నవీపేట, నవంబర్ 27: మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో మూడు రోజులపాటు నిర్వహించిన రాష్ట్ర స్థాయి 5వ సబ్ జూనియర్ నెట్‌బాల్ టోర్నమెంట్ ఆదివారం ముగిసింది. ఈ కార్యక్రమానికి స్టేట్ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఆకుల లలిత హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ చూపాలని సూచించారు. ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులే పట్టుదలతో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా వస్తున్నారని అన్నారు. మహిళలు సైతం పురుషులతో సమానంగా రాణిస్తున్నారని అన్నారు. టోర్నీ విజయవంతం కావడానికి కృషి చేసిన నిర్వాహకుడు రవిని ముఖ్యఅతిథులు అభినందించారు.
విజేతలుగా మహబూబ్‌నగర్, ఖమ్మం రన్నర్‌గా నిజామాబాద్
టోర్నీలో రాష్ట్రంలోని 16 జిల్లాలకు చెందిన 30 జట్లు (బాలుర విభాగంలో -16, బాలికల విభాగంలో -14)పాల్గొన్నాయి. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బాలుర విభాగంలో నిజామాబాద్ జట్టుపై మహబూబ్‌నగర్ జట్టు విజయం సాధించగా నిజామాబాద్ రన్నర్‌గా నిలిచింది. బాలికల విభాగంలో ఫైనల్లో ఖమ్మం-మహబూబ్‌నగర్ జట్లు హోరాహోరీగా తలపడగా ఖమ్మం విజేతగా నిలిచింది.రన్నర్‌గా మహబూబ్‌నగర్ నిలిచింది. బాలుర విభాగంలో ఖమ్మం జట్టు తృతీయ స్థానంలో నిలిచింది. జాయింట్ విన్నర్‌గా భద్రాద్రి కొత్తగూడెం జట్టు విజయం సాధించింది. బాలికల విభాగంలో నిజామాబాద్ జట్టు తృతీయ స్థానంలో నిలువగా జాయింట్ విన్నర్‌గా మేడ్చల్ విజయం సాధించింది. కార్యక్రమంలో నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్, పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు, జిల్లా అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, ఒలింపిక్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్స య్య, బాలుర పాఠశాల హెచ్ఎం సురేఖ, ఎస్సై రాజారెడ్డి, ఎంఈవో గణేశ్‌రావు, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు హన్మారెడ్డి, బాలుర పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ రవి, వివిధ జిల్లాలకు చెందిన పీఈటీలు, కోచ్‌లు పాల్గొన్నారు.