నిజామాబాద్ క్రైం, నవంబర్ 10: జిల్లా కేంద్రానికి చెందిన నిజాముద్దీన్ (30) హత్యకేసును ఛేదించడానికి పోలీసులు రంగంలోకి దిగారు. మల్లారం అటవీప్రాంతంలో సదరు యువకుడిని బుధవారం హత్య చేసి దహనం చేయగా..ఇందుకు సంబంధించిన ఆనవాళ్లను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. మాలపల్లి ప్రాంతానికి చెందిన ఎండీ నిజాముద్దీన్ పది రోజుల క్రితం ముజాహిద్నగర్ ప్రాంతానికి తన తల్లితో కలిసి మకాం మార్చాడు. ఈనెల 4వ తేదీన జిల్లా ప్రభుత్వ దవాఖానకు వచ్చిన నిజాముద్దీన్.. సుమారు గంటన్నరపాటు అక్కడే ఉన్నట్లు సీసీ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించారు.
చివరిసారిగా అక్కడే కనిపించిన సదరు యువకుడు బుధవారం మల్లారం అటవీ ప్రాంతంలో హత్యకు గురై కనిపించాడు. గుర్తుతెలియని వ్యక్తులు హత్యచేసి దహనం చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మృతుడి వద్ద సెల్ఫోన్ సైతం లేకపోవడంతో కేసు దర్యాప్తులో ఆధారాలు లభించడం క్లిష్టంగా మారింది. హత్యకు గురైన ప్రాంతంలో ఓ దాబా నుంచి తెచ్చుకున్న భోజనం ప్యాకెట్లతోపాటు ఉల్లిగడ్డలు, నిమ్మకాయలు లభించాయి.
వీటి ఆధారంగా ఏసీపీ ఏ.వెంకటేశ్వర్ పర్యవేక్షణలో సౌత్ రూరల్ సీఐ జగడం నరేశ్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. జిల్లా దవాఖానతోపాటు నగరంలోని ప్రధానకూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆటో స్టాండ్ల వద్ద ఉన్న డ్రైవర్ల నుంచి సదరు యువకుడి వివరాలు ఏమైనా లభ్యమవుతాయని విచారిస్తున్నారు.
హత్యకు ముందు నిజాముద్దీన్తోపాటు మరో ఇద్దరు యువకులు ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించారు. అయితే ఆ ముగ్గురు సంఘటనా స్థలానికి ద్విచక్ర వాహనంపై వచ్చినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టైర్ గుర్తుల ఆధారంగా ఆ బైక్ కోసం గాలిస్తున్నారు.