వేసవి వచ్చిందంటే వాహనదారులు వివిధ రకాల సమస్యలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా పార్కింగ్ స్థలం లేకపోవడంతో ఎండలోనే వాహనాలను నిలపడం ద్వారా రంగు వెలిసిపోతాయి. ఇంజిన్ నుంచి పొగలు రావడం, పెట్రోల్ ఆవిరైపోవడం, టైర్‌పంక్చర్ కావడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. వీటిని అరికట్టేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.
ఖలీల్‌వాడి, మార్చి 29: వేసవిలో.. ఎండల తాపం నుంచి బయటపడి ఆరోగ్యంగా ఉండేందుకు ప్రజలు ముందస్తుగా అనేక రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటారు. మనం నిత్యం వాడే ద్విచక్ర వాహనం విషయంలోనూ ఆ జాగ్రత్తలు అవసరం. అలా తీసుకోకుంటే ఇంధన పరంగా నష్టపోతాం. దానితోపాటు వాహనం మరమ్మతులకు గురై కొత్త ఇబ్బందులు వస్తాయి. వాటి నుంచి గట్టెక్కాలంటే వేసవిలో వాహనదారులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.
ఇంధనం..
వాహనాన్ని ఎండలో పార్కింగ్ చేస్తే ఇంధనం ఆవిరవుతుంది. ట్యాంకులను ఇనుముతో తయారు చేయడంతో ఎండకి ఆ ట్యాంకులు వేడెక్కి అందులోని పెట్రోల్, డీజిల్ ఆవిరవుతుంది. వాహనాన్ని గంటసేపు ఎండలో ఉంచితే సుమారు 40 నుంచి 80 మిల్లీ లీటర్లు ఇంధనం మాయమవుతుంది. ఎండకు ఉంచిన వాహనాల టైర్లు, ట్యూబ్‌లు మెతకబడి వాటి సామర్థ్యం తగ్గిపోతుంది. త్వరగా పంచర్లుపడే అవకాశం ఉంటుంది. ఎండలో గంటలు తరబడి ఉంచడంతో రంగు త్వరగా వెలిసిపోతుంది. హెడ్‌లైట్ డోమ్‌లు, బ్రేక్వైర్లు, హ్యాండిల్ గ్రిప్స్, సీటు కవర్లు, ట్యాంకు పైకవర్లు, సైడ్ మిర్రర్స్ ఇలా ప్లాస్టిక్, ఫైబర్‌తో చేసినవి కావడంతో పాడైపోతుంటాయి.
రూ. వేలల్లో ఖర్చు..
నెలకు సుమారు 7 లీటర్ల ఇంధనం ఆవిరైపోతే రూ.800లు వృథాగా పోయినట్లే. వాహన రంగు మళ్లీ వేయాలంటే రూ. 5వేల నుంచి రూ.10వేల వరకు ఖర్చవుతుంది. అయినా కంపెనీవారు ఇచ్చిన కచ్చితమైన రంగులా ఆకట్టుకోలేవు. టైర్లు, ట్యూబ్‌లు పాడైతే రూ. 3వేల నుంచి 5వేల వరకు ఖర్చవుతుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఎండాకాలంలో వాహనాల ఇంజిన్ ఆయిల్ త్వరగా వేడెక్కుతుంది. అందుకే సరైన సమయంలో ఇంజిన్ ఆయిల్ మార్చుకోవాలి.
బయటికి వెళితే వాహనాన్ని నీడలో పార్క్ చేసుకోవాలి.
బైక్ పెట్రోల్ ట్యాంకుపై కవర్ ఉండేలా చూసుకోవాలి.
సాధారణ సీటు కవర్లు త్వరగా వేడెక్కుతాయి. ఇది మన ఆరోగ్యానికి కూడా హానికరం. వెల్వెట్, కాటన్ వంటివి వాడడం మంచిది.
టైర్లు అరిగిపోతే మార్చుకోవాలి.
ఎండాకాలం ఇంజిన్గార్డు తొలగించడం మంచిది. దూర ప్రయాణమైతే బస్సుల్లోనే వెళ్లాలి. ఒకవేళ వాహనం తీయాల్సి వస్తే.. మధ్య మధ్యలో ఆగడం మంచిది. ఇలా చేయడంతో ఇంజిన్ వేడి తగ్గుతుంది.
వేసవిలో ట్యాంకులో గ్యాస్ ఏర్పడుతుంది. రాత్రిపూట ఒకసారి ట్యాంకు మూత తీసి మళ్లీ పెట్టాలి. దీంతో గ్యాస్ బయటికి పోయి ఆయిల్ సులువుగా ఇంజిన్లోకి వెళ్తుంది.
మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు ద్విచక్రవాహనంపై ప్రయాణం చేయవద్దు.
ఉదయం 8 గంటలకు ముందు, సాయంత్రం 6 గంటల తర్వాత పెట్రోల్ పోయించుకోవాలి.
ఓ వ్యక్తి రోజూ సుమారు ఐదు గంటలపాటు ఎండలో తన వాహనాన్ని నిలుపుతాడు. దీంతో పావు లీటర్ పెట్రోల్ ఆవిరైపోతుంది. ఇలా నెలకు సుమారు 7లీటర్ల వరకు నష్టపోతాడు. ఇంటి వద్ద నీడలో నిలుపుకొనే సదుపాయం లేక ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు ఎనిమిది గంటల పాటు ఎండలో ఉంచడంతో అతనికి నెలకు పది లీటర్ల వరకు నష్టం జరుగుతుంది.