శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలసిరులతోపాటు విద్యుత్ వెలుగులు పంచుతున్నది. ఇక్కడి జల విద్యుదుత్పత్తి కేంద్రంలో రికార్డుస్థాయిలో కరెంట్ ఉత్పత్తి అవుతున్నది. ఈ సంవత్సరం భారీగా వరదలు రావడం, మిగులు జలాల విడుదలతో పాటు విద్యుత్ ఉత్పత్తిలోనూ ఉత్తమ గణాంకాలు నమోదవుతున్నాయి. విద్యుత్ సౌధ విధించిన 75 మిలియన్ యూనిట్ల లక్ష్యానికి మించి ఇప్పటికే 25 మిలియన్ యూనిట్లు అధికంగా ఉత్పత్తి అయ్యింది. శనివారం నాటికి 100 మిలియన్ యూనిట్ల మార్క్ చేరడంతో జెన్కో సిబ్బంది సంబురాల్లో మునిగి పోయారు.
మెండోరా, నవంబర్ 12: ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రా జెక్టు జల సిరులతో పాటు విద్యుత్ వెలుగులు పంచుతున్నది. ఇన్‌ఫ్లో, ఔట్ఫ్లోతో పాటు విద్యుత్ ఉత్పత్తిలోనూ ఉత్తమ గణాంకాలను నమోదు చేస్తున్నది. ఈ సంవత్సరం మొదటి నుంచే ఎస్సారెస్పీకి వరదలు పోటెత్తాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో సీజన్ మొదట్లోనే ప్రాజెక్టు నిండుకుండలా మారింది. భారీ వరదల రాకతో స్థానిక జల విద్యుత్ కేంద్రంలో లక్ష్యానికి మించి విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నది. జల విద్యుత్ సౌధ విధించిన 75 మిలియన్ యూనిట్ల లక్ష్యానికి మించి ఇప్పటికే అధికంగా ఉత్పత్తి అయింది. శనివారం నాటికి 100 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసినట్లు జెన్కో వెల్లడించింది.
గోదావరికి ఈ ఏడు భారీ వరదలు పోటెత్తాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో శ్రీరాంసాగర్‌కు లక్షలాది క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరింది. ప్రాజెక్టు చరిత్రలో అత్యధికంగా 1983-84లో 1,006 టీఎంసీలు రాగా, గతేడాది (2021-22)లో 672 టీఎంసీల ఇన్‌ఫ్లో నమోదైంది. ఈ సంవత్సరంలోనూ రికార్డు స్థాయిలో వరద వచ్చింది. ఈ సీజన్లో ఇప్పటివరకూ 588.75 టీఎంసీల వరద వచ్చి చేరింది. సుమారు ఐదు నెలల వరకు ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో కొనసాగడం గమనార్హం. శ్రీరాంసాగర్‌కు సీజన్ మొదట్లోనే ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరదల రాక ప్రారంభమైంది. జూలై మాసంలోనే ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దీంతో వచ్చిన వరదను వచ్చినట్లు గోదావరిలోకి వదిలారు. సీజన్ ఆరంభంలోనే మిగులు జలాలను దిగువకు వదలడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీనికి తోడు ఎస్కేప్ గేట్ల నుంచి నాలుగు నెలల పాటు నిరంతరాయంగా నీటిని విడుదల చేశారు.
విద్యుత్ సౌధ ఏటా శ్రీరాంసాగర్ విద్యుదుత్పత్తి కేంద్రానికి 75 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి లక్ష్యాన్ని విధిస్తుంటుంది. అయితే, ఈ సారి లక్ష్యానికి మించి ఉత్పత్తి జరిగింది. సీజన్ ముగియడానికి చాలా సమయం ఉండడంతో అదనంగా మరో 25 ఎం.యూ. విద్యుదుత్పత్తి జరుగుతుందని జెన్కో అధికారులు అంచనా వేస్తున్నారు. కాకతీయ కాలువకు నీటి విడుదలను శనివారం నుంచి నిలిపి వేశారు. మరోవైపు, ఇన్‌ఫ్లో తగ్గి పోవడంతో ఎస్కేప్ గేట్ల నుంచి కూడా నీటి విడుదల నిలిచి పోయింది. దీంతో స్థానిక జల విద్యుదుత్పత్తి కేంద్రంలో శనివారం మధ్యాహ్నం నుంచి విద్యుత్ ఉత్పత్తి కూడా ఆగిపోయింది. అయితే, యాసంగి సీజన్ కోసం కాకతీయ కాలువ ద్వారా డిసెంబర్ నెలలో ఆయకట్టుకు నీటి విడుదల చేస్తారు. అప్పటి నుంచి మే నెల చివరి వరకు నీటి విడుదల కొనసాగే అవకాశముంటుంది. అప్పుడు మళ్లీ విద్యుదుత్పత్తి ప్రారంభమవుతుంది. అంటే ఆ ఐదు నెలల కాలంలో మరో 25 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తికి అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
పోచంపాడ్ విద్యుదుత్పత్తి కేంద్రంలో లక్ష్యానికి మించి విద్యుత్ ఉత్పత్తిని సాధించిన అధికారులకు, సిబ్బందికి జెన్కో సీఈ ప్రభాకర్‌రావు అభినందనలు తెలిపారు. వరుసగా రెండో సంవత్సరం కూడా లక్ష్యానికి మించి విద్యుత్ ఉత్పత్తి చేయడం ఆనందంగా ఉందన్నారు. యాసంగి సీజన్లో మరింత విద్యుత్ ఉత్పత్తిని సాధించే అవకాశముందని, మొత్తంగా 125 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలుగుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
స్థానిక జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో క్రమం తప్పకుండా విద్యుత్ ఉత్పత్తి కొనసాగింది. శనివారం నాటి కి 100 మిలియన్ యూనిట్లకు చేరింది. గత పదేండ్లలో వంద ఎం.యూ.లు దాటడం ఇది రెండోసారి మాత్రమే. గతేడాది (2021-22)లో 109 ఎం. యూ. విద్యుత్ ఉత్పత్తి జరిగింది. అయితే, ఈ ఏడాది లో లక్ష్యానికి (75 ఎం.యూ) మించి రెట్టింపు స్థాయి లో ఉత్పత్తి జరిగే అవకాశముంది. విద్యుత్ ఉత్పత్తి సెం చరీ దాటడంతో స్థానిక జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో అధికారులు, సిబ్బంది సంబురాలు నిర్వహించారు.