రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఇండ్లపై ఐటీ, ఈడీ దాడులు చేయడంపై బీసీ కుల సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గురువారం మున్నూరు కాపు సంఘం నేతలు ఆందోళనలు నిర్వహించారు. పలుచోట్ల మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. బీసీల వ్యతిరేక పార్టీ బీజేపీ అని మరోసారి రుజువైందన్నారు. బీజేపీ కుట్రలకు లొంగే ప్రసక్తే లేదని, రాజకీయంగా బీసీలను తొక్కే కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. మునుగోడులో టీఆర్ఎస్ విజయంతో.. కావాలనే టార్గెట్ చేసిందని, ఇక బీజేపీ ఆటలు సాగనివ్వమని హెచ్చరించారు.
మోర్తాడ్, నవంబర్ 10: రాష్ట్రంలో మున్నూరుకాపుల ఎదుగుదలను చూసి ఓర్వలేకే కేంద్రప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని ఎంపీపీ శివలింగుశ్రీనివాస్ ఆరోపించారు. మోర్తాడ్ మండలంలోని శెట్పల్లి గ్రామంలో ప్రధాని నరేంద్రమోదీ దిష్టిబొమ్మను మండల మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో గురువారం దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మున్నూరుకాపు ముద్దుబిడ్డలైన మంత్రి గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఇండ్లలో ఈడీ, ఐటీ దాడులు జరపడాన్ని ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో తాటిపల్లి శ్రీనివాస్, నవీన్, లింబన్న, కన్నారెడ్డి, దినేశ్, సంఘ సభ్యులు పాల్గొన్నారు.
విద్యానగర్,నవంబర్ 10 : రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఇంటిపై కేంద్ర ప్రభుత్వం అక్రమంగా ఈడీ సోదాలు నిర్వహించడంపై మున్నూరు కాపు సంఘ సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించి మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలోని టీఆర్ఎస్ నాయకులపై కుట్రతో కేంద్ర ప్రభుత్వం ఈడీ పేరిట సోదాలు చేయడం సిగ్గు చేటు అని అన్నారు. కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు మామిండ్ల అంజయ్య,మండల అధ్యక్షులు రమేశ్ ,గడీల భాస్కర్, కాసర్ల రాజేందర్, లింగం, సిద్ధరాములు, నర్సింహులు, బండి ప్రవీణ్, మాసుల లక్ష్మీనారాయణ, హన్మాండ్లు, రాజు పాల్గొన్నారు.
డిచ్పల్లి, నవంబర్ 10: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో మున్నూరుకాపులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆ సంఘ నాయకులు దాసరి లక్ష్మీనర్సయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. డిచ్పల్లిలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీకి నూకలు చెల్లాయని, పుట్టగతులు ఉండవన్నారు. మున్నూరుకాపు సామాజికవర్గానికి బీజేపీ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తుందన్నారు. కావాలనే మంత్రి గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యుడు రవిచంద్రపై ఈడీ, ఐటీ దాడులు చేయిస్తుందన్నారు. బీజేపీ ఎంపీలు బండి సంజయ్, అరవింద్ మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందినవారై ఉండి.. దౌర్జన్యంగా ఐటీ దాడులు చేయించడం హేయమైన చర్య అని విమర్శించారు. దాసరి లక్ష్మీనర్సయ్యతోపాటు ఒడ్డెం నర్సయ్య, గోపు నడ్పన్న, మురళి, పాపాయి తిరుపతి, తేలు గణేశ్, పోతర్ల రవి, బూస సుదర్శన్, గోపు వెంకన్న, గట్టవుతాల రాములు, చింతపంటి రాజారాం, మండల మున్నూరుకాపు సంఘ సభ్యులు పాల్గొన్నారు.
సిరికొండ, నవంబర్ 10: బీజేపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు ఆకుల తిరుమల అన్నారు. మండల కేంద్రంలోని మున్నూరు కాపు ఐక్య వేదిక సంఘంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మంత్రి గంగుల కమలాకర్పై ఐటీ, ఈడీ దాడులు చేస్తున్నారన్నారు. గ్రామపంచాయతీలకు కేంద్రం నిధులు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోయాలనే కుట్రతోనే దాడులు నిర్వహిస్తున్నారన్నారు. కార్యక్రమంలో సొసైటీ మాజీ చైర్మన్ గోపాల్, కనుక శ్రీనివాస్, తోట రాజన్న, సతీశ్, గాండ్ల సత్యానంద్, సురేందర్, లక్ష్మీనర్సయ్య, బుక రాజు, చిగురు శ్రీనివాస్, ఆదిత్య, రమేశ్ పాల్గొన్నారు.