మోర్తాడ్, నవంబర్10: ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల కోసం ఫిజికల్ ట్రైనింగ్‌కు ఉచిత శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో వేల్పూర్, బాల్కొండ, భీమ్‌గల్, మోర్తాడ్, కమ్మర్పల్లి మండల కేంద్రాల్లో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
ఉచిత శిక్షణ పొందాలనుకునే అభ్యర్థులు ఈనెల 13వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఏర్గట్ల మండలానికి చెందిన అభ్యర్థులు మోర్తాడ్, కమ్మర్పల్లి పోలీస్స్టేషన్లలో, ముప్కాల్, మెండోరా మండలాలకు చెందిన అభ్యర్థులు బాల్కొండ పోలీస్‌స్టేషన్‌లో దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఈ అవకాశాన్ని బాల్కొండ నియోజక వర్గంలోని అభ్యర్థులు సద్వినియోగం చేసుకో వాలని అధికారులు సూచిస్తున్నారు.