బీర్కూర్, నవంబర్ 21: బీర్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖాన క్లోజింగ్ సమయం కన్నా ముందే వైద్యులు, నర్సులు, సూపర్ వైజర్, ఇతర సిబ్బంది వెళ్లిపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల హాజరుపట్టికను పరిశీలించారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ రావు, కామారెడ్డి జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్‌తో ఫోన్లో మాట్లాడారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, సమయపాలన పాటించని సిబ్బంది పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం బీసీ వెల్ఫేర్ హాస్టల్‌ను సభాపతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలో సౌకర్యాలను పరిశీలించి,భోజన వసతిపై విద్యార్థులతో మాట్లాడారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారని వారు చెప్పడంతో సంతృప్తిని వ్యక్తం చేశారు.
చర్యలు తీసుకుంటాం: డీఎంహెచ్‌వో
సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు డీఎంహెచ్‌వో లక్ష్మణ్‌సింగ్ కామారెడ్డి నుంచి హుటాహుటిన బీర్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నారు. దవాఖానలోని రిజిస్టర్లను పరిశీలించారు.విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.