ఉరుకుల పరుగుల జీవితం.. కాలంతో పోటీ పడుతూ సాగే జీవనం.. ఆధునిక యుగంలో జనాల నడత మారుతున్నది. నడకకు ప్రాధాన్యం పెరుగుతున్నది. తెలవారక ముందే రోడ్లు, మైదానాలు సందడిగా మారుతున్నాయి. పల్లె, పట్నమనే తేడా లేకుండా వా‘కింగ్’లతో దర్శనమిస్తున్నాయి. ఎముకలు కొరికే చలిలోనూ, కమ్ముకున్న పొగ మంచులోనూ నడుస్తున్నారు. ఆరోగ్యం కోసం, అలసట నుంచి విముక్తి కోసం శ్రమిస్తూనే ఉన్నారు. శారీరక శ్రమ లేకపోవడం, ఆహారపు ఆలవాట్లలో మార్పుల వల్ల శరీరం రోగాల పుట్టగా మారుతున్నది. ఊబకాయంతో పాటు షుగర్, బీపీ వంటి సమస్యలతో బాధ పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. ఇలాంటి తరుణంలో ప్రజల్లో మార్పు కనిపిస్తున్నది. ఉదయమే లేస్తున్నారు.. నడుస్తున్నారు.. జాలువారుతున్న పొగ మంచులో ఆరోగ్యంతో పాటు ఆహ్లాదాన్ని వెతుక్కుంటున్నారు. లేవండి.. మనం కూడా నడుద్దాం పదండి!!
ఖలీల్‌వాడి, నవంబర్ 12 : ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో వ్యాయామం తప్పనిసరి అన్నట్లుగా మారింది పరిస్థితి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండేందుకు చాలా కష్టపడాల్సి వస్తున్నది. పర్యావరణం, ఆహారం, జీవనశైలిలో మార్పులు మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. చిన్న వయసులోనే రోగాలబారినపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యంగా ఉండాలన్నా… ఆయుష్షు పెరగాలన్నా నడవడమే మేలని చెబుతున్నారు నిపుణులు. నడకతో అనేక ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. నడక ఆరోగ్యానికి ఎంతో మంచిదని, ఆయుష్షుని కూడా పెంచుతుందని వివరిస్తున్నారు. ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే నడకతోపాటు తేలికపాటి వ్యాయామం అవసరం. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంచుకోవాలంటే, ఎక్కువ కాలం బతకాలంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. అంటే వ్యాయామంతోపాటు ఆహార, ఆరోగ్య నియమాలు పాటించాలి. సమయాన్ని వృథా చేసే బదులు, ఒక్క అరగంట నడిస్తే చాలు చక్కని ఆరోగ్యం మీ సొంతం అవుతుంది.

బరువు తగ్గాలనుకునేవారు రోజుకు అరగంట పాటు నడవాలి. అలా నడుస్తున్న కొద్దీ రెండు నెలల్లో బరువు అనేది తగ్గడం మొదలవుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే తప్పని సరిగా ఆ నడక వేగంగా ఉండాలి. కొంతమంది ఒక వారం రెండు వారాలు నడిచి ఇంకా బరువు తగ్గడం లేదని నిరాశపడి వాకింగ్ చేయడం మానేస్తుంటారు. అలా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. శరీరంలో పేరుకున్న కొవ్వు కరగాలంటే కొంత సమయం పడుతుంది. ఓపికతో క్రమం తప్పకుండా వాకింగ్ చేస్తుండాలి. తర్వాత మనం అనుకున్న ఫలితం ఉంటుంది.

వాకింగ్ చేసేవారు మలుపుల్లో నడిస్తే ఇంకా మంచిదంటున్నారు నిపుణులు. నడిచేటప్పుడు నేరుగా ఉన్న రోడ్డు మీద కాకుండా వెనక్కి నడిస్తే మరింత ఎక్కువగా కేలరీలు ఖర్చువుతాయట. అలాగే ముందుకు కాకుండా వెనక్కి నడిస్తే మరింత మంచి ఫలితాన్ని పొందవచ్చు. వెనక్కి నడిస్తే మన గుండెకు మరింత మేలు జరుగుతుందని చెబుతున్నారు. అలాగే ఎక్కువ కేలరీలు సైతం ఖర్చవుతాయి. వెనుక నుంచి వాహనాలు రావనే నమ్మకం ఉన్న ప్రదేశాల్లో కొంత సమయం ఇలా నడవొచ్చు.

