నిజామాబాద్, జూన్ 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఓ సీఐ లంచావతారం… ఉన్నతాధికారి అక్రమాస్తులే కాదండోయ్… అనేక మంది ఖాకీ దుస్తులు వేసుకుని వసూళ్లకు తెగబడుతోన్న వ్యవహారం ఇప్పుడు ఎక్సైజ్ శాఖలో సంచలనం రేకెత్తిస్తోంది. నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌ను అక్రమాస్తుల కేసులో ఏసీబీ అరెస్టు చేసిన తర్వాత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆబ్కారీ అధికారుల వసూళ్ల వ్యవహారం ఒక్కోటి బయటకు వస్తున్నాయి. ముక్కు పిండి మామూళ్లకు పాల్పడుతున్న కొందరు అధికారుల వ్యవహారంపై ఆగ్రహావేశాలు భగ్గుమంటున్నాయి. ఆల్ఫాజోలం, గంజాయి స్మగ్లింగ్ వంటి అనేక అంశాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు.
అక్రమార్కులు ఎంతటి వారైనా పట్టుకోవాలని, ఊచలు లెక్కించాలని కఠినంగా పేర్కొన్నారు. కానీ నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో ఆల్ఫాజోలం అమ్మకం దారులు, గంజాయి స్మగ్లర్లకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. అడపాదడపా పోలీసులు మినహా ఎక్సైజ్ వాళ్లు శోధిస్తున్న కేసులు తక్కువ ఉంటున్నాయి. కల్తీ కల్లు విచ్చలవిడిగా తయారవుతోంది. జోరుగా అమ్మకాలు సాగుతున్నాయి. నిరోధించాల్సిన ఎక్సైజ్ అధికారులు ఏకంగా మామూళ్ల మత్తులో మునిగి తేలుతున్నారు. కల్లు బట్టీల వారీగా ఓ ఎక్సైజ్ అధికారికి రావాల్సిన వసూళ్ల చిట్టా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటం చర్చనీయాంశం అవుతోంది. ఇదీ తప్పో ఒప్పో పక్కన పెడితే మామూళ్ల వ్యవహారం ముమ్మాటికి నిజమేనని సొంత శాఖ సిబ్బంది చెబుతున్నారు. విచారణ చేస్తే నిజాలు బయటకు వస్తాయని అంటున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఓ కీలక అధికారికి సంబంధించిన డైరీ ఇప్పుడు ఎక్సైజ్ శాఖను షేక్ చేస్తోంది. నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వ్యవహారం వెలుగు చూసిన వెంటనే మరికొంత మంది అక్రమార్కులు ఉన్నారనే సంకేతాలు ఇచ్చే విధంగా సొంత శాఖలో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా నిలిచింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న చేతి రాతతో కూడిన మామూళ్ల చిట్టాపై సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. సదరు ఎక్సైజ్ అధికారి తన పరిధిలోనే పదుల సంఖ్యలోని కల్లు దుకాణాలకు నెలవారీగా టార్గెట్లు స్పష్టంగా రాసుకున్నారు.
అప్పుడు(Then), ఇప్పుడు(Now) అంటూ పెంచిన మామూళ్ల డబ్బులను పట్టిక రూపంలో పొందు పర్చారు. మొదటి దుకాణానికి గతంలో నెలకు రూ.16వేలు ఇవ్వాల్సి ఉన్నట్లుగా ఉండగా ప్రస్తుతం రూ.20వేలు ఇవ్వాలన్నట్లుగా అందులో పేర్కొన్నారు. మిగిలిన దుకాణాదారులు ఎంతెంత మామూళ్లు ఇవ్వాలో ఫిక్స్ చేశారు. సొంత శాఖలో, సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఆ డైరీలోని రెండు పేజీల్లోని వివరాల ప్రకారం ప్రతి నెల దాదాపుగా రూ.లక్షన్నర నుంచి రూ.2లక్షల వరకు అక్రమ ఆదాయాన్ని సంపాదిస్తున్నట్లు స్పష్టం అవుతోంది.