నిజామాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యవహార శైలిపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. నోరు అదుపులో పెట్టుకోలేని వ్యక్తి ప్రజలకు ఎలా సేవ చేస్తాడంటూ? అంతటా ప్రశ్నల వర్షం కురుస్తోంది. ప్రజలకు సేవ చేయడాన్ని పక్కన పెట్టి నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలవడమే పార్లమెంట్ సభ్యుడి పని అన్నట్లుగా మారిందంటూ అర్వింద్ తీరును చాలా మంది తూర్పార పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక మహిళా నాయకులపై ఇష్టానుసారంగా నోరు పారేసుకోవడం, ఏకంగా సీఎంపై నోటికొచ్చినట్లు మాట్లాడడం ద్వారా మీడియాలో కనిపించేందుకే నిజామాబాద్ ఎంపీ ప్రాధాన్యతను ఇస్తున్నాడంటూ ఆరోపిస్తున్నారు. మూడున్నరేండ్లుగా సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరిస్తున్న అర్వింద్ తీరును గమనించిన ఎమ్మెల్సీ కవిత శుక్రవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అర్వింద్ పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలా మారిందంటూ సోషల్ మీడియాలో సెటైర్లు చక్కర్లు కొడుతున్నాయి. నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతా… అంటూ కవిత చేసిన కామెంట్లు అర్వింద్‌కు బుద్ధి చెప్పేలా ఉన్నాయంటూ సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
ఉమ్మడి జిల్లాలో కొనసాగిన ఆందోళనలు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతోపాటు కవితకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ఎంపీ అర్వింద్, బీజేపీ తీరును నిరసిస్తూ చాలా చోట్ల దిష్టిబొమ్మ దహనాలు కొనసాగుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన ఎంపీ .. బాధ్యతను మరిచి ప్రవరిస్తుండడంతో తగిన రీతిలో బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయంటూ టీఆర్ఎస్ నాయకులు పేర్కొంటున్నారు. పలుచోట్ల సమావేశాలు ఏర్పాటు చేసి మరీ అర్వింద్ తీరును ఖండిస్తున్నారు. బేషరతుగా కవితకు క్షమాపణలు చెప్పడంతో పాటు పసుపు రైతులను మోసం చేసినందుకు తక్షణం తన పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. కవిత చెప్పిన అంశాలపైనా బీజేపీలో చర్చ మొదలైంది. ఫేక్ చదువులతో భారత ఎన్నికల సంఘాన్ని చీట్ చేసిన అర్వింద్ బాగోతంపై నిగ్గు తేలాల్సిన అవసరం ఉందంటూ కాషాయ పార్టీలోనే చర్చ జరుగుతోంది. మరోవైపు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్న అర్వింద్‌ను సంఘ బహిష్కరణ చేయాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. నేటి తరం యువ రాజకీయ నాయకులకు అర్వింద్ వంటి నాయకులతో పెను ప్రమాదం పొంచి ఉందంటూ రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.
మునుగోడు ఓటమితో మైండ్ బ్లాక్
వాస్తవానికి ఎంపీ అర్వింద్‌పై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత నెలకొన్నది. నిజామాబాద్‌లో తనను ఎంపీగా గెలిపిస్తే ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానంటూ హామీలు ఇచ్చారు. ఒకడుగు ముందుకేసి బాండ్ పేపర్ సైతం రాసిచ్చారు. పసుపు, ఎర్రజొన్న పంటలకు కనీస మద్దతు ధరను తీసుకువస్తానని చెప్పి మూడున్నరేండ్లు దాటుతున్నా అర్వింద్ తన హామీలను నెరవేర్చలేదు. దీంతో నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో రైతుల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. ఎక్కడికి వెళ్లినా నిలదీతలు ఎదురవుతుండడంతో సమాధానం చెప్పలేక .. టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్, ఆయన కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మునుగోడులో బీజేపీ పన్నిన అన్ని రకాల కుయుక్తులను భంగపరిచి టీఆర్ఎస్ భారీ మెజార్టీతో విజయం సాధించింది. ఈ పరాజయాన్ని జీర్ణించుకోలేని బీజేపీ నేతలు ప్రజల మూడ్‌ను డైవర్ట్ చేసేందుకు విధ్వంసాలకు తెర లేపినట్లుగా తెలుస్తోందని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. త్వరలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉప ఎన్నికను కృత్రిమంగా తెచ్చి సర్వ శక్తులూ ఒడ్డి టీఆర్ఎస్ను ఓడించగలిగితే రాష్ట్ర మంతటా తమకు అనుకూల వాతావరణం ఏర్పడగలదన్నది బీజేపీ మహా ఎత్తుగడ బోల్తా కొట్టింది. దీంతో రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులను సృష్టించి రాజకీయ పబ్బం గడిపేలా నీచమైన కుట్రలకు కాషాయ పార్టీ సిద్ధమైంది.