నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటో షో గ్రాండ్ సక్సెస్ అయ్యింది. రెండు రోజుల పాటు నిజామాబాద్ పాత కలెక్టరేట్ మైదానంలో నిర్వహించిన ప్రదర్శన ఆదివారం ముగిసింది. వివిధ కంపెనీలకు చెందిన వాహనాలు ఒకే వేదిక మీదకు రావడంతో విశేష స్పందన లభించింది. షో ముగింపు కార్యక్రమానికి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆటోషోలో వాహనాలను కొనుగోలు చేసిన వారికి, సందర్శకులకు లక్కీ డ్రా ద్వారా ఆకర్షణీయమైన బహుమతులను అందించారు. ప్రాంగణంలో బుల్లెట్ నడిపి సందడి చేశారు. పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, నిజామాబాద్ అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తదితరులు ఆటోషోను తిలకించారు.
-నిజామాబాద్ (నమస్తే తెలంగాణప్రతినిధి) /ఖలీల్‌వాడి, నవంబర్ 20
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్తంగా నిర్వహించిన ఆటో షో రెండు రోజులపాటు జోరుగా హుషారుగా సాగింది. శనివారం వైభవంగా ప్రారంభమైన కార్యక్రమం ఆదివారం సంబురంగా ముగిసింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలతోపాటు అనేక చోట్ల నుంచి ప్రజలు భారీగా సందర్శనకు వచ్చి వాహనాలను తిలకించారు.
వాహనాలను కొనుగోలు చేద్దామనుకున్న వారంతా నమస్తే తెలంగాణ ఏర్పాటు చేసిన వేదికను చక్కగా వినియోగించుకున్నారు. చివరి రోజు ఆటో షోలో భారీగా బుకింగ్‌లతోపాటు వాహనాల విక్రయాలు సైతం జరిగాయి. ఆటో షో ప్రాంగణం వద్దే వాహనాలను కొనుగోలు చేసి ఆనందంగా తీసుకెళ్లారు. రెండు రోజుల ఆటోషోలో వాహనాలను కొనుగోలు చేసిన వారికి, సందర్శకులకు వేర్వేరుగా లక్కీ డ్రా నిర్వహించి ఆకర్షణీయమైన బహుమతులను అందజేశారు.
ఆటో షోలో టెక్నాలజీతో కూడిన వాహనాలు ప్రజలను కట్టిపడేశాయి. ఎంజీ కంపెనీకి చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్తో కూడిన వాహనం అందరినీ ఆకర్షించింది. చాలా మంది ఈ వాహనం బుకింగ్ కోసం ఇష్టపడ్డారు. చైనా దేశంలో ఉత్పత్తైన బీవైడీ కారు ఆశ్చర్యపరిచింది. పూర్తి ఎలక్ట్రిక్ వాహనమైన దీని ధర రూ.32లక్షలు కాగా ఈ కారును స్టార్ట్ చేస్తే చిన్నపాటి శబ్ధం కూడా రాకపోవడం విశేషం. బీవైడీ వాహనంతో చాలా మంది సెల్ఫీలు సైతం తీసుకున్నారు. ఒక రకమైన రోబో టెక్నాలజీ మాదిరిగా బీవైడీ కారు దర్శనమిచ్చింది.
కియాలోని లెటెస్ట్ వర్షన్‌తోపాటు నెక్సాలో గ్రాండ్ విటారాలోని ఫీచర్స్ ఆలోచింపజేశాయి. విటారా కారులో పెట్రోల్, బ్యాటరీతో కూడిన సౌకర్యం ఉండడం చాలా మందిని ఆకట్టుకున్నది. మహీంద్రా నుంచి వెలువడిన థార్ వాహనం సంచలనంగా నిలిచింది. ఆటోషోలో ఠీవీగా దర్శనమిస్తూ చిన్న పిల్లల దగ్గరి నుంచి వృద్ధుల వరకు అందరి మెప్పును అందుకున్నది. స్కొడా ప్రీమియం వాహనాలను చివరి రోజైన ఆదివారం చాలా మంది టెస్టు డ్రైవ్ చేశారు. ఇసుజు కంపెనీకి చెందిన ఎస్ – క్యాబ్ కమర్షియల్ వాహనాన్ని ఆయావర్గాల వారు తిలకించారు.
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే నిర్వహించిన ఆటో షో కార్యక్రమానికి ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్, టీఆర్ఎస్(బీఆర్ఎస్) జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి హాజరయ్యారు. ఆయనతోపాటు ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడు, ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, నగర మేయర్ నీతూ కిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. స్టాళ్లను నిశితంగా పరిశీలించిన జీవన్ రెడ్డి పలు వాహనాలను నడిపారు. బాజిరెడ్డి జగన్‌ను వెంటేసుకుని రాయల్ ఎన్ఫీల్డ్ వాహనంతో ఆటో షో ప్రాంగణంలో సరదాగా చక్కర్లు కొట్టారు.
అనంతరం వోక్స్ వాగన్, మారుతి సుజుకీ, స్కొడా తదితర వాహనాలను పరిశీలించారు. మహీంద్రా థార్ వాహనాన్ని చూసి ముగ్ధులై కొద్దిదూరం నడిపించారు. నమస్తే తెలంగాణ దినపత్రిక వినూత్న ఆలోచనతో ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంపై జీవన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. నిజామాబాద్ అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ దంపతులు పిల్లలతో కలిసి ఆటోషోను సందర్శించారు. గంటసేపు వాహనాలను పరిశీలించారు. వివిధ మోడల్స్‌ను పరిశీలించి ఆనందం వ్యక్తంచేశారు. హైదరాబాద్‌కే పరిమితమైన బ్రాండెడ్ వాహనాలను నగరానికి తెప్పించడం మంచి ఆలోచన అంటూ నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ప్రయత్నాన్ని అదనపు కలెక్టర్ మెచ్చుకున్నారు.
