భీమ్గల్, నవంబర్ 10: వెదజల్లే పద్ధతిలో వరిసాగు ఎంతో లాభదాయకమని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. నాట్లు వేసే పద్ధతితో పోలిస్తే సుమారు రూ.7వేల వరకు ఖర్చులు తగ్గుతాయని అంటున్నారు. కూలీల అవసరమే ఉండదని పేర్కొంటున్నారు. రైతులు ఈ పద్ధతిలో వరిసాగు చేసి లాభాలు పొందాలని సూచిస్తున్నారు. పత్తి, మక్కజొన్న, జొన్న తదితర ఆరుతడి పంటలు సాగుచేసినట్లుగానే దమ్ము చేయకుండా వరి విత్తనాలను నేరుగా నేలల్లో విత్తే పద్ధతిని ఇటీవల కొందరు రైతులు అవలంబిస్తున్నారు.
వరిసాగులో రైతులకు ఖర్చును తగ్గించాలనే ప్రధాన ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానంపై విస్తృతప్రచారం చేస్తున్నది. వెదజల్లే పద్ధతిలో వరిసాగుచేయాలని రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా అవగాహన కార్యక్రమాలను కల్పిస్తున్నది. ప్రతి క్లస్టర్ పరిధిలో 50 ఎకరాల్లో వెదజల్లే పద్ధతిలో వరిని సాగు చేయాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. దీనిలో భాగంగా భీమ్గల్ మండలంలోని భీమ్గల్, ముచ్కూర్, చేంగల్, గోన్గొప్పుల, మెండోరా క్లస్టర్ల పరిధిలో 250 ఎకరాల్లో ఈ పద్ధతిలో రైతులతో వరి సాగుచేయిస్తున్నారు.
వెదజల్లే పద్ధతిలో సాగు చేసిన పంటలకు 25 నుంచి 30 శాతం వరకు నీటి వినియోగం తగ్గుతుంది. ఆరుతడి పంటల మాదిరిగా వరిని సాగు చేయవచ్చు. మొలకలు గుబురుగా రావడంతోపాటు ఎక్కడ కూడా ఖాళీ లేకుండా ఒత్తుగా కనిపిస్తుంది. ఈ పద్ధతి ద్వారా ప్రతి ఎకరాకు 10 నుంచి 12 కిలోల వరి విత్తనాలు అవసరం ఉంటాయి. నారుమడి పెంచే ఖర్చు, నాట్లు వేసేందుకు కూలీల ఖర్చు ఉండదు. ఈ పద్ధతి ద్వారా నాటిన వరి పంట 7 నుంచి 10 రోజుల ముందుగా కోతకు వస్తుంది.
కాలువలు, చెరువుల కింద ఉన్న భూముల్లో వరిసాగుకు ఈ పద్ధ్దతి అనుకూలంగా ఉంటుంది. మండలంలోని ముచ్కూర్ క్లస్టర్ పరిధిలో పురాణీపేట్లో అత్యధికంగా సుమారు 150 ఎకరాల్లో ఈ పద్ధతిలో వరిసాగు చేస్తున్నారు. ఈ పద్ధ్దతిని అవలంబించి జిల్లాలోనే భీమ్గల్ మండలం మొదటి స్థానంలో ఉంది.