ఖలీల్‌వాడి, మార్చి 29 : ఎంపీ అర్వింద్ తన నోటిని అదుపులో పెట్టుకోవాలని, ఆయన నటన, పిచ్చి చేష్టలను భరించలేక బీజేపీ కార్పొరేటర్లు టీఆర్ఎస్లో చేరుతున్నారని నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎంపీ అర్వింద్ గెలిచిన నాటి నుంచి మాటలు చెప్పడం తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. అర్వింద్ తండ్రి డి.శ్రీనివాస్ కు సీఎం కేసీఆర్ రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇస్తే ఆయన కూడా చేసిందేమీ లేదన్నారు. అర్వింద్ మతం పేరుతో ఓట్లకోసం పాకులాడతున్నారని ఆరోపించారు. తెలంగాణ రైతులు సాగుచేస్తున్న ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని పార్లమెంట్లో మాట్లాడిన పాపాన పోలేదని అస హనం వ్యక్తం చేశారు.
ముందు ప్రజలకు ఏమి కావాలో తెలు సుకోవాలని, మత రాజకీయాలు చేస్తే ప్రజలు తగిన బుద్ధిచెబుతారని అర్వింద్‌ను హెచ్చరించారు. కులం, మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టే వారికి ప్రజల సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. అర్వింద్ నోటి దురుసు కారణంగా బీజేపీ కార్పొరేటర్లు ఆ పార్టీని వీడుతున్నారని, నిజామాబాద్ నగరంలోని ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై చేరుతున్నారని అన్నారు. ఎమ్మెల్సీ కవిత సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన కార్పొరేటర్లు సుధామధుకర్, రాధాకష్ణకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తారని, తెలంగాణలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను దేశమంతటా చేసి చూపిస్తారన్నారు. సమావేశంలో ఎనుగందుల మురళి, రాజేంద్రప్రసాద్, అక్తర్‌ఖాన్, అంబదాస్, శ్రీహరినాయక్, రాజేశ్వర్ తదితరులు పాల్గ్గొన్నారు.