నిజామాబాద్ లీగల్, నవంబర్ 12 : న్యాయ వివాదాలు న్యాయార్థుల మధ్య దీర్ఘకాలం కొనసాగరాదని, న్యాయ వివాదాలను త్వరగా పరిష్కరిద్దామని జిల్లా ప్రధానన్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్పర్సన్ సునీత కుంచాల అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవా సదన్‌లో జాతీయ లోక్ అదాలత్ శనివారం నిర్వహించగా.. ఆమె ప్రారంభించి మాట్లాడారు. కక్షిదారులు కలిసివస్తే న్యాయవివాదాలను త్వరగా పరిష్కరించవచ్చని, వాటికి చట్టబద్ధత లభిస్తుందని అన్నారు.
జాతీయ లోక్‌అదాలత్‌లకు కక్షిదారుల మద్దతు, ఆదరణ లభిస్తున్నదని అన్నారు. అదనపు జిల్లా జడ్జిలు శ్రీనివాస్‌రావు, పంచాక్షరి మాట్లాడుతూ.. ప్రభుత్వ సంస్థల, ప్రభుత్వ రంగ బ్యాంకుల తోడ్పాటు, కక్షిదారుల అభిప్రాయం మేరకు రుణాలు చెల్లించే విధంగా అవార్డులు జారీకావడం సంతోషకరమని అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు రాజేందర్‌రెడ్డి, నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రం గణపతి, న్యాయసేవ సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి, జూనియర్ సివిల్ జడ్జిలు సౌందర్య, గిరిజ, భవ్య, న్యాయవాదులు ప్రవీణ, రజిత, ఝాన్సీరాణి, ఝాన్సీనాయక్, స్వర్ణ, రాజ్‌కుమార్ సుబేదార్, మాణిక్ రాజు, ఆశ నారాయణ, యూనియన్ బ్యాంకు ప్రాంతీయ అధికారి నరేంద్ర కుమార్, కక్షిదారులు పాల్గొన్నారు.
జాతీయ లోక్ అదాలత్‌లో మొత్తం 7,796 కేసులను రాజీపద్ధతిలో పరిష్కరించినట్లు జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి తెలిపారు. రోడ్డు ప్రమాద నష్టపరిహార దావాలు 51 పరిష్కరించి, బాధితులకు రూ.2 కోట్ల 82 లక్షల 30 వేల రూపాయలకు అవార్డులు జారీ చేశామని వెల్లడించారు. 1,800 విద్యుత్ చోరీ కేసులకు గాను విద్యుత్ సంస్థలకు 12 లక్షల 60 వేల రూపాయల లబ్ధి చేకూరినట్లు తెలిపారు. 43 సివిల్ తగాదాల్లో 63 లక్షలకు పైగా కక్షిదారులకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చగలిగామని వివరించారు.