ఆటో షోను ఆదివారం పలువురు ప్రముఖులు సందర్శించారు. స్టాళ్ల వద్దకు వెళ్లి వాహన ఫీచర్స్‌ను తెలుసుకొని, పలుచోట్ల టెస్ట్ డ్రైవ్ చేశారు. జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, నగర మేయర్ దండు నీతూకిరణ్, తెలంగాణ యూనివర్సిటీ పాలక మండలి సభ్యుడు మారయ్యగౌడ్, జిల్లా ప్రముఖ నేతలు ఆటో షోను పరిశీలించారు.
కాలుష్యరహిత వాహనాల రాకతో వాహనదారుల చూపు ఇప్పుడు వీటివైపే మళ్లుతున్నది. ఆటో షోలో ఎలక్ట్రిక్ బైకులు, కార్లకు ప్రజల నుంచి ఆదరణ లభించింది. బైకులను నడిపేందుకు యువతులు, మహిళలు పెద్ద ఎత్తున ఇష్టపడ్డారు. బిగాస్ కంపెనీ ద్వారా వచ్చిన ఎలక్ట్రిక్ వాహనాలకు ఉచితంగా రైడ్ ఉండడంతో చాలా మంది టెస్టు డ్రైవ్ చేశారు. కార్లలోనూ ఎలక్ట్రిక్ వాహనాలు ఉండడంతో వాటి ఫీచర్స్ తెలుసుకునేందుకు ఇష్టపడ్డారు. చివరి రోజు ముగింపు సందర్భంగా ప్రజలు భారీగా రావడంతోపాటు పలు వాహనాలకు బుకింగ్‌లు సైతం ఆశాజనకంగా జరిగాయి. డెలివరీలు సైతం ఆటో షో ప్రాంగణంలోనే చకచకా జరిగిపోయాయి. కొద్ది మంది ఫైనాన్స్ సౌకర్యాన్ని కోరుకోవడంతో అక్కడే ఉన్న బ్యాంకర్లు సైతం వెనువెంటనే మంజూరు పత్రాలను సిద్ధం చేసి అందించారు. ఆటో షోలో 22స్టాల్స్ ఏర్పాటు చేయగా ఇందులో 12 వివిధ రకాల కార్ల ఉత్పత్తిదారులు, 6 ద్విచక్ర వాహనాలు, 4 బ్యాంకర్లకు సంబంధించినవి ఉన్నాయి. ద్విచక్ర వాహనాల్లో 2 స్టాల్స్ ప్రత్యేకంగా బ్యాటరీ వాహనాలే ఉండడం విశేషం. బిగాస్ నుంచి నాలుగు రకాల బ్యాటరీ వెహికిల్స్ ట్రయల్ రన్ చేసేందుకు జనాలు ఉత్సాహం చూపించారు. హీరో బ్యాటరీ వెహికిల్స్ సైతం అదే స్థాయిలో డిమాండ్ పలికాయి.
కరోనా అనంతరం ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న ఆటోమొబైల్ రంగానికి ఆటో షో ఊతం ఇచ్చినట్లుగా మారింది. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఏర్పాటు చేసిన ఆటో షోతో ప్రజల్లో కొత్త వాహనాలపై కాసింత ఆసక్తిని పెంచినట్లు చేసింది. కొనుగోలు చేయాలనే ఆలోచన పెరగడంతో ఆటోమొబైల్ అమ్మకందారుల్లోనూ ఉత్సాహం పెరిగింది. ప్రజల్లో కొత్త వాహనాలపై ఆసక్తి పెంచడంతోపాటు బుకింగ్‌లు, కొనుగోళ్ల ద్వారా ఆటో షో విజయవంతం కావడంపై స్టాళ్ల నిర్వాహకులు ఆనందం వ్యక్తంచేశారు. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే చూపిన చొరవను నగరవాసులతోపాటు స్టాళ్ల నిర్వాహకులు సైతం అభినందించారు.
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే నిర్వహించిన ఆటో షో చాలా బాగున్నది. అన్ని రకాల కార్లను ఒకే వేదికపైకి తీసుకురావడం మంచి ఆలోచన. కారు కొనుగోలు చేసేందుకు వచ్చాం. ఎలక్ట్రిక్ స్కూటీ నడిపాను. చాలా బాగున్నది.
-అమరావతి, నిజామాబాద్
నచ్చిన వాహనం కొనుగోలు చేసేందుకు చక్కని వేదికను ఏర్పాటు చేశారు. సమయం వృథా కాకుండా అన్ని వాహనాలు ఒకే దగ్గర ఉన్నాయి. కొనుగోలు చేయడానికి ఇదొక సువర్ణావకాశం.
– రామ్‌గోపాల్, శ్వేత, నిజామాబాద్
ఆటో షోలో ప్రదర్శించిన అన్ని రకాల బైక్‌లను టెస్ట్ డ్రైవ్ చేశాను. చాలా బాగున్నాయి. ఒకే దగ్గర అన్ని రకాల మోడల్స్‌ను టెస్ట్ డ్రైవ్ చేసి, నచ్చింది కొనుగోలు చేసే అవకాశం కల్పించడం మంచి ఆలోచన.
– సుమిత్, నిజామాబాద్