ప్రతి రోజూ వాకింగ్ చేయడంతో డయాబెటిస్ ఉన్న వారికి మరీ మంచిది. రోజూ క్రమం తప్పకుండా వాకింగ్ చేస్తే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. అలాగే గుండె జబ్బులున్న వారికి ఎంతో మేలు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. వాకింగ్ అనేది ఒక్క బరువు తగ్గడానికే కాకుండా ఎన్నో వ్యాధులను దూరం చేస్తుంది. శరీరం హుషారుగా ఉంటుంది. క్రమం తప్పకుండా వాకింగ్ చేసేవారు చురుగ్గా ఉంటారు.
వాకింగ్ ప్రారంభించగానే గంటలు నడవకుండా శరీరం అలవాటు పడేలా సమయాన్ని పెంచుతూ ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఒకేసారి అరగంట కాకుండా ముందు పావుగంట పాటు నడవాలి. ఆ తర్వాత అరగంట ఆపైన పెంచుతూపోవాలి. మొదట అరగంటలో ఒక మైలు నడిస్తే చాలని సూచిస్తున్నారు. ఆ తర్వాత ఒక మైలు దూరాన్ని పావుగంటలో నడిచేంత వేగం వరకు ప్రయత్నించవచ్చు. వేగం పెంచుతున్న కొద్దీ శరీరంలో శక్తి స్థాయి మెటబాలిజం పెరుగుతుంటుంది. వారం పాటు ప్రతిరోజూ నడవడంతో అత్యధికంగా 1500 కేలరీల వరకు ఖర్చు అవుతుంది. వాకింగ్ అప్పుడే మొదలు పెట్టినవారికి ఇది మంచి ఫలితం ఇస్తుంది. అయితే ఒకసారి వాకింగ్ మొదలు పెట్టాక దాన్ని ఆపకుండా చేస్తుండడం మంచిది. అప్పుడే సరైన ఫలితం కనబడుతుందని నిపుణులు చెబుతున్నారు.
మనం నిదానంగా నడవడంతో 15 నిమిషాల్లో 9 కేలరీలు ఖర్చు అవుతాయి. 30 నిమిషాల్లో 25 కేలరీలు ఖర్చు చేయవచ్చు. కాస్త సాధారణం కన్నా కొంత వేగంతో నడిస్తే 15 నిమిషాల్లో 25 కేలరీలు ఖర్చు అవుతుంది. అలాగే అరగంటలో 50కి పైగా కేలరీలు ఖర్చు అవుతాయి. స్పీడ్ వాకింగ్, జాగింగ్, రన్నింగ్ చేస్తే మనం అనుకున్నంత ఫలితాన్ని పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. కేవలం అరగంటలో 250 కేలరీలు ఖర్చవుతాయి. నడిచే దూరాన్ని బట్టి కూడా కేలరీలు ఖర్చవడం జరుగుతుంది. కొంతమంది ఒక మైలుతో మొదలు పెట్టి రెండు నుంచి నాలుగు మైళ్లవరకు వాకింగ్ చేస్తుంటారు.
