ఖలీల్‌వాడి, జనవరి 13: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖాన (జీజీహెచ్) సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్‌పై వేటు పడింది. ఆమె వ్యవహార శైలిపై అనేక ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం ఆమె ను బాధ్యతల నుంచి తప్పిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ప్రతిమారాజ్ హయాంలో జరిగిన కార్యకలాపాలపై విచారణకు ఆదేశించింది. ఇటీవల నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ దవాఖానలో ఘనంగా ఆమె పుట్టినరోజు వేడుకలు జరుపు కోవడం, సిబ్బంది నుంచి కానుకలు పొందడం, రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైనం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఈ ఘటనను సీరియస్‌గా పరిగణించిన వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూపరింటెండెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఆమె హయాంలో వెలువడిన టెండర్లు, ఇతర పనులపై విచారణకు ఆదేశించారు. రోగుల అవస్థలను పట్టించుకోకుండా తన చాంబర్‌ను ఫంక్షన్‌హాల్‌గా మార్చుకుని పుట్టిన రోజు వేడుకుల నిర్వహించుకోవడం, సిబ్బంది నుంచి కానుకలు పొందడాన్ని ప్రభు త్వం సీరియస్‌గా పరిగణించింది.
బర్త్‌డే వేడుకలకు కొన్ని గంటల ముందు నవీపేట్‌కు చెందిన ఓ వ్యక్తి ఫిట్స్ వచ్చిన తన భార్యను చికిత్స కోసం భుజాన వేసుకుని దవాఖాన మొత్తం తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. వైద్యం కోసం ఓ రోగి అల్లాడిపోయిన ఈ ఆ ఉదంతంపై ఎమ్మెల్యేలు సైతం ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం సీరియస్ అయ్యింది. దవాఖాన సూపరింటెండెంట్‌ను బాధ్యతల నుంచి తప్పిస్తూ ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్చార్జి సూపరింటెండెంట్‌గా పీడియాట్రిక్ విభాగాధిపతి ప్రొఫెసర్ శ్రీనివాస్‌కు బాధ్యతలు అప్పగించారు.