కమ్మర్పల్లి, మార్చి 29 : కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో వ్యాపారిలా వ్యవహరిస్తున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వడ్లు కొనమంటే తెలంగాణ వాళ్లకు నూకలు తినిపించడం నేర్పండి అంటూ అవమానించారని గుర్తు చేశారు. జిల్లాలో మన ఊరు -మన బడి కార్యక్రమాన్ని మంగళవారం నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం ఉప్లూర్ జడ్పీ హైస్కూల్ నుంచి ఆయన ప్రారంభించారు. గ్రామంలో పెద్ద ఎత్తున చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ.. పేద పిల్లలకు కార్పొరేట్ పాఠశాలల్లో మాదిరిగా నాణ్యమైన విద్యతోపాటు సదుపాయాలు కల్పించాలన్న సీఎం కేసీఆర్ ఆలోచనల నుంచి పుట్టిందే మన ఊరు-మన బడి కార్యక్రమమని తెలిపారు.
ఈ కార్యక్రమంతో వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఇంగ్లిష్ బోధన ప్రారంభమవుందని చెప్పారు. తన నియోజక వర్గంలోని ఉప్లూర్ గ్రామం నుంచి మన ఊరు-మన బడి కార్యక్రమం ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. గ్రామంలోని ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో సదుపాయాలు, అభివృద్ధి కల్పనకు రూ.70 లక్షలు ఈ కార్యక్రమం కింద మంజూరైనట్లు తెలిపారు. రాష్ట్రంలోని పాఠశాలల నుంచి ఏటా మూడో వంతు పాఠశాలలను మన ఊరు-మన బస్తీ- మన బడి కింద తీసుకుంటారని చెప్పారు. రాష్ట్రంలో 26 వేల పాఠశాలలను రూ. 7, 200 కోట్లతో ఈ కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. తొలివిడుతగా 9100 పాఠశాలలను తీసుకొని రూ.3,400 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. నిజామాబాద్ జిల్లాలో 1150 పాఠశాలలు ఉండగా, మొదటి విడుతలో 407 స్కూళ్లలో రూ.160 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వివరించారు. బాల్కొండ నియోజక వర్గంలో 81 పాఠశాలల్లో రూ.30 కోట్లతో చేపడుతున్నట్లు చెప్పారు. తెలంగాణ విద్యార్థులు ప్రపచంతో పోటీ పడాలని ఆక్షాంక్షించారు. ఈ కార్యక్రమం రాజకీయాలు, ఓట్ల కోసం చేపట్టింది కాదన్నారు. ఏప్రిల్ నెల నుంచి కొత్త పింఛన్లు అందించనున్నట్లు తెలిపారు. మహిళా సంఘాలకు వడ్డీ మాఫీ నిధుల విడుదల జరుగుతుందన్నారు. గత ఎన్నికల వేళ తాను ఉప్లూర్ గ్రామ బాల రాజేశుడి గుడి ముందు నిలబడి ఎస్సారెస్పీ కాకతీయ కాలువను 360 రోజులు నిండుగా ఉంచుతానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని గుర్తు చేశారు.
దేశానికే ఆదర్శం ‘మన ఊరు-మన బడి’
జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు మాట్లాడుతూ మన ఊరు-మన బడి కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలువనున్నదని అన్నారు.కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసే మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా విప్లవాత్మక మార్పు రానుందన్నారు. అంతకుముందు మంత్రికి గ్రామస్తులు బోనాలతో తరలి వచ్చి స్వాగతం పలికారు. అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, ఎంపీపీ లోలపు గౌతమీ సుమన్, జడ్పీటీసీ పెరుమాండ్ల రాధా రాజా గౌడ్, డీసీసీబీ వైస్ చైర్మన్ కుంట రమేశ్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ మలావత్ ప్రకాశ్, ఆర్డీవో శ్రీనివాసులు, ఎంపీటీసీ పిప్పెర అని ల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్, రాష్ట్ర నాయకుడు బద్దం చిన్నా రెడ్డి, ఉప సర్పంచ్ నందగిరి రేఖ, బద్దం భాస్కర్ రెడ్డి, టీఆర్ఎస్ మండల మహిళా అధ్యక్షురాలు మాసం పద్మ, మురళి, బద్దం రమేశ్‌రెడ్డి, బద్దం మోహన్ రెడ్డి, సామ నరేశ్, గంగారెడ్డి, ఎంపీ డీవో సంతోష్ రెడ్డి, తహసీల్దార్ బావయ్య, ఎంఈవో ఆంధ్రయ్య, హెచ్ఎం దేవయ్య పాల్గొన్నారు.