ఖలీల్‌వాడి, నవంబర్ 12 : దళిత సమాజ సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. దళిత కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా దళిత సంఘాల ఆధ్వర్యంలో దళితరత్న, జె.నారాయణ సంస్మరణ సభను జిల్లాకేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి వేముల హాజరై నారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఆయన చేసిన సేవలను కొనియాడుతూ నారాయణతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. దళిత సమాజం, తెలంగాణ ఉద్యమంపై నిబద్ధత కలిగిన అంబేద్కర్ వాది నారాయణ అని, అందుకే ఆయనను తన సొంత నియోజకవర్గమైన బాల్కొండలో జూనియర్ అంబేద్కర్ అని గౌరవంగా పిలుచుకునే వారమని గుర్తుచేశారు. దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ఓట్ల కోసమో, రాజకీయ ప్రయోజనాలను ఆశించో తెచ్చిన పథకం కాదని చెప్పారు.
ప్రస్తుతం ఒక్కో సెగ్మెంట్లో 1500 దళిత కుటుంబాలకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూర్చనున్నామని తెలిపారు. దళిత విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలని, ఎన్నో పాఠశాలలు, కళాశాలలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, ఎమ్మెల్సీ రాజేశ్వర్, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, అంబేద్కర్ సంఘం రాష్ట్ర నాయకుడు జేబీ రాజు, జడ్పీ మాజీ చైర్మన్ గంట సదానంద్, దళిత సంఘాల ప్రతినిధులు గైని గంగారాం, బంగారు సాయిలు, శ్రీహరి, నిమ్మ నారాయణ, మూల నివాస్, నాంపల్లి హరినాయక్, న్యూడెమోక్రసీ నాయకుడు వి.ప్రభాకర్, దేవరాం, నారాయణ కుటుంబ సభ్యులు సుగుణమ్మ, లింగయ్య, రచన, రష్మిత పాల్గొన్నారు.