విద్యానగర్, నవంబర్ 10 : ధరణి టౌన్ షిప్లో తక్కువ ధరలకే ప్లాట్లు అందుబాటులో ఉన్నాయని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. కామారెడ్డి మండలం అడ్లూర్ గ్రామ శివారులో ఏర్పాటు చేసిన ధరణి టౌన్ షిప్లో టీఎన్జీవోస్, పీఆర్టీయూ ఉద్యోగులతో గురువారం సమావేశం నిర్వహించారు. ప్లాట్లు, గృహాల విక్రయంపై అవగాహన కల్పించారు.మధ్యతరగతి ఉద్యోగులకు అందుబాటు ధరకే ప్లాట్లు, గృహాలు కొనుగోలు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఉద్యోగులకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తామని తెలిపారు. పూర్తి వివరాలకు https:// kamareddy. telangana.gov.in జిల్లా వెబ్సైట్ సంప్రదించాలని ఆయన సూచించారు.
ఆయిల్‌పామ్ సాగుపై రైతులు ఆసక్తి చూపేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులకు సూచించారు. గురువారం ఆయన కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆయిల్‌పామ్ సాగుపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులకు ప్రభుత్వం రాయితీపై ఆయిలపామ్ మొక్కలను పంపిణీ చేస్తోందని తెలిపారు. రాయితీపై బిందు సేద్యం ఏర్పాటు చేసుకోవచ్చన్నారు.
జిల్లాలో 1800 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేయడానికి రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. రైతు వేదికల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఆయిల్‌పామ్ సా గుపై విస్తృతంగా ప్రచారం చేపట్టాలన్నారు. ఆయిల్ పామ్‌లో నాలుగేండ్ల వరకు అంతర్ పంటలు వేసుకోవచ్చని చెప్పారు. ఎకరానికి 50 మొక్కలు నాటాలని సూచించారు. చీడపీడల బెడద ఉండదన్నారు. ఎల్డీఎం రమేశ్‌కుమార్, డీపీవో భాగ్యలక్ష్మి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి విజయ భాస్కర్ రెడ్డి, అధికారులు రాజాగౌడ్, ఆదర్శ రైతు భవానీ ప్రసాద్, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.