కేసీఆర్ కబడ్డీ టోర్నీ విజేతగా నిజామాబాద్ మహారాణా ప్రతాప్ జట్టు నిలిచింది. కేసీఆర్ సేవాదళం ఆధ్వర్యంలో నగరంలోని పాత కలెక్టరేట్ మైదానంలో మూడురోజులుగా ఉత్కంఠగా సాగిన కబడ్డీ పోటీలు గురువారం ముగిశాయి. విజేతలకు కేసీఆర్ సేవాదళం వ్యవస్థాపక అధ్యక్షుడు మహ్మద్ అమీర్, జడ్పీ చైర్మన్ విఠల్‌రావు, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్‌సాగర్ తదితరులతో కలిసి అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా బహుమతులు అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత క్రీడాకారులకు అన్నివిధాలుగా ప్రోత్సాహం అందిస్తున్నారని ఎమ్మెల్యే బిగాల అన్నారు.
నిజామాబాద్ క్రైం, జనవరి 12: కేసీఆర్ సేవా దళం ఆధ్వర్యంలో ఇందూరు వేదికగా నిర్వహించిన కేసీఆర్ కప్-23 కబడ్డీ టోర్నీ గురువారం ముగిసింది. నగరంలోని పాత కలెక్టరేట్ మైదానంలో మూడురోజులపాటు ఉత్కంఠగా సాగిన ఈ పోటీల్లో 40 జట్లు పాల్గొన్నాయి. చివరిరోజైన గురువారం నిజామాబాద్ అర్బన్, కొత్తపల్లి జట్లు హోరాహరీగా తలపడగా.. నిజామాబాద్ మహారాణా ప్రతాప్ జట్టు కేసీఆర్ కప్‌ను కైవసం చేసుకున్నది. సాయంత్రం బహుమతుల ప్రదానోత్సవం ఏర్పాటు చేయగా.. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, రాష్ట్ర ఆర్టీఏ కమిషనర్, కేసీఆర్ సేవా దళం వ్యవస్థాపక అధ్యక్షుడు మహ్మద్ అమీర్, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్‌సాగర్ తదితరులు హాజరయ్యారు. ఫైనల్ మ్యాచ్‌లో తలపడిన క్రీడాకారులను అతిథులు పరిచయం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఏర్పాటు చేసిన బహుమతుల ప్రదానోత్సవంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా మాట్లాడుతూ.. గెలుపోటములు సహజమని అన్నారు. ఓడినవారు నిరాశకు గురికాకుండా గెలుపుకోసం కృషి చేయాలని సూచించారు. క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి, వారిని ప్రోత్సహించేందుకు కేసీఆర్ సేవాదళం ఆధ్వర్యంలో టోర్నీ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ టోర్నీపై ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక శ్రద్ధచూపించారని తెలిపారు. యువతకు అండగా నిలుస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ క్రీడారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. క్రీడాకారులకు అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తున్నారని అన్నారు.
కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూకిరణ్, మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి, ప్రముఖ బాక్సర్ హుసాముద్దీన్, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, కేసీఆర్ సేవాదళం జిల్లా అధ్యక్షుడు రమణారావు, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఏటీఎస్ శ్రీనివాస్, ఒలింపిక్ సంఘం జిల్లా అధ్యక్షుడు ఈగ సంజీవ్ రెడ్డి, బొబ్బిలి నర్సయ్య, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు కిషన్, బీఆర్ఎస్ నాయకులు తారీక్ అన్సారీ, నుడా డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్, మాజీ పీపీ దాదన్నగారి మధుసూదన్‌రావు, పీఈటీలు సాయాగౌడ్, సుబ్బారావు, స్వామి, ప్రశాంత్ పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, రాష్ట్ర ఆర్టీఏ కమిషనర్ మహ్మద్ అమీర్, బాక్సింగ్ క్రీడాకారుడు హుసాముద్దీన్‌ను సన్మానించారు.
కేసీఆర్ కప్ చాంపియన్‌గా నిలిచిన నిజామాబాద్ మహారాణా ప్రతాప్ జట్టుకు రూ.50 వేల నగదు, రన్నర్‌గా నిలిచిన ముప్కాల్ మండలం కొత్తపల్లి జట్టుకు రూ.30 వేల నగదు, సెకండ్ రన్నర్‌గా నిలిచిన బోర్గం జట్టుకు రూ.10 వేల నగదుతోపాటు కప్‌ను అందజేశారు.