కంఠేశ్వర్, ఫిబ్రవరి 18 : పసుపు రైతులు ఆందోళనకు దిగారు. కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.15వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ మార్కెట్ యార్డు కార్యాలయం ఎదుట మంగళవారం బైఠాయించారు. దళారులు, వ్యాపారులు కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మార్కెట్ యార్డు సిబ్బంది వ్యాపారులకు తొత్తులుగా పని చేస్తున్నారని ఆరోపించారు. పసుపు సీజన్ ప్రారంభమై దాదాపు రెండు నెలలు కావస్తున్నా మార్కెటింగ్ డైరెక్ట్ పర్చేసింగ్ సెంటర్‌ను ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ధరలు నిర్ణయిస్తున్నారని మండిపడ్డారు. మార్కెట్ యార్డుకు పసుపు తీసుకొచ్చి వారం రోజులు గడుస్తున్నా కూడా కొనడం లేదని, దీంతో కొందరు రైతులు దిక్కుతోచక వ్యాపారులు చెప్పిన రేటుకే పసుపు విక్రయించి కన్నీటితో తిరిగి వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నాణ్యత వంకతో నిండాముంచుతున్న వ్యాపారులు
పసుపు నాణ్యత సరిగ్గా లేదని వ్యాపారులు చెబుతున్నారని, ఇదే పసుపును గతంలో అమ్మితే ఎప్పుడూ అడగలేదని, ఇప్పుడే కొత్తగా ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు. నాణ్యత లేని పసుపు తెస్తే ప్రధాన గేటు వద్దనే చెక్ చేసి తిరిగి పంపించాలని, ఎందుకు మార్కెట్లోకి అనుమతించి, వారం రోజులు గడుస్తున్నా కూడా మార్కెట్ యార్డు కమిటీ ఎందుకు స్పందించట్లేదని నిలదీశారు. అసలే మద్దతు ధర లేక నష్టపోతున్న తమకు పెట్టుబడి ఖర్చులు కూడా రావడం లేదని, దానికి తోడు వారం రోజులు మార్కెట్ యార్డులో ఉండడంతో ఖర్చులు అదనపు భారంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏసీ గదుల్లో కూర్చునే అధికారులకు రైతుల బాధలు పట్టవా అని ప్రశ్నించారు. బయట మార్కెట్లో దళారులు మార్కెట్ యార్డు కన్నా మంచి రేటు చెల్లిస్తున్నారని, అయినా కూడా జిల్లాకు పసుపు బోర్డు వచ్చిందని ఆశపడి మార్కెట్లో మంచి మద్దతు ధర లభిస్తుందని ఇక్కడికి వచ్చామన్నారు. కానీ ఇక్కడి వ్యాపారులు నాణ్యత సరిగ్గా లేదన్న వంకతో నిండా ముంచుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కొందరు వ్యాపారులు వచ్చి పసుపును రూ. 8వేలు, రూ.9వేల ధరకు అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్‌కు యార్డుకు వచ్చిన పసుపులో కనీసం 60 శాతం కూడా కొనుగోలు చేయలేదని, అలాంటప్పుడు యార్డు గేటుకు తాళం వేసుకోవాలని సూచించారు. పసుపు పండించే రైతులందరం మరోదారి చూసుకుంటామన్నారు.
