నమస్తే తెలంగాణ యంత్రాంగం, మార్చి 28: కార్మిక సంఘాలు, కేంద్ర రంగ సంస్థల ఉద్యోగులు పలు డిమాండ్లపై చేపట్టిన సార్వత్రిక సమ్మె తొలిరోజు సోమవారం విజయవంతమైంది. టీఆర్ఎస్కేవీ ఆధ్వర్యంలో డిచ్పల్లి తహసీల్ ఎదుట అంగన్వాడీ టీచర్లు నిరసన తెలిపారు. తమ వేతనాలను రూ.25వేలకు పెంచడంతోపాటు పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సురెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. టీఆర్ఎస్కేవీ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి ఆధ్వర్యంలో మార్కెట్‌యార్డు, బస్టాండ్ వద్ద నిరసనలు తెలిపారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను నిరసిస్తూ ధర్పల్లి మండల కేంద్రంలో పోస్టల్ సిబ్బంది నిరసన తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న లేబర్ చట్టాలను నిరసిస్తూ బోధన్ పట్టణంలోని కేంద్ర రంగ సంస్థల ఉద్యోగులు, కార్మికులు విధులను బహిష్కరించి నిరసన ప్రదర్శనలు చేశారు. పోస్టాఫీస్ ఉద్యోగులు సమ్మెకు దిగడంతో తపాలా సేవలు స్తంభించిపోయాయి. సబ్ పోస్టాఫీస్ వద్ద వివిధ యూనియన్ల ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేశారు. ఎస్బీఐ మినహా అన్ని జాతీయ బ్యాంకుల ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడంతో ఆయా శాఖలు మూతపడ్డాయి. నిరసనల్లో సబ్ పోస్ట్‌మాస్టర్ ప్రకాశ్‌జాదవ్, యూనియన్ల ప్రతినిధులు లాలయ్య, యోగేశ్వర్, అత్తార్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
నందిపేట్, నవీపేట తహసీల్ కార్యాలయాల ఎదుట బీఎల్టీయూ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. కార్మిక వ్యతిరేక చట్టాలను కేంద్ర ప్రభుత్వ వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు.
జెన్కో ఉద్యోగుల ధర్నా
కేంద్ర కార్మిక సంఘాలు ఐక్యవేదిక పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మండలంలోని పోచంపాడ్ జెన్కో పవర్‌హౌజ్ ఇంజినీర్లు, ఉద్యోగులు, కార్మికులు నిరసన తెలిపారు. భోజనవిరామ సమయంలో పవర్‌హౌజ్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈఈ శ్రీనివాస్, ఏడీ వేణుగోపాల్, ఏడీఈ సతీశ్‌కుమార్, ఏఈ భరత్‌కుమార్, 1104 యూనియన్ రాష్ట్ర అదనపు కార్యదర్శి ఎండీ రఫీక్, టీఆర్వీకేఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏవీ శ్రీనివాస్ రావు పాల్గొన్నారు. సమ్మెను రెండోరోజైన మంగళవారం కూడా విజయంతం చేయాలని ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ముత్తెన్న కోరారు. ఆర్మూర్ జంబి హనుమాన్ గ్రౌండ్లో నిరసన ప్రదర్శనలు చేపడతామని చెప్పారు.