ఎక్కువ మంది బరువు త్వరగా తగ్గాలనే ఉద్దేశంతో వాకింగ్ చేస్తుంటారు. వేగంగా నడుస్తుంటారు. అలాంటి వారు ఆహార విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. చాలా కఠినమైన నియమాలు పెట్టుకొని వాకింగ్ చేస్తున్నా.. తిండి ఆపకపోతే వారు అనుకున్న ఫలితాన్ని సాధించలేరు. వాకింగ్ చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు. మరీ ముఖ్యంగా కొంతమంది అవసరం లేకపోయినా అదే పనిగా ఏదో ఒకటి తింటూ ఉంటారు. వీరు ఎక్కువగా జంక్ ఫుడ్‌నే తింటారు. ఇలాంటి వారు ఎంత వాకింగ్ చేసినా బరువు తగ్గడం ఉండదు. ఆహారాన్ని అదుపులో పెట్టుకోకపోతే శ్రమంతా వృథా అవుతుంది. వాకింగ్ చేసినా.. బరువు తగ్గాలనుకున్నా.. ఆహార నియమాలు తప్పకుండా పాటించాలి.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లో నలుదిక్కులా చాలా అభివృద్ధి జరిగింది. నిజామాబాద్‌లోని పాలిటెక్నిక్, జీజీ కళాశాల, కలెక్టరేట్, రాజారాం స్టేడియంతోపాటు బైపాస్ రోడ్, హనుమాన్ జంక్షన్ తదితర ప్రాంతాలు వాకింగ్‌కు అనువుగా ఉన్నాయి. పలు కాలనీల్లో ప్రభుత్వం పార్కులను సైతం నిర్మించి అందులో వ్యాయామ పరికరాలను ఏర్పాటు చేయడంతో వాకర్స్‌కు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. రోజూ ఉదయం పట్టణ ప్రజలు ఈ దారుల్లో నడకను కొనసాగిస్తున్నారు. చిన్నారులు, పెద్దలు, కుటుంబ సమేతంగా వాకింగ్ చేస్తున్నారు. అలాగే పట్టణంలోని బొడ్డెమ్మ చెరువును అభివృద్ధి చేయడంతో వాకింగ్ చేయడానికి అనువుగా మారింది. చెరువు కట్టపై దారిని విశాలంగా చేయడంతో పాటు కట్టకు ఇరువైపులా గ్రిల్స్, లైటింగ్ ఏర్పాటు, చెట్లు పెంచడంతో ఉదయమే వందలాది మంది వాకింగ్ చేస్తున్నారు. సుభాష్‌నగర్, వినాయక్ నగర్‌తోపాటు పలుచోట్ల పార్కులను నిర్మించారు. వాకింగ్ చేసేందుకు అనువుగా ట్రాక్‌లను నిర్మించారు. పచ్చనిచెట్ల ఆహ్లాదకర వాతావరణం మధ్య వాకింగ్ మంచి అనుభూతినిస్తున్నదని వాకర్స్ సంతోషపడుతున్నారు.
ప్రతి రోజూ వాకింగ్ చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు. నడకతో గుండె పనితీరు మెరుగుపడుతుంది. ప్రతి ఒక్కరూ 30 నిమిషాలు వాకింగ్ చేయాలి. నడకతో కండరాలు బలోపేతం అవుతాయి. రక్తంలో చక్కెర స్థాయిని క్రమబద్దీకరిస్తుంది. నడక సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచుతుంది..
– జక్క రవి (ఎండీ, ఫిజీషియన్, నిజామాబాద్)
20 ఏండ్లుగా వాకింగ్ చేస్తున్నాను. చలికాలంలో వాకింగ్ చేయడంతో ఆరోగ్యంగా ఉండగలం. ఉదయం పూట ఐదారు మంది కలిసి రోజు నడుస్తాం. నిజామాబాద్‌లోని పాలిటెక్నిక్ మైదానంలో ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య నడుస్తాం. ఇక్కడ అనుకూలంగా రోడ్డు విశాలంగా ఉండడంతోపాటు పచ్చని చెట్లు ఉన్నాయి. మంచి గాలి వీస్తుంది. నాతో పాటు చాలా మంది ఇక్కడికి వస్తారు. అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే నడకే మంచిది.
– రాజేశ్వర్ (నిజామాబాద్)
వాకింగ్.. ఇది ప్రతి ఒక్కరికీ తప్పనిసరి కాబోతోంది. క్షణం తీరిక లేని సమయం.. అయినప్పటికీ నడక తప్పనిసరి చేస్తేనే సంపూర్ణ ఆరోగ్యం సిద్దిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే గుండె జబ్బులు ఉన్నవారు వాకింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎమర్జెన్సీ ఫోన్ నంబర్లను దగ్గర పెట్టుకోవాలి. వాకింగ్ చేస్తే గుండె కొట్టుకునే వేగం పెరగాలి. చెమట పట్టేటట్లు చేయాలి. ఇలా వాకింగ్ చేస్తే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. నిజామాబాద్‌లోని పాలిటెక్నిక్ మైదానంతోపాటు కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల తదితర ప్రాంతాల్లో రోజూ వందలాది మంది వాకింగ్ చేస్తున్నారు.