గాంధారి, నవంబర్ 13 : మండలంలోని పొతంగల్ కలాన్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం ఆకట్టుకుంటున్నది. గ్రామ శివారులో ఉన్న బుగ్గరామన్న ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం రకరకాల పూలు, పండ్లు, నీడనిచ్చే మొక్కలతో పట్టణాలలో ఉండే పార్కులకు దీటుగా తీర్చిదిద్దారు. పార్కుకు వచ్చే ప్రజలకు ప్రశాంత వాతావరణంతో పాటు మానసికోల్లాసాన్ని ఇస్తున్న ప్రకృతి వనం ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుంది.
సందర్శకులతో కిటకిట..
పల్లె ప్రకృతి వనం ప్రతిరోజు సందర్శకులతో కిటకిటలాడుతున్నది. అందమైన మొక్కలతో తీర్చిద్దిడంతో గ్రామస్తులతో పాటు, మండలంలోని ఇతర గ్రామాల వారు సైతం పార్కుకు వస్తున్నారు. పార్కులో ఎటుచూసినా పచ్చని చెట్లు, పండ్లు, అందమైన పూల మొక్కలు ఉండడంతో ఇక్కడ సేద తీరడానికి ఆసక్తి చూపుతున్నారు. పార్కులో వాకింగ్ ట్రాక్, సిమెంట్ బెంచీలు, పిల్లలు ఆడుకోవడానికి ఆటవస్తువులు ఏర్పాటు చేశారు.
బుగ్గరామన్న ఆలయానికి వచ్చే భక్తులతోపాటు బాన్సువాడ, కామారెడ్డి రహదారికి పక్కనే పార్కు ఉండడంతో చాలా మంది పార్కులో సేద తీరడానికి వస్తున్నారు. ఫొటో షూట్ కోసం సైతం పలువురు ఈ పార్కుకు వస్తున్నారు. పార్కులోని మొక్కలకు నిత్యం నీరు పట్టడంతో పాటు, మొక్కల మధ్య గడ్డి, పిచ్చిమొక్కలు పెరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. పార్కులో ఎక్కడపడితే అక్కడ చెత్త్తాచెదారాన్ని వేయకుండా చెత్తకుండీలను ఏర్పాటు చేశారు.
మరింత అభివృద్ధి చేస్తాం
గ్రామస్తులతో పాటు, బుగ్గరామన్న ఆలయానికి వచ్చే వారికి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం కోసం పార్కును మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నాం. పార్కులో మొక్కలు ఎండి పోకుండా నిత్యం పర్యవేక్షిస్తున్నాం. పార్కుకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తాగునీటి వసతితో పాటు, త్వరలో టాయిలెట్లను సైతం ఏర్పాటు చేస్తాం.
-వడ్ల బాలరాజు, పొతంగల్ కలాన్ సర్పంచ్
ఇతర గ్రామాలకు ఆదర్శం..
పొతంగల్ కలాన్ గ్రామ శివారులో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతీ వనం ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. పార్కుకు వచ్చే ప్రజలకు ఆహ్లాదకరమైన , వాతావరణంతో పాటు, ఆకర్షణీయం గా తీర్చిదిద్దారు. మండలంలోని ఇతర గ్రామాల ప్రకృతి వనాలను సైతం ప్రజలను ఆకట్టుకునేలా వసతులను కల్పించడానికి చర్యలు తీసుకుంటాం.
-రాజ్కిరణ్రెడ్డి, గాంధారి ఎంపీవో