బోధన్, నవంబర్ 10: పట్టణ శివారులో బోధన్- ఎడపల్లి రహదారిలో శ్రీదర్శనం క్షేత్రం ఎదురుగా ఉన్న ప్రభుత్వానికి చెందిన నిజాం షుగర్స్ భూమి చుట్టూ రెవెన్యూశాఖ ఏర్పాటుచేసిన కంచెను గుర్తుతెలియని దుండగులు బుధవారం రాత్రి ధ్వంసం చేశారు. గురువారం ఉదయం ఫెన్సింగ్ ధ్వంసమైన నిజాం షుగర్స్ భూములను బోధన్ ఆర్డీవో రాజేశ్వర్, ఏసీపీ కిరణ్‌కుమార్, బోధన్ తహసీల్దార్ వరప్రసాద్, నిజాం షుగర్స్ కోర్ కమిటీ సభ్యుడు విశ్వనాథం, బోధన్ సీఐ ప్రేమ్‌కుమార్ పరీశీలించారు.
పట్టణ శివారులోని 881 సర్వేనంబర్‌లో నిజాం షుగర్స్‌కు చెందిన 8 ఎకరాల భూమి ఉంది. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీవో పర్యవేక్షణలో ఈ భూమి రక్షణ కోసం ఫెన్సింగ్ వేస్తున్నారు. సరిహద్దులో 400 సిమెంట్ స్తంభాలను పాతాల్సి ఉండగా, ఇప్పటివరకు 169 స్తంభాలను పాతారు. రెండు, మూడు రోజులుగా ఈ ఫెన్సింగ్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు వేసిన ఫెన్సింగ్‌ను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వసం చేసినట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వం వేయించిన ఫెన్సింగ్‌ను ధ్వసం చేయడంపై ఆర్డీవో ఆగ్రహం వ్యక్తంచేశారు. విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై బోధన్ పోలీసులు కేసు నమోదుచేశారు.
ప్రభుత్వ భూమి రక్షణ కోసం వేయించిన ఫెన్సింగ్‌ను ధ్వంసంచేసిన వ్యక్తులు ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీవో రాజేశ్వర్ హెచ్చరించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు దుండగులపై పీడీ యాక్ట్‌ను ప్రయోగించేందుకు కూడా వెనుకాడబోమని స్పష్టంచేశారు. పోలీస్ అధికారులు సమగ్రంగా దర్యాప్తుచేయాలని సూచించామన్నారు.