ఖలీల్‌వాడి, నవంబర్ 12 : నిజామాబాద్ శివారులోని మల్లారం వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాత్రి టౌన్షిప్లో ప్లాట్ల విక్రయానికి ఈనెల 14న నూతన కలెక్టరేట్లో బహిరంగ వేలం నిర్వహించనున్నామని, ఇందుకు సంబంధించి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని ఆర్డీవో రవి తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సంబంధిత శాఖల అధికారులతో శనివారం సమావేశమై వేలం నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించారు. జిల్లా కార్యాలయాల సముదాయ ఆవరణలో కౌంటర్ల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.. ధాత్రి టౌన్షిప్లో మొదటి విడుతలో 80 ప్లాట్ల విక్రయాల కోసం ఈనెల 14న ఉదయం 9 గంటల నుంచి నూతన కలెక్టరేట్లో బహిరంగ వేలం ప్రారంభమవుతుందని తెలిపారు. తొలి రోజున ఉదయం 20 ప్లాట్లకు, మధ్యాహ్న సమయంలో మరో 20 ప్లాట్లకు బహిరంగ వేలం నిర్వహిస్తామని, మరుసటి రోజు 15న కూడా ఇదే తరహాలో మిగతా 40 ప్లాట్లకు వేలం నిర్వహిస్తామని తెలిపారు. ఔత్సాహికులు సకాలంలో హాజరై వేలంలో పాల్గొనాలని కోరారు.
వేలంలో పాల్గొనే వారు కలెక్టర్-నిజామాబాద్ పేరిట రూ. 10 వేల డీడీ తీయాలని, ఆధార్ లేదా పాన్‌కార్డు వెంట తీసుకుని రావాలని సూచించారు. శని, ఆదివారాల్లో సెలవు కారణంగా డీడీలు తీయలేకపోయిన వారి సౌకర్యార్థం న్యూ కలెక్టరేట్లో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేయిస్తున్నామని తెలిపారు. డీడీలు పొందేవారు నిర్ణీత సమయానికన్నా ముందే చేరుకోవాలన్నారు. ఇదివరకు రాజీవ్ స్వగృహ పథకంలో దరఖాస్తు చేసుకొని డబ్బులు చెల్లించిన వారు ఒరిజినల్ రసీదుతో వస్తే వేలంలో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పారు.
అన్ని అనుమతులు, అధునాతన వసతులతో మోడల్ టౌన్‌షిప్‌గా రూపుదిద్దుకుంటున్న ధాత్రి టౌన్షిప్లో ప్లాట్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో టీఎస్ఐఐసీ జిల్లా మేనేజర్ దినేశ్, లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్‌రావు, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, రూరల్ తహసీల్దార్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.