నిజామాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) కాంగ్రెస్ పార్టీలో కొత్త కుంపటి రాజుకున్నది. అసంతృప్త ఎమ్మెల్యేల ప్రత్యేక భేటీల పర్వం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నది. ఇందులో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఉండడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. కొంత మంది మంత్రుల తీరును నిరసిస్తూ వీరంతా సమావేశమయ్యారని జోరుగా ప్రచారం జరుగుతున్నది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సైతం ఈ విషయంపై బాహాటంగానే నోరు విప్పడంతో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఎమ్మెల్యేలకు తగిన గుర్తింపు లేకపోవడం, తమ మాటను ఎవరూ పట్టించుకోకపోవడం, చేపట్టిన పనులకు ఉన్నత స్థాయిలో వసూళ్ల పేరుతో దోపిడీ చేస్తుండడంతోనే ఎమ్మెల్యేలంతా ఓ ఫామ్ హౌస్‌లో సమావేశమై చర్చించుకున్నట్లు తెలుస్తున్నది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు కొత్త ఎమ్మెల్యేలు ఈ భేటీకి హాజరైనట్లు ప్రచారం జరుగుతుండడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తున్నది. గతంలో ఇతర పార్టీలో పని చేసి కాంగ్రెస్ గూటికి చేరి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ‘అసమ్మతి భేటీ’కి హాజరైనట్లు స్పష్టత వచ్చినప్పటికీ, ఉమ్మడి జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే పాల్గొనడంపై ఎలాంటి స్పష్టత రావడం లేదు. ఫామ్‌హౌస్ సమావేశంలో ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నట్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం జరిగింది. భేటీలో పాల్గొన్నది వాస్తవమని చెప్పేందుకు కానీ, పాల్గొనలేదని ప్రకటించేందుకు కానీ సదరు ఎమ్మెల్యేలెవ్వరూ ముందుకు రాకపోవడమూ గమనార్హం
కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 15 నెలలవుతున్నా ఉమ్మడి జిల్లాకు మంత్రి పదవి దిక్కులేదు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి సీనియర్, జూనియర్ ఎమ్మెల్యేలు నలుగురు ఉండగా, వీరిని కాంగ్రెస్ అధిష్టానం కనీసం పట్టించుకోవడం లేదు. రేవంత్ కేబినెట్లో 11 మంది మంత్రులుండగా, మరో ఆరుగురికి అమాత్య పదవులు ఇచ్చేందుకు అవకాశమున్నది. ఏడాది కాలంగా మంత్రి లేకపోవడంతో ఉమ్మడి జిల్లా పాలన అస్తవ్యస్తంగా మారింది. ఇన్చార్జి మంత్రి చెప్పినట్లే యంత్రాం గం పని చేస్తున్నది. తప్పితే కాంగ్రెస్ ఎమ్మెల్యేల మాట కు కనీస విలువ దక్కడం లేదు. కలెక్టర్లు, ఎస్పీ, సీపీ సైతం కొత్త ఎమ్మెల్యేలకు సరైన విధంగా గౌరవ, మర్యాదలు ఇవ్వడం లేదన్న ప్రచారం జరుగుతున్నది. గతంలో ఓ ఎమ్మెల్యేకు, సీపీ కల్మేశ్వర్ సింగెనవార్ పెద్ద ఎత్తున ఝలక్ ఇవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపింది. ఇప్పటికీ ఎమ్మెల్యేల పరిస్థితి అదే స్థాయిలో ఉండడంతో కక్కలేక, మింగలేక అన్నట్లుగా హస్తం పార్టీ ప్రజా ప్రతినిధుల పరిస్థితి తయారైంది. తీవ్ర అసంతృప్తితో రగిలి పోతున్న ఎమ్మెల్యేలు ఎవరికి వారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో తలమునకలయ్యారని, అందులో భాగంగానే క్యాంప్ రాజకీయాలకు ఆకర్షితులైనట్లు తెలిసింది. మంత్రివర్గ కూర్పులో చోటు కోసం, అలాగే, కొంత మంది మంత్రుల తీరుకు వ్యతిరేకంగా ఈ భేటీ ఏర్పాటు వేసినట్లు సమాచారం. 10 మందికి పైగా ఎమ్మెల్యేల రహస్య భేటీతో ఒక్కసారిగా అధికార పార్టీలో కలకలం రేగింది.
హస్తంలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉంటుంది. పీసీసీ చీఫ్ ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత జిల్లాలోనే గందరగోళం చోటు చేసుకుంటున్నది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలువురు సీనియర్లకు పదవులు దక్కకపోవడం, కష్టపడిన నేతలను పక్కన పెట్టడంతో అంతర్గతంగా అసంతృప్తి రగులుతున్నది. ఆరోపణలున్న వ్యక్తులకు పెద్ద పీట వేయడం, ఒకే సామాజిక వర్గానికి వంత పాడుతూ పదవులు కట్టబెడుతున్న తీరుపైనా చర్చ నడుస్తున్నది. ఈ విషయంలో బడుగు, బలహీన వర్గాల నేతలంతా గుర్రుగా ఉన్నారు. తాజాగా ఎమ్మెల్యేలే పార్టీ నియమ, నిబంధనలకు విరుద్ధంగా సమావేశం కావడంతో హస్తం పార్టీలో మరింత గందరగోళం నెలకొన్నది. డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్‌రెడ్డిని కో-ఆపరేటివ్ యూనియన్ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించడంతో అధ్యక్ష పదవిని ఇంకొకరితో భర్తీ చేయాల్సిన అనివార్యత ఏర్పడింది. నెలలు గడుస్తున్నా ప్రభుత్వంలో పదవులు దక్కక, పార్టీలోనూ అవకాశాలు రాక చాలా మంది లోలోన రగిలి పోతున్నారు. ఈ క్రమంలోనే జరిగిన ఫామ్‌హౌస్ భేటీ ఉమ్మడి జిల్లాలో ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన ఆ ఎమ్మెల్యేలపై కౌంటర్లు విసురుతున్నారు. ఇదేం పద్ధతి అంటూ సొంత పార్టీ లీడర్లు ఓ వైపు, ఇదీ కాంగ్రెస్ పార్టీ నైజం అంటూ సాధారణ ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు. ఈ భేటీ వ్యవహారం చినికి చినికి గాలి వానలా మారడంతో ఎమ్మెల్యేల నోటికి అధిష్టానం తాళం వేసింది.