ఖలీల్‌వాడి, నవంబర్ 12: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తున్న ఆర్టీసీ మరో సరికొత్త సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.ఇప్పటికే టికెట్ల రిజర్వేషన్లు, ఇతర ఆర్థిక కార్యకలాపాల్లో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తున్న సంస్థ .. చిల్లర సమస్యలకు చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేటప్పుడు ఇకపై చేతిలో క్యాష్ లేకపోయినా నో ప్రాబ్లమ్. చార్జీలకు సరిపడా చిల్లర కోసం వెతుక్కోవాల్సిన పని కూడా లేదు. స్మార్ట్ ఫోన్‌తో గూగుల్ పే లేదా ఫోన్ పే క్యూర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా డబ్బులు పంపి టికెట్లు తీసుకోవచ్చు.
లేదంటే డెబిట్/క్రెడిట్ కార్డులను స్వైప్ చేసినా టికెట్లు ఇస్తారు. ప్రస్తుతానికి సూపర్ లగ్జరీ, గరుడ, రాజధాని, వోల్వో బస్సుల్లో ఈ అవకాశం కల్పిస్తున్నారు. త్వరలో గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం సిటీ బస్సుల్లో ఏడాదిలోపు రాష్ట్రమంతా డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో గూగుల్ పే, ఫోన్ పే, డెబిట్/క్రెడిట్ కార్డులతో టికెట్లు తీసుకునే అవకాశం కల్పించనున్నారు. ఇందు కోసం ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో 900 కొత్త ఐ టిమ్ (ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూయింగ్ మెషీన్)లను ప్రవేశపెట్టారు. ఎప్పటిలాగే డబ్బులు ఇచ్చి టికెట్లు తీసుకునే పద్ధతి కూడా యథావిధిగా కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.
ఉమ్మడి జిల్లాలోని నిజామాబాద్ డిపో-1లో రాజధాని బస్సులు -14, సూపర్ లగ్జరీ బస్సులు-14, డిపో-2లో రాజధాని బస్సులు -7, లగ్జరీ బస్సులు-6 ఉన్నాయి. బోధన్-13, ఆర్మూర్ -7 (డీలక్స్‌లు) , బోధన్- 10, ఆర్మూర్ -2, కామారెడ్డి -16, ఎక్స్‌ప్రెస్‌లు ఆర్మూర్ -17, బోధన్ -6, డిపో 1-5, డిపో-2-30, బాన్సువాడ -20, కామారెడ్డి- 13, గరుడ ప్లస్ -8 ఉన్నాయి.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్సుల్లో టిమ్ (టికెట్ ఇష్యూయింగ్ మెషీన్)ల ద్వారా ప్రయాణికులకు టికెట్లు ఇస్తున్నారు. వీటి లైఫ్ టైమ్ మూడేండ్లు ఉంది. మారుతున్న టెక్నాలజీకనుగుణంగా గూగుల్ పే, ఫోన్ పే కోడ్ స్కానింగ్, డెబిట్ కార్డుల స్వైపింగ్‌తో టికెట్లు ఇచ్చేలా మార్పులు చేసేందుకుగాను టిమ్‌ల స్థానంలో ఐటిమ్లను ఆర్టీసీ ప్రవేశపెట్టింది. ముందుగా డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో అందుబాటులోకి తీసుకువస్తున్నారు. అందుకే దశల వారీగా ఏడాదిలోపు పల్లెవెలుగు మినహా అన్ని బస్సుల్లో వీటిని అందుబాటులోకి తెస్తామని అధికారులు చెబుతున్నారు. బస్స్టేషన్లు, రిజర్వేషన్ సెంటర్లలో సైతం క్యాష్‌లెస్ లావాదేవీలను అమలుచేయనున్నారు.
ఆర్టీసీ బస్సుల్లో ఎన్నో ఏండ్లుగా చిల్లర సమస్య వేధిస్తోంది. గ్రామాల్లో ప్రయాణికులకు ఇచ్చేందుకు చిల్లర లేకపోవడంతో ఇద్దరు ముగ్గురికి కలిపి పంచుకోవాలని చెబుతూ కండక్టర్లు నోట్లు ఇస్తున్నారు. దీంతో కండక్టర్లకు ప్యాసింజర్లకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. కొత్త పద్ధతితో ఈ చిల్లర సమస్య రాదని అధికారులు చెబుతున్నారు. కాగా ఐటిమ్లతో టికెట్ల జారీపై డ్రైవర్లకు ట్రైనింగ్ ఇస్తున్నామని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్) మునిశేఖర్ తెలిపారు. మొదట్లో కొంత ఇబ్బందిగా అనిపిస్తున్నా కొన్ని రోజులు పోతే వీటిని వాడడం డ్రైవర్లకు సులభమవుతుందన్న నమ్మకం ఉందన్నారు.
చైర్మన్ బాజిరెడ్డి, ఎండీ సజ్జనార్ రాకతో మార్పులుఆర్టీసీ చైర్మన్‌గా బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సంస్థలో అనేక మార్పులు తీసుకువస్తున్నారు. సంస్థలను లాభాల బాట పట్టించారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాలానికి అనుగుణంగా డిజిటల్ పేమెంట్ తీసుకురావడానికి ప్రభుత్వంతో చర్చించి ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా చూస్తున్నారు.
ప్రయాణికుల సౌకర్యార్థంరాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న యూపీఐతో బస్సు టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. మిషన్లు వచ్చిన వెంటనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డిజిటల్ సేవలు కొనసాగుతాయి.
-ఉషాదేవి, ఆర్టీసీ రీజినల్ మేనేజర్