ఖలీల్‌వాడి, సెస్టెంబర్ 20: నిజామాబాద్ జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు అలుక కిషన్ తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఈ విషయాన్ని రాష్ట్ర నాయకత్వం నిర్ధారించింది. ఎన్నికలు జరిగే వరకూ అధ్యక్షుడిగా కొనసాగాలని కిషన్‌కు సూచించినట్లు తెలిపింది. టీఎన్జీవో పాలకవర్గానికి కొన్నేళ్లుగా ఎన్నికలన్నవే లేకుండా పోయాయి. ఏకగ్రీవాల పేరుతో సంవత్సరాల పాటు కొందరు ఏకఛత్రాధిపత్యంతో అంతా తామై నడిపించారు. నిబంధనలకు విరుద్ధంగా ఏళ్ల తరబడి పదవుల్లో కొనసాగుతున్న వైనంపై ‘సీటు వదలం’, ‘ఢీఎన్జీవో’ శీర్షికలతో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనాలను ప్రచురించిన సంగతి తెలిసిందే.
టీఎన్జీవోలో కొందరి గుత్తాధిపత్యం, సభ్యుల్లో నెలకొన్న అసంతృప్తిని ఎత్తిచూపింది. గెజిటెడ్ ఉద్యోగులు టీఎన్జీవోలో ఉండొద్దన్న నిబంధనను సైతం తుంగలో తొక్కి బాధ్యతలు నిర్వహించడంపై ఉద్యోగ వర్గాల్లోనే తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. వీటన్నింటినీ ఎత్తిచూపుతూ ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన కథనాలను జత చేస్తూ కొందరు రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలోనే రాష్ట్ర కార్యవర్గం ఈ వ్యవహారంపై సీరియస్‌గా దృష్టి సారించింది. మరోవైపు, టీజీవోలు.. టీఎన్జీవో బాధ్యతల నుంచి తప్పుకోవాలని ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది. ఇక చేసేదేమీ లేక తప్పనిసరి పరిస్థితుల్లో అలుక కిషన్ పదవి నుంచి తప్పుకున్నారు. దశాబ్ద కాలంగా టీఎన్జీవోలో చక్రం తిప్పిన ఆయన వైదొలిగారన్న విషయం తెలిసి ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.