పసుపు బోర్డు పేపర్లకే పరిమితం
పసుపు బోర్డు కేవలం పేపర్లలో చూపెట్టడానికి పనికివస్తుందని తప్ప, రైతులకు ఎటువంటి లాభం లేదన్నారు. కేవలం రైతులను మోసం చేసి దగా చేయడానికి పసుపు బోర్డు ప్రకటించారన్నారు. తెగుళ్ల బారిన పడకుండా పసుపును ఏ1, ఏ2గా విభజిస్తే సరిపోతుందని, కానీ పూర్తిగా నాణ్యత లోపం ఉన్నదని పక్కకు పెట్టి, రైతులు దిక్కు తోచక తక్కువ ధరకు విక్రయిం చి పోయేలా వ్యాపారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించా రు. పసుపు మద్దతు ధర విషయమై పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డిని అడిగితే తనకేమీ తెలియదని, మార్కెట్ కమిటీ చైర్మన్‌తో మాట్లాడాలని అంటున్నారని తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్‌ను సంప్రదిస్తే పసుపు బోర్డు చైర్మన్‌తో మాట్లాడుకోవాలని చెబుతున్నారని మండిపడ్డారు. మద్దతు ధర వచ్చే వరకూ పోరాడుతామని స్పష్టం చేశారు. ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు మార్కెట్ కమిటీ సెక్రటరీ అపర్ణ రాగా.. మార్కెట్లో పసుపు వారం, పది రోజులు గడుస్తున్నా ఎందుకు కొనట్లేదని, పసుపు నాణ్యత లోపం ఎక్కడుందో చూపించాలని, డైరెక్ట్ పర్చేస్ సెంటర్‌ను ఎందుకు ఏర్పాటు చేయలేదో చెప్పాలని రైతులు ప్రశ్నించారు. డైరెక్ట్ పర్చేసింగ్ సెంటర్‌ను రెండు రోజుల్లో ఏర్పాటు చేస్తామని సెక్రటరీ చెప్పడం గమనార్హం. రై తుల ఆందోళన కార్యక్రమం లో రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకుడు ప్రభాకర్ తదితరులు పాల్గొ న్నారు.
దిక్కుతోచని స్థితితో ఉన్నాం..
గత మంగళవారం యా ర్డుకు పసుపు కొమ్మును తీసుకువచ్చా. ఇంతవరకు కొనుగోలుచేయలేదు. నాణ్యత సరిగ్గా లేదని దళారులు రేటు ఇయ్యట్లేదు. వ్యాపారులు కొనట్లేదు. దిక్కుతోచని స్థితిలో ఉంటున్నాం.
నాణ్యత లేదని తిరస్కరిస్తున్నరు..
మార్కెట్ యార్డుకు తెచ్చిన పసుపు నాణ్యత లేదని తిరస్కరిస్తున్నరు. పసుపు కొమ్ముల నాణ్యత సరిగ్గా లేకపోతే ప్రధాన ద్వారం వద్దను చెక్‌చేసి తిరిగి పంపించవచ్చు. లోపలికి వచ్చిన తర్వాత నాణ్యత లేదని చెప్పి కాలయాపన చేస్తున్నరు. పసుపు కొమ్మును తక్కువ రేటుకు అమ్ముకునేలా చేస్తున్నారు.
-సాగర్‌రెడ్డి, నిర్మల్
ఖర్చులు కూడా రావడంలేదు..
కనీస మద్దతు ధర వస్తుందని ఆశతో మార్కె ట్ యార్డుకు పసుపు తీసుకొస్తే వ్యాపారులు, అధికారులు కలిసి నిండా ముంచుతున్నరు. పెట్టుబడి పైసలు పక్కన పెడితే కనీ స ఖర్చులు కూడా రావడం లేదు. ఏం చేయాలో అర్థమైతలేదు.
-ఇందూరు నగేశ్, నిర్మల్
ధర తగ్గించడానికే కాలయాపన
నాణ్యత సరిగ్గా లేకుంటే ఏదో కొద్దిగా తగ్గించి పసుపు కొనుగోలు చేయవచ్చు. పూర్తిగా కొనుగోలు చేయకుండా పక్కన పెట్టి రైతులే తమంతట తాము ధరలు తగ్గించుకునేలా చేస్తున్నారు.
-శంకర్, మామడ, నిర్మల్ జిల్లా
పసుపు బోర్డు వచ్చి ఏం లాభం?
పసుపు ధరలు మరీ తగ్గించి రూ. 8వేలు, రూ.9వేలకు వ్యాపారులు కొంటున్నారు. పసుపు బోర్డు వచ్చినా ఏం లాభం లేకుండా పోయింది. చైర్మన్లు, వ్యాపారులు అందరూ కుమ్మక్కై రైతులను నిండా ముంచుతున్నరు.
-ఉపేందర్‌రెడ్డి, రెంజర్ల, ముప్కాల్