గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులు
నిజాంసాగర్, నవంబర్ 13: ఆ గ్రామానికి వెళ్లాలంటే ప్రధాన రహదారి నుంచి కిలో మీటరు దూరం నడుచుకుంటూ వెళ్లాలి. వర్షాకాలంలో గ్రామంలో ఎటూ చూసినా బురద రోడ్డే దర్శనమిచ్చేది. బిందెడు నీటి కోసం ప్రభుత్వ కుళాయి వద్ద గంటసేపు నిరీక్షించాల్సిందే. చీకటి పడిందంటే వీధి దీపాలు లేక చీకట్లు కమ్ముకునేవి. ఎటు చూసినా పాడుబడ్డ బావులు, శిథిలావస్థకు చేరుకున్న పెంకుటిల్లు, రహదారులపై మురికి నీరు ప్రవహిస్తూ ఎక్కడ పడితే అక్కడ చెత్తచెదారం పారవేయడం, ఎవరైనా మృతి చెందితే అంత్యక్రియల కోసం రెండు కిలో మీటర్లు మృతదేహాన్ని మోసుకుపోవడం ఇదంతా ఒకప్పటి మాట..
నేడు ఆ గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది అదే మండలంలోని మాగి గ్రామం. గ్రామంలో సుమారు 1550 మంది జనాభా నివసిస్తున్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం ప్రవేశపెట్టకముందు సమస్యలతో సతమతమైన గ్రామంలో నేడు అన్ని వసతులతో అభివృద్ధికి మారుపేరుగా నిలుస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పుష్కలంగా నిధులు కేటాయించడంతో నేడు అన్ని రంగాల్లో గ్రామాలు అగ్రగామిగా నిలుస్తున్నాయి. గ్రామంలో తాగునీటి ఇబ్బందులు తీర్చేందుకు మిషన్ భగీరథ నీటిని ప్రతి ఇంటికీ సరఫరా చేస్తున్నారు. గ్రామంలో రెండు ట్యాంకులను నిర్మించి నీటిని అందజేస్తుండడంతో నేడు నీటి సమస్య లేకుండా పోయింది. మూడున్నర సంవత్సరాల నుంచి సుమారు రూ.10 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, మురికి కాలువలు నిర్మించడంతో ప్రతి కాలనీలో సీసీ రోడ్డు ఏర్పాటు అయింది. ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతోనే ఈ అభివృద్ధి సాధ్యమైంది.
అన్ని వసతులతో ముందుకు
గ్రామంలో ఎలాంటి సమస్య లేకుండా అన్ని వసతులతో ముందుకు సాగుతున్నాం. తాగునీటి వసతి, పారిశుద్ధ్యంపై ప్రత్యేక చొరవ చూపించడంతో నేడు గ్రామం ఎంతో శుభ్రంగా కనిపిస్తుంది. ప్రభుత్వం గ్రామాభివృద్ధి కోసం ప్రత్యేక చొరవ చూపడంతో నేడు మా గ్రామం అన్ని రంగాల్లో అబివృద్ధి చెందింది.
-లక్ష్మణ్, పంచాయతీ కార్యదర్శి, మాగి
పల్లె ప్రగతితో మారిన రూపురేఖలు
ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టడంతో గ్రామం రూపురేఖలు పూర్తిగా మారి పోయాయి. గ్రామంలో ఎలాంటి సమస్య లేకుండా ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్, ఎంపీపీతో పా టు అధికారుల సహకారంతో అన్ని పనులను విడుతల వారీగా కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నా. కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామాల దశ మారింది.
-కమ్మరికత్త అంజయ్య, సర్పంచ్ మాగి