భీమ్‌గల్, నవంబర్ 21 : స్వయం ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగుపర్చేందుకు వీలుగా ప్రతిష్టాత్మక నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(న్యాక్) ద్వారా అందిస్తున్న శిక్షణ కార్యక్రమాలను యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సూచించారు. మార్కెట్లో మంచి డిమాండ్ కలిగి ఉన్న వివిధ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇప్పించి సర్టిఫికెట్లను అందజేయనున్నట్లు తెలిపారు. భీమ్‌గల్ పట్టణంలోని సహస్ర ఫంక్షన హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో న్యాక్ ద్వారా శిక్షణ పొందిన 133 మంది మహిళలకు మంత్రి ఉచితంగా కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. వివిధ వృత్తి నైపుణ్య కోర్సుల్లో శిక్షణ పొందిన 700 మంది ట్రైనీ విద్యార్థులకు సర్టిఫికెట్లు, టూల్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు శిక్షణనిప్పించే అవకాశం దక్కడాన్ని తానెంతో గర్వంగా భావిస్తున్నానన్నారు. 2020-21 నుంచి ఇప్పటివరకు ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్, పెయింటర్, మేసన్ (మేస్త్రీ) కుట్టుమిషన్ తదితర కోర్సుల్లో సుమారు 700 మంది విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నారని తెలిపారు.
వీరిలో గల్ఫ్ దేశాలకు వెళ్లి ఏజెంట్ల చేతిలో మోసపోయి స్వస్థలాలకు తిరిగి వచ్చిన బాధితులు 150 మంది సర్టిఫికెట్లకు దేశీయంగా ఉన్న ప్రముఖ కంపెనీలతో పాటు గల్ఫ్ దేశాల్లోనూ మంచి గుర్తింపు ఉన్నందున ఉద్యోగావకాశాలు పొందేందుకు మార్గం సుగమమవుతుందని పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యతతో కూడిన సేవలందిస్తే తాము నేర్చుకున్న రంగాల్లో చక్కటి ఉపాధి పొందవచ్చని పేర్కొన్నారు. న్యాక్ డైరెక్టర్ రాజారెడ్డి, ఆర్డీవో శ్రీనివాసులు, డీసీసీబీ వైస్‌చైర్మన్ రమేశ్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలత, ఎంపీపీ ఆర్మూర్ మహేశ్, జడ్పీటీసీ రవి, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మొయీస్, కార్మిక శాఖ అధికారి యోహాన్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేశ్, న్యాక్ జిల్లా అధికారి ప్రభాకర్, టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ మండల అధ్యక్షుడు నర్సయ్య, పట్టణ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్, మున్సిపల్ వైస్‌చైర్మన్ భగత్, కౌన్సిలర్లు మూత లత, నర్సయ్య, సతీశ్ లింగయ్య, ఖైరున్నీసా బేగం, షమీమ్ బేగమ్, తుమ్మ భూదేవి, మల్లెల అనుపమా ప్రసాద్, సీహెచ్.గంగాధర్, కో-ఆప్షన్ సభ్యులు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, న్యాక్ సిబ్బంది దిలీప్ పాల్గొన్నారు.
కష్టపడితే పోలీసు కొలువు సాధ్యమే..
కష్టపడితే పోలీసు కొలువు సాధ్యమేనని రాష్ట్ర రోడ్లు-భవనాలు, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నిర్వహించిన ప్రిలిమ్స్‌కు బాల్కొండ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తన సొంత ఖర్చులతో కోచించ్ సెంటర్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థుల కోసం ఫిజికల్ ఈవెంట్స్ శిక్షణ శిబిరాన్ని వేల్పూర్‌లో ఏర్పాటుచేయగా.. మంత్రి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి వేముల మాట్లాడుతూ. 400 మందికి శిక్షణ ఇప్పించగా 168 మంది పోలీస్ ఉద్యోగాల కోసం ప్రిలిమ్స్‌లో అర్హత సాధించారన్నారు.
వారందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఫిజికల్ ఈవెంట్స్‌లోనూ సత్తా చాటి పోలీసు కొలువును సాధించాలని ఆకాంక్షించారు. కష్టపడితే అనుకున్న లక్ష్యాన్ని సునాయాసంగా సాధించగలరని అన్నారు. వేల్పూర్, మోర్తాడ్, భీమ్‌గల్, బాల్కొండ, కమ్మర్పల్లి కేంద్రాల్లో ముందస్తు శిక్షణ అందించేలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. పోలీసు అధికారులు, పీఈటీలు శిక్షణ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారని తెలిపారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్,రూరల్ సీఐ గోవర్ధన్ రెడ్డి,ఆర్మూర్ ఆర్డీవో శ్రీనివాసులు, డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్‌రెడ్డి, జడ్పీటీసీ అల్లకొండ భారతి, ఎంపీపీ భీమ జమున, సర్పంచ్ తీగల రాధ,ఆర్టీఏ సభ్యుడు రేగుల్ల రాములు తదితరులు పాల్గొన్నారు.