్నదని అన్నారు.
జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మాట్లాడుతూ.. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కృషి, సీఎం కేసీఆర్ సహకారంతో బాల్కొండ నియోజకవర్గం అభివృద్ధిలో ముందుందని అన్నారు. బాల్కొండ ఎమ్మెల్యేగా వేముల ప్రశాంత్‌రెడ్డి రూపంలో కేసీఆర్ ఉన్నట్లేనని అన్నారు. పునరుజ్జీవ పథకం సాధ్యమైందంటే కేవలం ప్రశాంత్రెడ్డితోనేనని అన్నారు.
అంతకుముందు బస్టాండ్ ప్రాంతం నుంచి భారీ బైక్‌ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ శివలింగుశ్రీనివాస్, జడ్పీటీసీ బద్దం రవి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కల్లెడ ఏలియా, సర్పంచ్ బోగధరణి ఆనంద్, ఉప సర్పంచ్ గంగారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ మోత్కుభూమన్న, రైతుబంధు సమతి మండల కన్వీనర్ పర్సదేవన్న, టీఆర్ఎస్ మోర్తాడ్ అధ్యక్షుడు రమేశ్, ఎంపీటీసీలు రాజ్‌పాల్, శరణ్యశాస్త్రీ, చిన్నరాజేశ్వర్, జేసీ గంగారెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.